జగన్..ఎన్డీఏ వైపే?: హోదా ఇస్తే ఎందాకైనా: మోడీ అఖిల పక్షానికి ముందే ఆ నిర్ణయం: ఎంపీలతో
అమరావతి: పార్లమెంట్ సమావేశాలకు ముహూర్తం ముంచుకొస్తోంది. ఈ నెల 29వ తేదీన ఉభయ సభలు సమావేశం కాబోతోన్నాయి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. వచ్చేనెల 1వ తేదీన బడ్జెట్ ప్రతిపాదనలను సభలో ప్రవేశపెడతారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సారి బడ్జెట్ సమావేశాల్లో కొన్ని కీలక బిల్లులు సభ ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. జమిలి ఎన్నికలకు సంబంధించిన చర్చ కూడా ఈ భేటీలోనే ప్రస్తావనకు రాబోతోన్నట్లు తెలుస్తోంది.
సుప్రీంకోర్టులో జగన్ సర్కార్ పిటీషన్: జస్టిస్ లావు నాగేశ్వర రావు బెంచ్ కాదిక: చివరి గంటల్లో

11 గంటలకు క్యాంప్ కార్యాలయంలో..
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను దృష్టిలో ఉంచుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. పార్టీ ఎంపీలతో భేటీ కానున్నారు. ఉదయం 11 గంటలకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఈ భేటీ ఏర్పాటు కానుంది. బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. వారికి దిశా నిర్దేశం చేయనున్నారు. కీలకమైన బిల్లులు, ఇతర ప్రతిపాదనలకు సంబంధించిన విషయాపై చర్చ సందర్భంగా పార్టీ సిద్ధాంతాలకు లోబడి.. ఎలాంటి అభిప్రాయాలను వ్యక్తం చేయాలనే విషయాన్ని వైఎస్ జగన్.. పార్టీ ఎంపీలకు వివరించనున్నారు.

రాష్ట్ర ప్రయోజనాలపై రాజీ పడొద్దు..
రాష్ట్ర ప్రయోజనాలు, ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన నిధులు వంటి అంశాలే ప్రధాన అజెండాగా ఈ భేటీ కొనసాగుతుందని తెలుస్తోంది. జీఎస్టీ బకాయిల విడుదల, రైల్వే ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేయడం, మూడు రాజధానుల ఏర్పాటు వంటి రాష్ట్రానికి సంబంధించిన డిమాండ్లను పార్లమెంట్ సమావేశాల్లో బలంగా వినిపించాలని వైఎస్ జగన్.. పార్టీ ఎంపీలకు సూచిస్తారని చెబుతున్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన విషయాలపై రాజీధోరణిని ప్రదర్శించాల్సిన అవసరం లేదని, అలాగని ఘర్షణ వైఖరికి పోకుండా ఆయా అంశాలను సభలో లేవనెత్తాలని సూచిస్తారని తెలుస్తోంది.

అమిత్ షాతో భేటీ వివరాలపై
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ సందర్భంగా ప్రస్తావనకు వచ్చిన అంశాల గురించి కూడా వైఎస్ జగన్.. పార్టీ ఎంపీలకు సూచనప్రాయంగా వెల్లడిస్తారని అంటున్నారు. ప్రత్యేక హోదా నినాదాన్ని ఉభయ సభల్లో బలంగా వినిపించాల్సిన అవసరం ఉందని, దీనిపై ప్రైవేటుగా బిల్లును ప్రవేశపెట్టేలా దిశా నిర్దేశం చేయొచ్చని తెలుస్తోంది. జమిలి ఎన్నికలు వంటి కీలకమైన బిల్లులపై ఓటింగ్ నిర్వహించాల్సి వస్తే.. ఎన్డీఏ వైపే మొగ్గు చూపేలా పార్టీ ఎంపీలకు సూచిస్తారని సమాచారం.

అఖిల పార్టీ భేటీలో..
బడ్జెట్ ప్రతిపాదనలను ప్రవేశ పెట్టడానికి రెండు రోజుల ముందే.. అంటే ఈ నెల 30వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ సమావేశంలో పార్టీ నుంచి ఎలాంటి గళాన్ని వినిపించాలనే విషయంపై పార్టీ ఎంపీల నుంచి కొన్ని సూచలను స్వీకరిస్తారని తెలుస్తోంది. ఈ భేటీలో పార్టీ అధినేత హోదాలో వైఎస్ జగన్ పాల్గొంటారా? లేక.. పార్లమెంటరీ పార్టీ అధినేతగా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి హాజరవుతారా? అనేది ఖరారు చేస్తారని సమాచారం. జమిలి ఎన్నికల అంశం అఖిల పార్టీ భేటీలో ప్రస్తావనకు వస్తే.. దానికి అనుకూలంగా నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది.