వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యేలకు హైకోర్టు షాక్- ఆ కేసుల ఉపసంహరణ చెల్లదు-ముందుకెళ్తే స్టే హెచ్చరిక
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీకి చెందిన పలువురు ఎంపీ, ఎమ్మెల్యే, ఇతర ప్రజాప్రతినిధులపై కేసుల్ని ఉపసంహరిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. దీంతో గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో నమోదైన ఈ కేసుల నుంచి వారికి విముక్తి లభించింది. అయితే గతేడాది సుప్రీంకోర్టులో ప్రజాప్రతినిధులపై తీవ్రమైన కేసుల ఉపసంహరణపై దాఖలైన పిటిషన్ పై విచారణ సందర్భంగా కీలక ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఇప్పుడు ఇదే వ్యవహారం వైసీపీ ప్రభుత్వం మెడకు చుట్టుకుంటోంది.

వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యేలపై కేసుల ఉపసంహరణ
ఏపీలో వైసీపీకి చెందిన దాదాపు 15 మంది ఎంపీ, ఎమ్మెల్యేలపై గతంలో టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో నమోదైన పలు కేసుల్ని ప్రభుత్వం ఉపసంహరించుకుంది. డీజీపీ, ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలతో పీపీలు ఈ కేసుల్ని వెనక్కి తీసుకున్నారు. దీంతో ఆయా ప్రజాప్రతినిధులు తమకు విముక్తి లభించిందని సంబర పడ్డారు. అయితే ఈ సంతోషం ఎంతోకాలం నిలవలేదు. ఏపీ హైకోర్టులో ప్రభుత్వ నిర్ణయాల్ని సవాల్ చేస్తూ పిటిషన్లు దాఖలయ్యాయి.వీటిపై విచారణ జరిపిన హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.

ఉపసంహరణపై హైకోర్టు సీరియస్
వైసీపీ ఎంపీ, ఎమ్మెల్యేలపై గతంలో నమోదైన కేసుల్ని సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం హైకోర్టుతో సంబంధం లేకుండా నేరుగా ఉపసంహరించుకోవడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. దీనిపై గతంలో సుమోటోగా విచారణ ప్రారంభించిన హైకోర్టు.. ఇలా నేరుగా కేసుల ఉపసంహరణ చెల్లదని నిన్న స్పష్టం చేసింది. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభానుపై నమోదైన పది కేసుల్ని వెనక్కి తీసుకుంటూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు.. ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల్ని ఎందుకు ఉల్లంఘించారని ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది. అయితే ఉపసంహరణ పూర్తి కాలేదని ఆయన తెలిపారు.

హైకోర్టు స్టే హెచ్చరిక
వైసీపీ ప్రజాప్రతినిధులపై దాఖలైన కేసుల ఉపసంహరణ విషయంలో తీవ్రంగా స్పందించిన హైకోర్టు.. ప్రభుత్వం దీనిపై ముందుకెళ్తే మాత్రం అన్ని ఉపసంహరణలపై స్టే ఇస్తామని హెచ్చరికలు జారీ చేసింది. హైకోర్టుతో సంబంధం లేకుండా కేసుల్ని ఉపసంహరిస్తే అది కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని, అదే జరిగితే అన్ని కేసులపై స్టే ఇస్తామని హైకోర్టు హెచ్చరించింది. దీంతో ప్రభుత్వం ఇరుకునపడింది. ఇప్పటికే పలు కేసుల్ని ఉపసంహరిస్తూ ప్రక్రియ మొదలుపెట్టిన ప్రభుత్వం.. దానిపై పునరాలోచన చేయాల్సిన పరిస్ధితి ఏర్పడింది. దీనిపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.