సీఎం జగన్ కు కోర్టు షాక్: 10న వ్యక్తిగతంగా హాజరవ్వాల్సిందే : సీబీఐ న్యాయస్థానం ఆదేశం..!
ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు సీబీఐ కోర్టు షాక్ ఇచ్చింది. ముఖ్యమంత్రి అయిన తరువాత అధికారిక విధుల్లో ఉంటున్న జగన్ తన లాయర్ ద్వారా పిటీషన్ దాఖలు చేయిస్తూ..విచారణకు న్యాయవాదిని పంపిస్తు న్నారు. అయితే, దీని పైన సీబీఐ కోర్టు కీలక సూచనలు చేసింది. ఈ నెల 10వ తేదీన ఖచ్చితంగా సీఎం జగన్ కోర్టుకు విచారణ నిమిత్తం రావాల్సిందేనని స్పష్టం చేసింది.
ఎన్నికల్లో గెలిచి ముఖ్యమంత్రి అయిన తర్వాత కోర్టు హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని సీబీఐ కోర్టు జగన్ అభ్యర్థించాడు. దీనికి సంబంధించి హైకోర్టులో కూడా పిటిషన్ వేశారు . దీని పైన ఒక వైపు వాదప్రతివాదనలు కొనసాగుతున్నాయి . ప్రతి శుక్రవారం సీబీఐ కోర్టులో జగన్ లాయర్ ఆబ్సెంట్ పిటిషన్ వేస్తున్నారు . అయితే ఈసారి జగన్ లాయర్ సిబిఐ కోర్టు కొన్ని ఆదేశాలిచ్చింది. ఈనెల పదో తేదీన తప్పనిసరిగా జగన్ తో పాటుగా విజయసాయిరెడ్డి హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది .
రాజధానులపై సీఎం జగన్ తేల్చి చెప్పేసారు: నీళ్లు..నిధులు..పరిపాలన: తప్పులు సరిదిద్దాలి..!

ఈ నెల 10న హాజరు కావాల్సిందే..
తనను వ్యక్తిగత హాజరు నుండి మినహాయించాలని ముఖ్యమంత్రి అయిన తరువాత జగన్ సీబీఐ కోర్టులో పిటీషన్ దాఖలు చేయగా..సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో..వాదనల తరువాత సీబీఐ కోర్టు జగన్ పిటీషన ను కొట్టివేసింది. దీని పైన జగన్ హైకోర్టుకు వెళ్లారు. అయితే, ముఖ్యమంత్రి అయిన తరువాత తనకు ఉన్న అధికారిక కార్యక్రమాల కారణంగా హాజరు కాలేక పోతున్నానంటూ జగన్ ప్రతీ శుక్రవారం గైర్హాజరు పిటీషన్ దాఖలు చేస్తున్నారు. ప్రతీ వారం ఆమోదిస్తున్న న్యాయస్థానం ఈ సారి కీలక వ్యాఖ్యలు చేసింది. ఇప్పటి వరకు 10 సార్లు వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇచ్చామాని..చాలా మంది ప్రజా ప్రతినిధుల పైన కేసులు ఉన్నాయని చెబుతూ.., అందరూ చట్టానికి లోబడి ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. జగన్ తో పాటుగా విజయ సాయి రెడ్డి సైతం హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.

పాదయాత్ర సమయంలోనూ మినహాయింపు..
జగన్ ప్రతిపక్ష నేతగా ఉండగా సుదీర్ఘ పాదయాత్ర చేసారు. ఆ సమయంలో కోర్టుకు హాజరు కాలేనంటూ కోర్టును అనుమతి కోరారు. ఆ సమయంలోనూ కోర్టు ఆయన అభ్యర్ధన తోసి పుచ్చింది. దీంతో..పాదయాత్ర కొనసాగిస్తూనే ప్రతీ శుక్రవారం కోర్టుకు హాజరయ్యే వారు. అయితే, ముఖ్యమంత్రి అయిన తరువాత మాత్రం తన లాయర్ల ద్వారా పిటీషన్ దాఖలు చేయిస్తున్నారు. తాజాగా, సీబీఐ కోర్టు అక్రమాస్తుల కేసులలో ఏ1, ఏ2 ఖచ్చితంగా హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో..ఈ నెల 10వ తేదీన ముఖ్యమంత్రి జగన్ కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. మరి..వ్యక్తిగత కేసులు అయినా..జగన్ ఇప్పుడు సీఎంగా ఉన్నారు. మరి ఆయన కోర్టు సూచనల మేరకు హాజరవుతారో లేక ఆయన తరపు న్యాయవాదులు కోర్టును మరోసారి అభ్యర్ధిస్తారా అనేది వేచి చూడాలి.

రాజకీయంగా విమర్శలు తప్పవా..
ముఖ్యమంత్రి అయిన తరువాత జగన్ ఇప్పటి వరకు అక్రమాస్తుల కేసులో కోర్టుకు హాజరు కాలేదు. ఆయన తరపు న్యాయవాదులు హాజరవుతున్నారు. ఇక, ఇప్పుడు వచ్చే వారం కోర్టుకు హాజరు కావాల్సిందేనని స్పష్టం చేయటంతో ప్రతిపక్షాలు ఈ అంశం మీద రాజకీయంగా విమర్శలు చేసే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం రాజధాని వ్యవహారంలోనే ముఖ్యమంత్రిని లక్ష్యంగా చేసుకున్న ప్రతిపక్షాలు ఇప్పుడు కోర్టుకు హాజరు కావాల్సిందేననే అంశంతో అధికార పక్షాన్ని ఇరుకున పెట్టే విధంగా వ్యవహరించే ఛాన్స్ ఉంది. అయితే, వైసీపీ నేతలు మాత్రం ఎన్నికల కంటే ముందుగానే జగన్ పైన కేసులు ఉన్నాయని..వాటిని నమ్మని ఏపీ ప్రజలు జగన్ కే ఓటు వేసి ముఖ్యమంత్రిని చేసుకున్నారని చెప్పుకొస్తున్నారు.