పొత్తుపై కుర్చీలాట: అసద్‌తో బొత్స భేటీ, కెసిఆర్ గాలం
హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. కొంతకాలం క్రితం కాంగ్రెసు పార్టీకి గుడ్ బై చెప్పిన మజ్లిస్ పార్టీతో ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ చర్చలు జరుపుతున్నారు. మజ్లిస్ పొత్తు కోసం కాంగ్రెసు తహతహలాడుతోంది. మజ్లిస్ పార్టీ అధ్యక్షులు, హైదరాబాద్ పార్లమెంటు సభ్యులు అసదుద్దీన్ ఓవైసీతో బొత్స గురువారం ఉదయం భేటీ అయ్యారు. పొత్తుల పైనే చర్చలని సమాచారం.
కిరణ్ వల్లే..!
దాదాపు పదిహేనేళ్ల క్రితం తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పిన తర్వాత మజ్లిస్ పార్టీ కాంగ్రెసు పార్టీతోనే ఉంటోంది. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన కొన్నాళ్లకు కాంగ్రెసు పార్టీతో మజ్లిస్ పార్టీ తెగతెంపులు చేసుకుంది. కిరణ్ వల్లనే విభేదాలు వచ్చి, దూరం జరిగాయనే వాదన ఉంది. ఇప్పుడు బొత్స కూడా తమ భేటీలో అదే చెప్పే అవకాశముంది. తద్వారా మళ్లీ మజ్లిస్‌ను తమ వైపుకు తీసుకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.

కెసిఆర్ గాలం
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు కూడా మజ్లిస్ పార్టీకి గాలం వేస్తున్నారు. తెలంగాణలో మజ్లిస్ పార్టీతో కలిసి వెళ్లాలనే యోచనలో కెసిఆర్ ఉన్నారు. ఆ పార్టీతో తానే చర్చలు జరుపుతానని చెప్పారు.
ఎవరికి వారే...
తెలంగాణ నేపథ్యంలో తెరాస, కాంగ్రెస్ పార్టీలు మజ్లిస్ పార్టీతో పొత్తు కోసం తహతహలాడుతున్నాయి. తెరాస, మజ్లిస్ పార్టీలతో కలిసి వెళ్లాలని కాంగ్రెసు భావిస్తోంది. మరోవైపు మజ్లిస్ పార్టీని మచ్చిక చేసుకోవాలని తెరాస భావిస్తోంది. ఇంకోవైపు రాష్ట్రవ్యాప్తంగా పార్టీని విస్తరించాలని చూస్తున్న మజ్లిస్ వారితో కలిసి వెళ్లాలా లేక కలిసి వెళ్లలా అని ఆలోచిస్తున్నారు. కలిసి వెళ్లి ఆయా జిల్లాల్లో తమకు బలం ఉన్న చోట్ల పోటీ చేసి, మిగిలిన స్థానాల్లో కాంగ్రెసు పార్టీకి మద్దతిచ్చే అవకాశాలు లేకపోలేదు.












Click it and Unblock the Notifications