
వివేకా హత్యకేసులో జగన్ రెడ్డి ప్రధాన నిందితుడు; అడ్డంగా దొరికి కూడా బొంకుతారా: టీడీపీ ధ్వజం
వివేకానంద రెడ్డి హత్య కేసులో వైసిపి నాయకులు అడ్డంగా దొరికారని, అయినప్పటికీ వైసిపి సలహాదారులు బ్లాక్ మెయిల్ చేస్తూ స్టేట్మెంట్లు ఇస్తున్నారని టిడిపి పోలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇదే సమయంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కూడా జగన్ సూత్రధారి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడిన బోండా ఉమ పక్కా ప్రణాళిక ప్రకారమే మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య జరిగిందని ఆరోపణలు గుప్పించారు.
అబ్బాయిలు బాబాయ్ ని వేసేశారు.. ఇది వైఎస్ ఇంటి గొడ్డలిపోటని సీబీఐ తేల్చింది: లోకేష్

ఎంపీ అవినాష్ రెడ్డిని కాపాడటం కోసం వైసీపీ యత్నం : బోండా ఉమా
ఎంపీ అవినాష్ రెడ్డిని కాపాడటం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని బోండా ఉమా ఆరోపణలు చేశారు. సీబీఐ విచారణను సజ్జల తప్పుబట్టడం బరితెగింపు అని బోండా ఉమ విమర్శనాస్త్రాలు సంధించారు. హత్యకు ప్రధాన కారణం అవినాష్ రెడ్డి అని సీబీఐ స్పష్టం చేసినప్పటికీ ఇంకెంతకాలం బొంకుతారని బొండా ఉమా ప్రశ్నించారు. వైసిపి నాయకులు హత్య చేసిన వారిని, చేయించిన వారిని కాపాడాలని ప్రయత్నం చేస్తున్నారని, ఈ ప్రయత్నాన్ని చూసి ప్రజలు నివ్వెరపోతున్నారు అని బోండా ఉమా మండిపడ్డారు.

దస్తగిరి అప్రూవర్ గా మారక పోవడంతో తాడేపల్లి లో వణుకు మొదలైంది
ప్రతిపక్షంలో ఉండగా వివేకానంద రెడ్డి హత్య పై సీబీఐ విచారణ కోరిన విషయం మరిచారా అంటూ బోండా ఉమా ప్రశ్నించారు. అప్పుడు టీడీపీపై బురద చల్లే ప్రయత్నం చేశారని బోండా ఉమా విమర్శించారు. వైసిపి నాయకులు సీబీఐని కూడా బ్లాక్ మెయిల్ చేసే పరిస్థితికి వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దస్తగిరి అప్రూవర్ గా మారక పోవడంతో తాడేపల్లి లో వణుకు మొదలైందని బోండా ఉమ విమర్శించారు. వివేకా హత్య ను మొదట గుండెపోటుతో చనిపోయారని చిత్రీకరించారని జగన్ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో సీబీఐ విచారణ కోరారని పేర్కొన్నారు.

సీబీఐ విచారణ వద్దన్నది అవినాష్ రెడ్డి కోసమేనా? బోండా ఉమా
అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ విచారణ అవసరం లేదని చెప్పారని బోండా ఉమా గుర్తు చేశారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫిబ్రవరి 6 2020న సిబిఐ విచారణ అవసరం లేదని హైకోర్టులో పిటిషన్ వెనక్కి తీసుకున్నారని బోండా ఉమా పేర్కొన్నారు. ఎంపీ అవినాష్ రెడ్డి ని తప్పించడం కోసమే సిబిఐ విచారణ వద్దని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారని బొండా ఉమా పేర్కొన్నారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి పై నమ్మకం లేక సునీత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిందని బోండా ఉమా స్పష్టం చేశారు.

వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు ఏపీ సీఎం జగన్ : మాజీ మంత్రి కొల్లు రవీంద్ర
ఇదిలా ఉంటే మాజీమంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపణలు గుప్పించారు. జగన్ తో పాటు అతని కుటుంబ సభ్యులను సిబిఐ అధికారులు విచారణ జరపాలని కొల్లు రవీంద్ర డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఎంపీ అవినాష్ రెడ్డి ని సానుభూతితో గెలిపించడం కోసమే వివేకానంద హత్య చేసి సొంత మీడియాలో టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆరోపణలు గుప్పించారు అని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు .సిబిఐ నిష్పక్షపాతంగా విచారణ జరిపి దోషులను శిక్షించాలని కొల్లు రవీంద్ర డిమాండ్ చేశారు. వివేకా కుమార్తె సునీత చేస్తున్న పోరాటంతో నిజాలు వెలుగులోకి వస్తున్నాయని కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.