ఏపీ బీజేపీ కోర్ కమిటీ ఏర్పాటు-నలుగురు ఎంపీలు సహా 13 మంది-ఇక నెలకో మీటింగ్
ఏపీలో బీజేపీ అధిష్టానం కోర్ కమిటీని ప్రకటించింది. తాజాగా ఏపీ వ్యవహారాలపై దృష్టిసారించిన బీజేపీ హైకమాండ్ ఇవాళ కోర్ కమిటీ సభ్యుల జాబితాను విడుదల చేసింది. ఇందులో నలుగురు ఎంపీలతో పాటు మరో 9 మందికి చోటు దక్కింది. అలాగే ముగ్గురు ప్రత్యేక ఆహ్వానితుల్ని కూడా ఇందులో చేర్చారు. ఇవాళ ప్రకటించిన ఈ కోర్ కమిటీ సమావేశాన్ని తప్పనిసరిగా నెలకి ఒకసారైనా జరపాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఈ కోర్ కమిటీ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.
ఏపీ బీజేపీ రాష్ట్ర కమిటీని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఇవాళ ప్రకటించారు. ఈ కోర్ కమిటీలో 13 మంది సభ్యులు ముగ్గురు ప్రత్యేక ఆహ్వానితులు ఉన్నారు. పార్టీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, జాతీయ ప్రధాన కార్యదర్శి పురందరేశ్వరి, జాతీయ కార్యదర్శి సత్యకుమార్, రాజ్యసభ ఎంపీలు జీవీఎల్, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, సుజనా చౌదరి, రాష్ట్ర పార్టీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, మధుకర్ జి, ఎమ్మెల్సీ మాధవ్, రేలంగి శ్రీదేవి, చంద్రమౌళి, నిమ్మక జయరాజు ఉన్నారు. ప్రత్యేక ఆహ్వానితులుగా నేషనల్ జాయింట్ సెక్రటరీ శివ ప్రకాష్ జి, ఏపీ ఇంచార్జ్ మురళీధరన్, సహ ఇంఛార్జ్ సునీల్ దేవధర్ లకు చోటు కల్పించారు.

తాజాగా దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేసం కోసం ఏపీకి వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్ర నేతలకు యాక్టివ్ గా ఉండాలని దిశానిర్దేశం చేశారు. అలాగే అమరావతి ఉద్యమానికి ఎందుకు మద్దతివ్వడం లేదని ప్రశ్నించారు. అమరావతి పాదయాత్రకు దూరంగా ఉండాలని ఎవరు నిర్ణయం తీసుకున్నారని నేతల్ని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కీలక నిర్ణయాలు తీసుకునేందుకు వీలుగా కోర్ కమిటీని ప్రకటించినట్లు తెలుస్తోంది. తద్వారా భవిష్యత్తులో రాజకీయ నిర్ణయాలన్నీ ఈ కమిటీ ద్వారానే తీసుకునేందుకు వీలు కల్పించారు. మరి ఈ కమిటీ ఏర్పాటు ద్వారా అయినా బీజేపీ తలరాత మారుతుందో లేదో చూడాల్సి ఉంది.