టి బిల్లు: అసెంబ్లీకి 40 రోజుల టైం, శీతాకాల సెషన్లో నో
న్యూఢిల్లీ/హైదరాబాద్: విభజన బిల్లును అసెంబ్లీకి పంపించిన తర్వాత అభిప్రాయం తెలిపేందుకు 40 రోజుల సమయం ఇవ్వనున్నారని సమాచారం. మంత్రుల బృందం (జివోఎం) హైదరాబాదు రాజధానిగా పది జిల్లాల తెలంగాణకు మొగ్గు చూపగా, ఐదు రోజుల క్రితం దానిని కేంద్రమంత్రివర్గం ఆమోదించిన విషయం తెలిసిందే.
విభజన బిల్లును కేంద్రం ఇప్పటికే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పంపించింది. దీనిపై రాష్ట్రపతి సంతకం చేసి.. ఈ రోజు సాయంత్రం లేదా రేపు పంపించే అవకాశాలున్నాయి. ప్రణబ్ దక్షిణాఫ్రికా జాతిపిత నెల్సన్ మండేలా అంత్యక్రియలకు వెళ్తున్నారు. అక్కడికి వెళ్లి వచ్చాక కూడా పంపించే అవకాశాలు లేకపోలేదు.

ఆయన తెలంగాణ బిల్లును అసెంబ్లీకి ఎప్పుడు పంపినా నలభై రోజుల సమయం ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. సాయంత్రంలోగా ప్రణబ్ దీనిపై ఓ నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం.
అసెంబ్లీకి విభజన బిల్లు పైన 40 రోజుల సమయం ఇస్తే శీతాకాల సమావేశాల్లో బిల్లు వచ్చే అవకాశం లేదు. బడ్జెట్ సమావేశాల్లో లేదా ప్రత్యేక సమావేశాలు పెట్టి పార్లమెంటులో బిల్లును పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. బిల్లుపై తమకు 45 రోజుల సమయం ఇవ్వాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇటీవల రాష్ట్రపతికి లేఖ రాసిన విషయం తెలిసిందే.
విభజనకు కేబినెట్ ఆమోదం లభించిన రోజే ఆర్ఎల్డీ అధ్యక్షులు అజిత్ సింగ్ మాట్లాడుతూ.. బిల్లు శీతాకాల సమావేశాల్లో వచ్చే అవకాశాలు లేవన్నారు. అయితే 2014 ఎన్నికల్లోపే రెండు రాష్ట్రాలు ఏర్పడుతాయని ఆయన చెప్పారు. ఇదే విషయాన్ని జివోఎం సభ్యులు చెబుతున్నట్లుగా తెలుస్తోంది. బిల్లు శీతాకాల సమావేశాల్లో వచ్చేందుకు ఆస్కారం లేదని చెబుతున్నారట.












Click it and Unblock the Notifications