బిజెపికి చిత్తశుద్ధి లేదు: బొత్స, ‘చంద్రబాబు ఆ భయంతోనే నోరెత్తడం లేదా?’
విశాఖపట్నం: రాష్ట్రంలో కరువు పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయని, కరువును ఎదుర్కోవడంలో చంద్రబాబునాయుడు సర్కారు విఫలమైందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ధర్నా కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలిపారు.
గుంటూరు జిల్లా మాచర్లలో జరిగే ధర్నాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొంటారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా సాధించే విషయంలో చంద్రబాబు ప్రభుత్వానికి చిత్తశుద్ధిలేదని బొత్స విమర్శించారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని ఆయన డిమాండ్ చేశారు.
రాష్ట్ర విభజన తర్వాత ఆర్థికపరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరమేమీ లేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి చౌధురి చేసిన ప్రకటనపై బొత్స నిప్పులు చెరిగారు. అయినా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న చిత్తశుద్ధి బీజేపీకి లేదని ఆయన ఆరోపించారు.
ఇక న్యాయమైన హక్కును సాధించుకునే దిశగా అడుగులు వేయాల్సిన టీడీపీ ప్రభుత్వానికి ఆ ఆలోచనే లేకుండాపోయిందని ఆయన ధ్వజమెత్తారు.

చంద్రబాబులో స్పందనేది
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరిపై ఏపీ పీసీసీ ఉపాధ్యక్షులు శైలజానాథ్, తులసీరెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శనివారం వారు హైదరాబాద్‌లో మాట్లాడుతూ.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనవసరమని కేంద్రమంత్రి ప్రకటించినా సీఎం చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదని వారు ప్రశ్నించారు.
ఓటుకు నోట్ల కేసు చంద్రబాబును బాబును భయపెడుతోందా? అని వారు సందేహం వ్యక్తం చేశారు. సొంత ప్రయోజనాల కోసం చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని విమర్శించారు. కొడుకు లోకష్‌ను సీఎం చేసేందుకు ఇతర పార్టీల నేతల ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని చంద్రబాబుపై మండిపడ్డారు. ప్రతిపక్షాలనే లేకుండా చేయాలనుకుంటున్నారని ఆరోపించారు.
ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ పెట్టిన ప్రైవేట్ నెంబర్ బిల్లును టీడీపీ వ్యతిరేకించిందని వారు ఈ సందర్బంగా గుర్తు చేశారు. కృష్ణా నదిపై తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న పాలమూరు, రంగారెడ్డి, డిండి ప్రాజెక్టుల వల్ల ఏపీ ఎడారిగా మారుతుందని శైలజానాథ్, తులసిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
తెలంగాణ చేపడుతున్న అక్రమ ప్రాజెక్టులను ఆపాలంటూ ప్రధాని మోడీపై ఒత్తిడి పెంచాలని చంద్రబాబుకు వారు సూచించారు. కేంద్రంతో పోరాడి ప్రత్యేక హోదా సాధిస్తారా?, తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకుంటారా?.. లేక ముఖ్యమంత్రి స్థానం నుంచి దిగిపోతారో చంద్రబాబే తేల్చుకోవాలని స్పష్టం చేశారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!