రఘురామకు భారీ షాక్- సీఐడీ విచారణకు హైకోర్టు ఓకే-హైదరాబాద్ లోనే ప్రశ్నించాలని షరతు
ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి, రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకూ మధ్య సాగుతున్న పోరులో ఇవాళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే రఘురామరాజు గతంలో చేసిన విద్వేష వ్యాఖ్యల్ని సీరియస్ గా తీసుకున్న సీఐడీ రాజద్రోహం సహా పలు కేసులు నమోదుచేసింది.ఆ తర్వాత సుప్రీంకోర్టు రాజద్రోహం చట్టాన్ని రద్దు చేయడంతో మిగతా కేసుల్లో విచారణపై ఉత్కంఠ నెలకొంది. అయితే ఏపీ హైకోర్టు ఇవాళ ఆ ఉత్కంఠకు తెరదించింది.

రఘురామకు భారీ షాక్
ఏపీలో వైసీపీ తరఫున ఎన్నికల్లో గెలిచి ఆ పార్టీపైనే కత్తులు దూస్తున్న రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు ఇవాళ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సీఐడీ గతంలో తనపై నమోదు చేసిన కేసులపై ఇప్పటికీ న్యాయపోరాటం చేస్తున్న రఘురామరాజుకు ఇవాళ హైకోర్టు షాక్ ఇచ్చింది.
గతంలో రాజద్రోహం కేసుల్లో విచారణపై సుప్రీంకోర్టు కీలక తీర్పు నివ్వగా.. ఇప్పుడు హైకోర్టు ఆయనకు వ్యతిరేకంగా నమోదైన మిగతా కేసులపై మరో కీలక తీర్పు వెలువరించింది. దీంతో రఘురామకు ఇబ్బందులు తప్పేలా లేవు.

సీఐడీ విచారణకు అనుమతి
తనపై సీఐడీ నమోదు చేసిన కేసులను కొట్టివేయాలని కోరుతూ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా రాజద్రోహం సెక్షన్ మినహా మిగిలిన సెక్షన్ల కింద రఘురామ కృష్ణరాజును విచారించుకోవచ్చని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రెండు వర్గాల మధ్య విధ్వేషాలు రెచ్చగొట్టే విధంగా రఘురామ వ్యాఖ్యలు చేశారని సీఐడీ సుమోటోగా ఆయనపై కేసు నమోదు చేసింది. రాజద్రోహం.. ఐపీసీ 124ఏ, 153ఏ, 505, 120బి సెక్షన్ల కింద కేసు నమోదైంది. పిటిషనర్ రఘురామ తరఫున బి.ఆదినారాయణరావు వాదనలు వినిపించారు.

రఘురామ వాదనతో ఏకీభవించని హైకోర్టు
రాజద్రోహం (ఐపీసీ 124ఎ) చట్టాన్ని సుప్రీంకోర్టు నిలుపుదల చేసిన నేపథ్యంలో పిటిషనర్‌పై ఏపీ సీఐడీ పోలీసులు నమోదు చేసిన మిగిలిన సెక్షన్ల విషయంలో దర్యాప్తు పేరుతో పిలిచి ఇబ్బందులకు గురి చేయకుండా నిలువరించాలని రఘురామ ఈ పిటిషన్ లో కోరారు. పిటిషనర్ ఏదైనా పర్యటనకు సిద్ధమవుతున్న సమయంలో అడ్డుకోవడం కోసం ఉద్దేశపూర్వకంగా సీఐడీ నోటీసులిచ్చి విచారణకు హాజరుకావాలని కోరుతోందన్నారు.
ప్రజాస్వామ్యంలో ప్రతి వ్యక్తికి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉందని, అభిప్రాయాలను వ్యక్తం చేస్తే రాజద్రోహం కింద సీఐడీ సుమోటోగా కేసు పెట్టడం సరికాదని వాదించారు. మరోవైపు సెక్షన్ 124ఏ అమలును సుప్రీంకోర్టు ఇటీవల నిలుపుదల చేసిన నేపథ్యంలో.. ఆ సెక్షన్ విషయంలో తాము ముందుకెళ్లబోమని ప్రభుత్వం తరఫున ఏజీ తెలిపారు. మిగిలిన సెక్షన్ల వ్యవహారంలో దర్యాప్తు కొనసాగిస్తామన్నారు. పిటిషనర్ దర్యాప్తునకు సహకరించేలా ఆదేశించాలన్నారు.

హైదరాబాద్ లో రఘురామ విచారణ
రఘురామరాజును సీఐడీ కస్టడీకి ఇచ్చే విషయంలో గతంలో ఆయన అభ్యంతరాలు వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని తన ఇంట్లో సీఐడీ విచారిస్తే అభ్యంతరాలు లేవన్నారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. ఈ విషయంలో కీలక ఉత్తర్వులు ఇచ్చింది. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం ఎంపీ రఘురామను హైదరాబాద్‌లోని దిల్కుషా గెస్ట్‌హౌస్‌లో విచారించాలని సీఐడీని ఆదేశించింది.
ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు న్యాయవాది సమక్షంలోనే విచారించాలని పేర్కొంది. విచారణ సమయంలో పోలీసులు, హైకోర్టు నిబంధనలు ధిక్కరిస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ధర్మాసనం స్పష్టం చేసింది.