
పవన్‌కల్యాణ్‌కు ''రూట్‌మ్యాప్'' ఇచ్చిన బీజేపీ!! నో TDP??
జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు భారతీయ జనతాపార్టీ ఢిల్లీ పెద్దలు రూట్ మ్యాప్ ఇచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సభలో పవన్ మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గద్దె దించడానికి పొత్తులకు తాను సిద్ధంగా ఉన్నానని, బీజేపీ ఇచ్చే రూట్ మ్యాప్ కోసం ఎదురు చూస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా ఆ రూట్‌మ్యాప్ పవన్‌కు అందిందని జనసేన వర్గాల నుంచి అందుతున్న సమాచారం.

ఎన్నికలకు కలిసే వెళదాం?
ఆంధ్రప్రదేశ్‌లో 2024లో జరిగే ఎన్నికలను దృష్టిలో ఉంచుకోవద్దని, 2029 ఎన్నికలే లక్ష్యంగా జనసేన-బీజేపీ కలిసి వెళదామని చెప్పినట్లు సమాచారం. బీజేపీ ఎప్పుడూ ఎన్నికలకు ముందుగా ఏ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించలేదని, ఆ సాంప్రదాయం కూడా లేదన్నారు. 2024 లోక్ సభ ఎన్నికలు ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్మోహన్రెడ్డి మనకు నమ్మకస్తుడైన మిత్రుడిగా ఉన్నాడని, మీరు చెబుతున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పక్క రాష్ట్రంలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నారుకదా! అని అన్నట్లు తెలుస్తోంది.

2024 ఫలితాల గురించి మీరు పట్టించుకోవద్దు?
2024 ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా మీరు పట్టించుకోవద్దని, కావాలంటే మీకు ఆర్థికంగా కూడా అండదండలదిస్తామని, అవసరమనుకుంటే కేంద్రంలో అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. పవన్ కల్యాణ్‌తో భేటీ అయిన తర్వాత ఆయనకు మరికొన్ని హామీలిచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీతో మాత్రం కలిసి పోటీచేసే అవకాశం లేదని రూట్‌మ్యాప్ ద్వారా స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

పవన్‌కల్యాణ్ స్పందన కోసం ఎదురుచూస్తున్న జనసేన శ్రేణులు
భారతీయ జనతాపార్టీ నుంచి అందిన రూట్‌మ్యాప్ ప్రకారం బీజేపీ-జనసేన కలిసి వెళదామనుకుంటున్నాయని స్పష్టమవుతోంది. అయితే పవన్ కల్యాణ్ అందుకు సిద్ధంగా ఉన్నారా? లేరా? అనేది మాత్రం స్పష్టమవలేదు. ఆత్మకూరు ఉప ఎన్నికల్లో కూడా ఆయన బీజేపీకి మద్దతు పలకలేదు. ఎక్కడా జనసేన జెండా ఎగరలేదు. బీజేపీ నిర్వహించిన గోదావరి గర్జనకు కూడా పవన్‌కు ఆహ్వానం అందలేదు. ఇప్పుడు జనసేనాని తీసుకునే నిర్ణయంపై పార్టీ భవిష్యత్తు ఆధారపడివుంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.