పవన్ కళ్యాణ్ జనసేనతో మాత్రమే బీజేపీ పొత్తు: బాబు, జగన్ అవినీతిలో కవల పిల్లలంటూ సోము వీర్రాజు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు దాదాపు మరో రెండున్నరేళ్లు ఉన్నప్పటికీ.. ఇప్పట్నుంచే అన్ని రాజకీయ పార్టీలో తమ కార్యక్రమాలతో ఎన్నికల వాతావరణాన్ని ఇప్పుడే తీసుకొస్తున్నాయి. పొత్తులపై రాజకీయ నేతల మాటలు రాజకీయ వేడిని మరింత పెంచుతున్నాయి. జనసేన, బీజేపీ, మరోవైపు జనసేన, టీడీపీ పొత్తులంటూ రాజకీయ చర్చకు దారితీస్తున్నాయి.

పవన్ కళ్యాణ్ జనసేనతో మాత్రమే పొత్తు ఉంటుందన్న సోము వీర్రాజు
తాజాగా, ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మరోసారి పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీతో మాత్రమే పొత్తు ఉంటుందని, కలిసి పోటీ చేస్తామని సోము వీర్రాజు స్పష్టం చేశారు. జనసేనతో తప్ప మరెవరితోనూ పొత్తు ఉండదని ఆయన తేల్చి చెప్పారు. అంతేగాక, 2024లో అధికారంలోకి వస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

అవినీతిలో బాబు, జగన్ కవల పిల్లల్లంట సోము వీర్రాజు ఫైర్
మరోవైపు, వైసీపీ, టీడీపీలపై సోము వీర్రాజు విమర్శలు గుప్పించారు. టీడీపీ, వైసీపీ.. తల్లి, పిల్ల పార్టీలని విమర్శించారు. చంద్రబాబు, జగన్ కుటుంబాలు.. అవినీతిలో కవల పిల్లలు అని ఎద్దేవా చేశారు. ఇద్దరూ కలిసి పోలవరం ప్రాజెక్ట్ నిధులను దోచుకున్నారని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోడీ సంక్షేమ పథకాల ముందు.. ఏపీ సీఎం జగన్ కార్యక్రమాలు దిగదుడుపే అని అన్నారు సోము వీర్రాజు.

ఏపీలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనంటూ సోము వీర్రాజు
తమ పొత్తు జనంతోనేనని సోము వీర్రాజు అన్నారు. తమ పొత్తు జనసేనతో మాత్రమే ఉంటుందని మరోసారి స్పష్టం చేశారు సోము వీర్రాజు. గ్రామం నుంచి నేషనల్ హైవే దాకా బీజేపీ చేస్తున్న అభివృద్ధి ద్వారా ఏపీలో అధికారంలోకి వస్తామన్నారు. ఇందులో ఎలాంటి సందేహం లేదన్నారు. మత్స్యకారులకు రూ. 107 కోట్లు ఇచ్చినట్లు జగన్ యాడ్ ఇచ్చారని, అందులో కేంద్ర ప్రభుత్వమే రూ. 104 కోట్లు ఇస్తుందని సోము వీర్రాజు తెలిపారు.

పొత్తులపై చంద్రబాబు అలా.. పవన్ కళ్యాణ్ ఇలా.. ఒకేలా?
కాగా, జనసేన పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆసక్తి చూపుతున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై చంద్రబాబు ఇటీవల పలు వ్యాఖ్యలు కూడా చేశారు. జనసేన పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు టీడీపీ సిద్ధంగా ఉందనే సంకేతాలను ఇచ్చారు చంద్రబాబు. అయితే, ఓట్లు చీలకుండా ఉండేందుకు పొత్తులు అవసరమని ఇటీవల జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే, టీడీపీతో పొత్తుపై మాత్రం ఆయన క్లారిటీ ఇవ్వలేదు. ఎన్నికల సమయం వరకు ఏదైనా జరగవచ్చని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం గమనార్హం.