అమరావతే రాజధాని - మూడు రాజధానులు రాజకీయ నినాదమే : బీజేపీ నేత జీవీఎల్..!!
ఏపీ రాజధానిగా అమరావతే ఉంటుందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నర్సింహా రావు స్పష్టం చేసారు. ఆయన అమరావతి గ్రామాల్లో పర్యటించి..రైతులతో ముంతనాలు సాగించారు. మందడంలోని టిడ్కో గృహాలను పరిశీలించిన నరసింహారావు.. లబ్ధిదారులతో మాట్లాడారు. ఇప్పటికే అమరావతిలో నిర్మాణం పూర్తి కాని కేంద్ర ప్రభుత్వ సంస్థలు..కార్యాలయాల నిర్మాణాలను వెంటనే పూర్తి చేయాలని కోరుతూ ఆయన కేంద్ర మంత్రులకు లేఖలు రాసారు. అమరావతి హైకోర్టు అని స్పష్టం చేసిందని..రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్ కు వెళ్లలేదనే విషయాన్ని ఆయన గుర్తు చేసారు. అయితే, కోర్టు ఆరు నెలల్లో నిర్మాణం చేయాలని చెబితే..అరవై నెలలు కావాలంటూ అఫిడివిట్ దాఖలు చేయటం సరి కాదన్నారు.

సాధ్యం కాదనే అప్పీల్ కు వెళ్లలేదు
అమరావతిలో కేంద్ర ప్రభుత్వ సంస్థల నిర్మాణాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసిన నిర్మాణాలను జీవీఎల్ పరిశీలించారు. అమరావతి అభివృద్ధికి కేంద్రం రూ.1500 కోట్లు ఇచ్చిందని ఎంపీ చెప్పారు. జగన్ ప్రభుత్వం కనీసం మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేదని వ్యాఖ్యానించారు. రవాణా మార్గం లేక కేంద్ర సంస్థలు కొన్ని నిర్మాణాలు చేపట్టలేదని తెలిపారు. రాజకీయ కారణాలతో రాష్ట్ర అభివృద్ధిని ఆపడం

ఇక, రాజకీయ నినాదంగానే నిలుస్తుంది
సరికాదన్నారు. అమరావతి రాజధానిగా.. రైతులకు అండగా ఉంటామని జీవీఎల్ స్పష్టం చేశారు. మూడు రాజధానులు సాధ్యం కాదనే విషయం ప్రభుత్వానికి అర్దం అయిందని వ్యాఖ్యానించారు.
దీంతో..ఇక మూడు రాజధానులు అనేది రాజకీయ నినాదంగా మాత్రమే ఉంటుందని చెప్పుకొచ్చారు. అదే సమయంలో రాజధాని పైన నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశంగా కేంద్రం ఇప్పటికే పార్లమెంట్ వేదికగా వెల్లడించిన అంశాన్ని ఆయన గుర్తు చేసారు. తిరుపతిలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆ సమయంలో పార్టీ నేతలతో అమరావతి రైతులకు మద్దతుగా నిలవాలని సూచించారు. ఆ తరువాత అమరావతి రైతులు నిర్వహించిన న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్ర లోనూ బీజేపీ నేతలు పాల్గొని సంఘీభావం ప్రకటించారు.

అమరావతి రైతులకు భరోసా
పార్టీ రాష్ట్ర నేతలు పలు మార్లు తాము అమరావతికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసారు. అయితే, ప్రభుత్వం తాజాగా మూడు రాజధానుల బిల్లు ఉపసంహరించుకోవటం... హైకోర్టు అమరావతి పైన స్పష్టమైన తీర్పు ఇవ్వటంతో..అమరావతి ఇక రాజధానిగా కొనసాగుతుందని స్థానిక రైతులు విశ్వసిస్తున్నారు. ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సైతం వారికి మద్దతు ప్రకటిస్తుండటం కలిసొచ్చే అంశంగా భావిస్తున్నారు.