ఈసారి అమ్మఒడి రూ.13 వేలే-మరో వెయ్యి కోసేసిన జగన్ సర్కార్-కారణమిదే
ఏపీలో ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతిష్టాత్మక పథకం అమ్మఒడిలో మరో వెయ్యి రూపాయలు కోత పడనుంది. ఇప్పటికే ఈ పథకంలో భాగంగా ఇవ్వాల్సిన 15 వేల రూపాయల్లో ఓ వెయ్యి రూపాయలు స్కూళ్లలో మరుగుదొడ్ల నిర్వహణ పేరుతో మినహాయిస్తున్న ప్రభుత్వం ఇప్పుడు మరో వెయ్యి కోత విధించేందుకు సిద్ధమైంది. దీంతో లబ్దిదారులు లబోదిబోమంటున్నారు. ఇప్పటికే ఈ పథకం అమలుకు ఎన్నో షరతులు పెడుతున్న ప్రభుత్వం ఇప్పుడు మొత్తాల్లోనూ కోత విధిస్తుండటంపై లబ్దిదారులు గగ్గోలుపెడుతున్నారు.

జగన్ మానసపుత్రిక
దేశంలో ఎక్కడా లేని విధంగా స్కూళ్లకు పిల్లల్ని పంపే తల్లులకు వైసీపీ సర్కార్ ఏటా రూ.15 వేల రూపాయల మొత్తాన్ని అమ్మఒడి పథకం రూపంలో ఇస్తామని హామీ ఇచ్చింది. ఈ హామీ మేరకు అధికారంలోకి రాగానే ప్రభుత్వం రూ.15 వేల రూపాయలు ఇవ్వాల్సి ఉంది. అయితే వివిధ కారణాలతో ఈ పథకంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీంతో లబ్దిదారులపై దీని ప్రభావం తీవ్రంగా ఉంటోంది. ఇప్పటికే ఈ పథకానికి అర్హతల్ని పలుమార్లు మార్చిన ప్రభుత్వం ఇప్పుడు ఇచ్చే మొత్తంలోనూ మార్పులు చేస్తోంది.

వెయ్యి చొప్పున కోతలు
అమ్మఒడి పథకంో భాగంగా మొత్తం రూ.15 వేల రూపాయలు తల్లుల ఖాతాల్లో ఏటా జమ చేయాల్సి ఉండగా.. ఇందులో వెయ్యి రూపాయలు కోత విధించి రూ.14 వేలే ఇస్తున్నారు. అదేమని అడిగితే స్కూళ్లలో మరుగుదొడ్ల నిర్వహణ కోసం ఈ వెయ్యి రూపాయలు కోత విధిస్తున్నట్లు ప్రభుత్వం చెప్పింది. దీంతో తొలి ఏడాది నుంచే అర్హులకు లభించాల్సిన రూ.15 వేలకు బదులు రూ.14 వేలే జమ అవుతోంది. దీంతో తొలి ఏడాది నుంచే వెయ్యి రూపాయల కోతతో ఈ పథకం అమలవుతోంది.

ఇప్పుడు మరో వెయ్యి కోత
గతంలో అమ్మఒడి కింద ఇచ్చే మొత్తంలో మరుగుదొడ్ల పేరుతో వెయ్యి రూపాయలు కోసేసిన సర్కార్.. ఇప్పుడు మరో వెయ్యి రూపాయలు కోత విధించేందుకు సిద్ధమైంది. స్కూళ్లలో మౌలిక వసతుల కల్పన పేరుతో ఈ మొత్తాన్ని కోత విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో జిల్లా విద్యాశాఖాధికారులు స్కూళ్లకు ఈ మేరకు సమాచారం అందిస్తున్నారు. దీంతో ఈ ఏడాది రూ.13 వేల రూపాయలు మాత్రమే లబ్దిదారుల ఖాతాల్లో జమ కాబోతున్నాయి. దీంతో ప్రభుత్వం ఇప్పటివరకూ 2 వేల రూపాయలు కోత విధించినట్లయింది.

లబ్ధిదారులకు చుక్కలు
అమ్మఒడి పథకం ప్రారంభమైనప్పటి నుంచే వేల సంఖ్యలో లబ్దిదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఈ పథకానికి దాదాపు రూ.6500 కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇంత భారీ మొత్తం వెచ్చించే పరిస్ధితి లేకపోవడంతో ప్రభుత్వం ఏటా కోతలు విధిస్తోంది. అర్హతలు సవరిస్తోంది. అలాగే ఈసారి జనవరికి బదులు జూన్ లో ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో ఆరునెలల పాటు ప్రభుత్వానికి ఆర్ధిక పరమైన వెసులుబాటు లభించింది. కానీ జనంలో అమ్మఒడి పథకంపై అంచనాలు తగ్గుతున్నాయి.