పైసావసూల్ జగన్ రెడ్డి; కొత్త జిల్లాలలో భూములవిలువ పెంచింది అందుకే: బోండా ఉమ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి పాలనా వైఫల్యాలపై తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఏపీ త్వరలో మరో శ్రీలంక కాబోతోందని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ విరుచుకుపడ్డారు. ప్రస్తుతం ఏపీ బీహార్ లా ఉందని, అతి త్వరలో ఏపీ మరో శ్రీలంక కాబోతుందని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమా వ్యాఖ్యానించారు.

వైసిపి రాజకీయ లబ్ధి కోసమే కొత్త జిల్లాల ఏర్పాటు: బోండా ఉమా
మంగళవారం మీడియాతో మాట్లాడిన బోండా ఉమ శ్రీలంక అధ్యక్షుడి ఇంటిని ముట్టడించినట్టే, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంటిని త్వరలో ప్రజలు ముట్టడిస్తారని పేర్కొన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి బాదుడే బాదుడు అనే కొత్త పథకాన్ని ప్రారంభించారని బోండా ఉమా మండిపడ్డారు. వైసిపి రాజకీయ లబ్ధి కోసమే కొత్త జిల్లాల ఏర్పాటు చేసిందని విమర్శించారు. జిల్లాలను పెంచమని ఏ రాజకీయ పార్టీ అయినా జగన్ ను అడిగిందా ప్రశ్నించిన బోండా ఉమా కొత్త జిల్లాల ఏర్పాటుతో మరో బాదుడుకు ప్రభుత్వం సిద్ధమైందని మండిపడ్డారు.

కొత్త జిల్లాలలో భూముల విలువ పెంచింది అందుకే
కొత్త జిల్లాలలో భూముల విలువ పెంచారు అంటే కొత్త పన్నులు వేయడానికి ప్రభుత్వం సిద్ధమైనట్లుగా అర్థమని బోండా ఉమ విమర్శించారు. ఏపీ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందని మండిపడిన బోండా ఉమా, భూముల విలువ ఎందుకు పెంచారో ఒక్క కారణం ప్రభుత్వం చెప్పగలదా అంటూ ప్రశ్నించారు. ఆరు నెలల్లో 30 శాతం ఇంటి పన్ను పెంచిన ఏకైక ప్రభుత్వం జగన్ ప్రభుత్వం మాత్రమేనని బోండా ఉమా పేర్కొన్నారు.

మూడేళ్ళ జగన్ పాలనలో ఏపీ కుక్కలు చింపిన విస్తరిగా మారింది
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మూడేళ్ల పాలనలో కుక్కలు చింపిన విస్తరిలా జగన్ మార్చాడని బోండా ఉమా మండిపడ్డారు. జగన్ బాదుడే బాదుడు అంశాన్ని ప్రతి గడపకు తీసుకువెళతామని పేర్కొన్న ఆయన జగన్ పాలన లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు అంటూ విమర్శలు గుప్పించారు. జగన్ ఢిల్లీ పర్యటన తన సొంత ప్రయోజనాల కోసమే అంటూ బోండా ఉమ విమర్శించారు. అన్ని ధరలు పెంచేశాడు.అందరినీ మోసం చేశాడు.. ఇదంతా ఒక్క ఛాన్స్ విధ్వంసమే అంటూ సోషల్ మీడియాలోనూ జగన్ పాలనపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

పైసా వసూల్ జగన్ రెడ్డి ... బాడుడుకు బ్రాండ్ అంబాసిడర్
పైసా వసూల్ జగన్ రెడ్డి అంటూ మండిపడిన బోండా ఉమా కరెంట్ ఛార్జీలు పెంచనని హామీ ఇచ్చి మూడేళ్లలో ఏకంగా ఏడుసార్లు కరెంట్ చార్జీలు పెంచిన అసమర్థ సీఎం జగన్ రెడ్డి అంటూ ద్వజమెత్తారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి, ధరలు పెంచుతూ ప్రజల నుంచి పైసా వసూలు చేస్తున్నాడు అంటూ విమర్శించారు. అప్పులు, నూనెలు, గ్యాస్, పెట్రోల్ చివరికి చెత్త పన్నులు, ఇంటి పన్నులు కూడా పెంచి బాదుడుకు బ్రాండ్ అంబాసిడర్ గా మారాడని జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేశారు బొండా ఉమ.