బొత్సకు ఎమ్మెల్సీ పోస్ట్: జగన్‌పార్టీలో అసంతృప్తి, కానీ
విజయవాడ: బొత్స సత్యనారాయణ చేరిక పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో పలువురు అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు బొత్స సత్యనారాయణ జగన్‌పై అనేక విమర్శలు చేశారు. అటువంటి వ్యక్తిని జగన్ స్వయంగా పార్టీలోకి ఆహ్వానించడంపట్ల వైసీపీలో కొంత అసంతృప్తి ఉంది.
అయితే, అది అంతంత మాత్రమేనంటున్నారు. వైసీపీ ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ, అధికార పార్టీని ఎదుర్కోలేకపోతోంది. చంద్రబాబును నేరుగా ఢీకొనలేకపోతున్నారు. సుమారు పదేళ్లు అధికారంలో ఉన్న బొత్స ఐదేళ్లు వైయస్ మంత్రివర్గంలో పని చేశారు.
అనంతరం కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి వర్గంలో ఉంటూ చంద్రబాబును తీవ్రంగా విమర్శించిన దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీని ఎదుర్కొనాలంటే, బొత్సను ఆహ్వానించడమే మేలని వైసీపీ అధిష్ఠానం భావించి ఈ నిర్ణయం తీసుకుందని అంటున్నారు.

ఎమ్మెల్సీ పదవి
విశాఖ జిల్లాలో స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి త్వరలో రెండు ఎమ్మెల్సీ పదవులకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో ఒక సీటును టీడీపీ కైవసం చేసుకునే అవకాశముంది.
రెండో సీటును దక్కించుకోడానికి వైసీపికి అవకాశాలు ఉన్నాయి. దీంతో ఈ ఎన్నికల్లో బొత్సను బరిలోకి దించడానికి వైసీపీ సిద్ధపడుతోంది. ఎమ్మెల్సీగా ఎన్నికైతే, ప్రభుత్వంతో నేరుగా పోరాడడానికి బొత్సకు అవకాశం లభిస్తుందని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications