ఏపీపై యూపీ అజెండా రుద్దుతున్న బీజేపీ-కూల్చివేతలు, పేర్ల మార్పు డిమాండ్ల వెనుక?
ఏపీలో బీజేపీ గతంలో ఎన్నడూ లేనంత దూకుడు ప్రదర్శిస్తోంది. వివాదాస్పద అంశాలతో పాటు ఎలాంటి వివాదాలు లేని అంశాలను సైతం తెరపైకి తెచ్చి కొత్త వివాదాలు రేకెత్తించేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే గుంటూరు జిన్నా టవర్, వైజాగ్ కేజీహెచ్ పేరు మార్పులు, లేకుంటే కూల్చివేస్తామన్న హెచ్చరికలు తెరపైకి వస్తున్నాయి. బీజేపీ తీరుతో ఏపీ జనం భయాందోళనలకు గురవుతున్నారు. అదే సమయంలో వారి యూపీ అజెండాను కూడా గుర్తుకుతెచ్చుకుంటున్నారు.

ఏపీలో బీజేపీ కొత్త అజెండా
ఏపీలో బీజేపీ ఇప్పటివరకూ టచ్ చేయని ఓ కొత్త అంశాన్ని తెరపైకి తెస్తోంది. ఓవైపు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, మరోవైపు కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాకపోవడం వంటి కారణాలతో బీజేపీపై ఒత్తిడి పెరుగుతోంది. స్వయంగా మిత్రపక్షం జనసేన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై నిలదీస్తోంది. ఇలా ముప్పేట దాడి జరుగుతున్న వేళ చారిత్రక కట్టడాల పేర్లను మార్చాలంటూ కొత్త అజెండాను తెరపైకి తెస్తోంది. ఇప్పటివరకూ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు సైతం ఈ అంశాలు వివాదాస్పదం కాలేదు. కానీ బీజేపీ ఇప్పుడు వాటిని వివాదాస్పదం చేసేందుకు ప్రయత్నిస్తోంది.

కూల్చివేత హెచ్చరికలు
గుంటుూరు జిన్నా టవర్ పేరు మార్చాలని, లేకుంటే తాము అధికారంలోకి వచ్చాక పేరు మారుస్తామని బీజేపీ వార్నింగ్స్ ఇవ్వడం మొదలుపెట్టింది. అంతటితో ఆగకుండా పేరు మార్చకపోతే తాము జిన్నా టవర్ కూల్చేస్తామంటూ హెచ్చరిస్తోంది. తద్వారా ఒకప్పుడు మత సామర్యానికి ప్రతీకగా నిర్మించిన జిన్నా టవర్ ను అదే మత రాజకీయంతో కూల్చేయాలని చూస్తోంది. దీంతో ఇప్పటివరకూ ఎప్పుడూ వివాదాస్పదం కాని గుంటూరు జిన్నా టవర్ ను వివాదంలోకి లాగింది. ఈ వ్యవహారం స్ధానికంగా ఉండే మైనార్టీలను తీవ్రంగా కలవరపెడుతోంది.

ఏపీలో యూపీ అజెండా
గతంలో యూపీలో చారిత్రక బాబ్రీ మసీదు కూల్చివేత, ప్రముఖ నగరాలైన అలహాబాద్, ఇతర నగరాల పేర్లను మార్చడం వంటి చర్యల్ని బీజేపీ అక్కడ చేపట్టింది. యూపీలో బలోపేతం అయ్యేందుకు వీలుగా స్ధానికుల్ని ఆకట్టుకునేందుకు బీజేపీ ఇలాంటి చర్యలకు దిగడంతో పాటు వాటిని ఇప్పటికీ సమర్ధించుకుంటోంది. అయోధ్యలో రామ జన్మభూమి వివాదం, మధురలో శ్రీకృష్ణ జన్మస్ధానం వివాదంతో రాజకీయంగా లబ్ది పొందేందుకు ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉంది. ఇప్పుడు అదే అజెండాను ఏపీలోనూ అమలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది.

బీజేపీ ఎత్తులు ఫలిస్తాయా?
ఏపీలో యూపీ అజెండాను రుద్దేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా చారిత్రక కట్టడాల పేర్ల మార్పును తెరపైకి తెస్తోంది. ఆ తర్వాత నగరాలు, పట్టణాల పేర్ల మార్పు కోరే అవకాశాలూ లేకపోలేదు. ఇందుకు వైసీపీ ప్రభుత్వం అంగీకరించకపోతే దాన్ని టార్గెట్ చేస్తూ ప్రజల్లో విభజన తెచ్చేందుకు ప్రయత్నించే ప్రమాదం కూడా పొంచి ఉంది. అయితే ఈ యూపీ అజెండాను ఏపీ ప్రజలు ఎంతవరకూ ఆమోదిస్తారన్నదే ఇప్పుడు ప్రశ్న.
గతంలో కడప జిల్లాలో టిప్పుసుల్తాన్ విగ్రహంపైనా ఇదే తరహా రగడ చేసిన బీజేపీ చివరకు వైసీపీ సర్కార్ వెనక్కి తగ్గేలా చేసింది. బీజేపీకి ఎలాంటి అవకాశం ఇవ్వరాదనే ఉద్దేశంతో ఉన్న వైసీపీ.. ఈసారి ఏం చేయబోతోందన్నది కూడా ఆసక్తికరమే.