రఘునందన్ విజయ రహస్యం చెప్పిన పవన్ కల్యాణ్ -బండిని ఆకాశానికెత్తుతూ -దుబ్బాక ఫలితంపై జనసేనాని
ఆంధ్రప్రదేశ్ లో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీకి కేవలం ఒకే సీటు దక్కింది.. అదే తెలంగాణలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూడా సింగిల్ సీటుకే పరిమితం అయిపోయింది. కాలక్రమంలో జనసేన-బీజేపీ మిత్రులైపోయారు. ఇప్పుడు తెలంగాణలోని దుబ్బాక స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో విజయం సాధించడం ద్వారా బీజేపీ బలం రెండుకు పెరిగింది. మరి ఏపీలోనూ ఏదైనా ఉప ఎన్నిక వస్తే జనసేన కూడా సత్తాచాటుతుందా అనే హైపోథెటికల్ ఊహను పక్కన పెడితే, తన గెలుపుపై దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు సైతం మీడియాతో మాట్లాడారు.
దుబ్బాక ఫలితంపై ఈసీ ట్విస్ట్ -అధికారికం కాదు -ఈవీఎంలలో లోపాలు -దిమ్మతిరిగేలా లెక్కలు

దుబ్బాక ఫలితంపై పవన్ స్పందన..
సీఎం కేసీఆర్ సొంత జిల్లా సిద్దిపేట పరిధిలోని దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నిక ఫలితాలు మంగళవారం వెలువడ్డాయి. ఎన్నికల సంఘం ఇంకా విజేతను అధికారికంగా ప్రకటించాల్సి ఉండగా, బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు 1118 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందినట్లు వార్తలు రావడం, పార్టీ శ్రేణులు సంబురాల్లో మునిగిపోవడం చకాచకా జరిగిపోయింది. దుబ్బాక ఫలితంపై జనసేనాని పవన్ కల్యాణ్ తనదైన శైలిలో స్పందించారు. సదరు ప్రకటనలో ఆయన ఆసక్తికర కామెంట్లుచేశారు.
దుబ్బాక ఫలితంపై మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు -బీజేపీ పేరెత్తకుండా ప్రెస్మీట్

రఘునందన్ రహస్యమిదే..
రఘునందన్ రావు వ్యక్తిత్వం, ప్రజా సేవలో చూపించే నిబద్ధత వల్లే ఆయనకు విజయ హారం దక్కిందని పవన్ కల్యాణ్ అన్నారు. రాజకీయాలను సక్రమ మార్గంలో నడిపించడం యువత వల్లే సాధ్యం అవుతుందని, దుబ్బాక ఉప ఎన్నికలో యువత విశేష సంఖ్యలో పాల్గొనడం శుభ పరిణామమని జనసేనాని చెప్పారు. ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ సారధి బండి సంజయ్ కుమార్ ను పవన్ ఆకాశానికెత్తేశారు..

సంజయ్ వల్లే దుబ్బాక గెలుపు..
బీజేపీ తెలంగాణ శాఖకు నాయకత్వ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ఇవాళ దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం వరకు బండి సంజయ్ చూపించిన నాయకత్వ పటిమ పార్టీ విజయానికి మార్గం వేసిందని పవన్ కల్యాణ్ చెప్పారు. బీజేపీలోని అన్ని వర్గాలను సమాయత్తం చేయడం ద్వారా ఆయన విజయం సాధించారని, ఇందుకుగానూ రఘునందన్ తోపాటు సంజయ్ ని కూడా అభినందిస్తున్నానని జనసేనాని మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. మరోవైపు..

అందుకే గెలిపించారన్న రఘునందన్..
దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాల్లో మొత్తం 23 రౌండ్ల కౌంటింగ్ జరగ్గా, ప్రతి రౌండు లోనూ ఆధిక్యం మారుతూ చివరికి 1118 ఓట్లతో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విజయం సాధించారు. కౌంటింగ్ హాలు నుంచి బయటకొచ్చిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. దుబ్బాక ప్రజలు చైతన్యవంతులని, అందుకే బీజేపీని గెలిపించారని అన్నారు. తనకు ఓటేసిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు. దుబ్బాక స్థానంలో గతంలో రెండు సార్లు ఓడిన రఘునందన్ మూడో ప్రయత్నంలో విజయం సాధించడం గమనార్హం. అయితే, ఈ గెలుపును ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.