రఘురామ రాజు కు హైకోర్టు షాక్ - ప్రభుత్వాన్ని మీరెలా నిర్దేశిస్తారు : సుప్రీంకోర్టును ఆశ్రయిస్తా..!!
ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటీషన్ పైన న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ పిటీషన్ పై తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. విచారణకు స్వీకరించలేమని తేల్చి చెప్పింది. మద్యం ద్వారా వస్తున్న ఆదాయాన్ని ప్రత్యేక మార్జిన్ పేరిట కార్పొరేషన్‌కు మళ్లించి దాన్ని ఆదాయంగా చూపుతూ ప్రభుత్వం రుణాలు పొందడాన్ని సవాల్ చేస్తూ రఘురామ రాజు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలను శాసించేందుకు మీరెవరంటూ ప్రశ్నించింది.

సంక్షేమ పథకాలను ఆపేందుకే..
ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారని రఘురామకృష్ణరాజును ఉద్దేశించి వ్యాఖ్యానించింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఆపేందుకే ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేసినట్లు అనిపిస్తోందంటూ అసహనం వ్యక్తం చేసింది. రఘురామ దాఖలు చేసిన పిటీషన్ పైన విచారణ సమయంలో.. రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ నిబంధనలను తుంగలో తొక్కుతోందని రఘురామ వాదనలు వినిపించారు. అయితే, సంక్షేమ పథకాలను అడ్డుకోవాలనేది తమ ఉద్దేశం కాదని.. రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడినప్పుడు న్యాయస్థానం జోక్యం చేసుకోవాలని కోరుతున్నామని వివరించారు.

ఏవిధంగా జోక్యం చేసుకుంటామంటూ..
రాష్ట్ర ఆర్థిక వ్యవహారాల్లో తాము ఏవిధంగా జోక్యం చేసుకుంటామంటూ హైకోర్టు వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ సక్రమంగా ఉందా లేదా అనే అంశాలను ఆర్బీఐ..కాగ్ వంటి సంస్థలు చూసుకుంటాయని కోర్టు పేర్కొంది. రుణాలు తీసుకోవటం..తిరిగి చెల్లింపు వంటి అంశాలు ఇచ్చేవరు..తీసుకొనే వారికి సంబంధించనవని..ఇందులో న్యాయస్థానం ఏ విధంగా జోక్యం చేసుకుంటుందని వ్యాఖ్యానించింది. న్యాయస్థానాలు వీటిలో జోక్యం చేసుకుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్లను అధికరణ 226కింద హైకోర్టులో సవాలు చేస్తారని వ్యాఖ్యానించింది. న్యాయస్థానాలు ప్రభుత్వాలను నడపలేవనే అంశాన్ని గతంలోనే తాము స్పష్టం చేసిన విషయాన్ని ధర్మాసనం గుర్తు చేసింది.

సుప్రీంకు రఘురామ
తాము జోక్యం చేసుకుంటే ప్రజాహితం కోసం ఉద్దేశించిన సంక్షేమ పథకాలు ప్రభావితం అవుతాయని అభిప్రాయపడింది. ఇక, కోర్టు నిర్ణయం పైన రఘురామ రాజు స్పందించారు. భవిష్యత్తు ఆదాయాన్ని తాకట్టుపెట్టి అప్పులు చేయడాన్ని సవాల్ చేస్తే అందులో ప్రజాప్రయోజనం ఏముందని హైకోర్టు ప్రశ్నించడం ఆశ్చర్యంగా ఉందన్నారు. హైకోర్టులో ఊహించినట్టే జరిగిందని.. ప్రజల తరఫున సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని వెల్లడించారు. ముఖ్యమంత్రి తన భవిష్యత్తు కోసమే చూస్తున్నారని.. తాను మాత్రం ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచించి న్యాయస్థానాన్ని ఆశ్రయించానని రఘురామ రాజు చెప్పుకొచ్చారు.