కాలువలోకి దూసుకెళ్లిన కారు: తల్లిని కాపాడి, గల్లంతైన ఎస్ఐ
విజయవాడ: కృష్ణా జిల్లా ఘంటసాల మండలం పాపవినాశనం వద్ద పంటకాల్వలోకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం ఎస్సై కోట వంశీధర్ గల్లంతయ్యారు.
అవనిగడ్డ మండలం దక్షిణ చిరువోలులంకకు చెందిన వంశీధర్.. బంధువుల వివాహ వేడుకకు తన తల్లితోపాటు వెళ్లి తిరిగి వస్తుండగా పాపవినాశనం వద్ద అదుపుతప్పిన కారు పంటకాలువలోకి దూసుకెళ్లింది.

కాగా, తల్లిని తాను రక్షించి తిరిగి కారులో బ్యాగు తీసుకునేందుకు వెళ్లిన వంశీ గల్లంతైనట్టు తెలిసింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఎస్ఐ వంశీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
అవనిగడ్డ నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ సింహాద్రి రమేష్ బాబుకి ఎస్సై వంశీ మేనల్లుడు అవుతారని సమాచారం. విజయనగరం డీఎస్పీగా పనిచేస్తున్న దక్షిణ చిరువోలులంకకు చెందిన మెహర్కి ఆయన సోదరుడు అవుతారు.