ఏపీలో ఆగని విగ్రహాల విధ్వంస కాండ .. టెక్కలిలో మరోమారు బుద్ధుడి విగ్రహం ధ్వంసం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆలయాలపై దాడులు, విగ్రహ విధ్వంస ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. రామతీర్థం ఘటనతో మొదలైన విగ్రహ ధ్వంస కార్యక్రమం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఘటనలతో ఆందోళనకు కారణమవుతుంది .విగ్రహాల ధ్వంసంపై ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు పర్వం కొనసాగుతోంది.

విగ్రహాల ధ్వంసం ఘటనతో రాజకీయ రణరంగం ఇప్పుడు కురుక్షేత్ర సంగ్రామం గా
రామతీర్థం ఘటనతో మొదలైన రాజకీయ రణరంగం , ఇప్పుడు కురుక్షేత్ర సంగ్రామం గా మారింది. విగ్రహాల విధ్వంసంపై ప్రభుత్వం పోలీసులు అప్రమత్తం అయినప్పటికీ కొనసాగుతున్న వరుస దాడులు వైసీపీ ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తున్నాయి. రామతీర్థం ఆలయంలో విగ్రహ ధ్వంసం ఘటనపై ఆందోళన కొనసాగుతుండగానే విజయవాడ లోని నెహ్రూ బస్ స్టేషన్ వద్ద సీతా రామ మందిరం లో సీత దేవి విగ్రహం ధ్వంసం అయింది.

శ్రీకాకుళం టెక్కలిలో బుద్ధుడి విగ్రహంపై దుండగుల దాడి
దీనిపై ఆందోళన కొనసాగుతుండగానే ఇప్పుడు తాజాగా బుద్ధుడి విగ్రహం పై కూడా దుండగులు దాడికి తెగబడ్డారు. తాజాగా శ్రీకాకుళం టెక్కలిలో బుద్ధుడి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. గత నెల రోజుల వ్యవధిలో రెండుసార్లు విగ్రహాన్ని ధ్వంసం చేసినట్లుగా తెలుస్తుంది.
ప్రస్తుతం వరుస విగ్రహ ద్వంస ఘటనలు ప్రభుత్వానికి ఊపిరి ఆడనివ్వటం లేదు. దేవాదాయ శాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కు ఇది పెద్ద తలనొప్పిగా మారింది.

టెక్కలిలో బుద్ధుడి విగ్రహం చెయ్యి విరగ్గొట్టిన దుండగులు
ఎర్రన్నాయుడు సమగ్ర రక్షిత మంచినీటి పథకం పక్కనున్న ఉద్యానవనంలో ఎన్టీఆర్, ఎర్రన్నాయుడు, తెలుగుతల్లి విగ్రహాలతో పాటు గా బుద్ధుడి విగ్రహం కూడా ఉంది. ఈ విగ్రహం కుడిచేతి బాగానే నెలరోజుల క్రితం కొందరు దుండగులు ధ్వంసం చేశారు. ఆ తరువాత కుడి చేతి భాగాన్ని తిరిగి అమర్చారు. ఇప్పుడు తాజాగా నిన్న రాత్రి బుద్ధుడి చేతిని మళ్లీ ఎవరో విరగ్గొట్టారు. రాష్ట్రంలో ఆలయాల్లోని దేవుళ్ళ విగ్రహాలనే కాదు, తాజాగా బుద్ధుడి విగ్రహాన్ని కూడా ధ్వంసం చేయడం ఆందోళన కలిగిస్తుంది.

విగ్రహ ధ్వంసాలపై అధికార ప్రతిపక్ష పార్టీల ఆరోపణలు
బుద్ధుడి విగ్రహం చేతిని విరగ్గొట్టిన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు.
అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విగ్రహ ధ్వంసం ఘటనల వెనుక వున్న వారెవరు అన్న దానిపై పెద్ద చర్చ జరుగుతోంది. అయితే వైసిపి నాయకులు తాము అందించే వివిధ సంక్షేమ పథకాలు, ఆ వెంటనే జరుగుతున్న విగ్రహ ధ్వంసం ఘటనలను లింక్ చేసి ఇదంతా ప్రతిపక్షం చేస్తున్న కుట్ర అని చెప్పడం గమనార్హం. ఇదే సమయంలో అసమర్థ ప్రభుత్వం అంటూ ప్రభుత్వ తీరుపై ప్రతిపక్ష పార్టీలు, ప్రధానంగా టిడిపి , వైసీపీ సర్కార్ ను టార్గెట్ చేస్తుండటం గమనార్హం.