చంద్రబాబు కేసుల్లో స్టే వివరాలు ఇవ్వండి: లక్ష్మీ పార్వతి పిటీషన్ విచారణ: ఏసీబీ కోర్టు ఆదేశం..!
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అక్రమాస్తుల కేసులో విచారణ కొనసాగుతోంది. లక్ష్మీ పార్వతి సీబీఐ కోర్లులో ఈ కేసు దాఖలు చేసారు. సుదీర్ఘ కాలం తరువాత సీబీఐ కేసు కొద్ది రోజుల క్రితం దీని పైన విచారణ ప్రారంభించింది. చంద్రబాబు ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారని..ఆస్తుల పై సమగ్ర విచారణ జరిపించాలని లక్ష్మీ పార్వతి పిటిషన్ లో అభ్యర్ధించారు. దీని పైన మరోసారి కోర్టు విచారణ జరిపింది. చంద్రబాబు పైన ఏసీబీ కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపించాలని లక్ష్మీ పార్వతి కోర్టను కోరారు. ఇద సమయంలో చంద్రబాబు పై హైకోర్టు లో ఉన్న స్టే వివరాలను కోర్టుకు సమర్పించాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 7వ తేదీకి ఏసీబీ కోర్టు వాయిదా వేసింది.
చంద్రబాబు కేసులో స్టే తొలిగింపుతో..
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పై ఏసీబీ కోర్టు విచారణ చేపట్టింది. దాదాపు 14 ఏళ్ల కిందట విధించిన స్టే తొలిగించారు. దీంతో.. ఈ కేసును న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. చంద్రబాబు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారంటూ గతంలో నందమూరి లక్ష్మీ పార్వతి ఈ కేసు దాఖలు చేసారు. దీనిపైన అప్పట్లో చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించి స్టే పొందారు. గత ఏడాది సుప్రీం ఇచ్చిన తీర్పుతో ఆ స్టే తొలిగిపోయినట్లుగా పేర్కొన్నారు. స్టే ఉత్తర్వులకు పొడిగింపు కోరకపోవటంతో ఏసీబీ న్యాయస్థానం విచారణ ప్రారంభించింది. ఈ కేసులో పిటీషనర్ అయిన లక్ష్మీ పార్వతి వాంగ్మూలం కూడా కోర్టు నమోదు చేయనుంది.

వైయస్సార్ సీఎంగా ఉన్న సమయంలోనే..
వైయస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే లక్ష్మీ పార్వతి ఈ పిటీషన్ దాఖలు చేసారు. ఇక, చంద్రబాబు రిట్ పిటీషనర్ దాఖలు చేయటంతో దాని పైన విచారణ జరిపిన అప్పటి న్యాయమూర్తి డీఎస్ఆర్ వర్మ ఏసీబీ కోర్టులో విచారణకు సంబంధించిన తదుపరి చర్యలు నిలిపేస్తూ 2005లోనే స్టే ఉత్తర్వులిచ్చారు. స్టే ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ లక్ష్మీపార్వతి అనుబంధ పిటిషన్ దాఖలు చేయగా, దానిని హైకోర్టు కొట్టేసింది. అప్పటి నుంచి స్టే కొనసాగుతూ వస్తోంది. సుప్రీం తీర్పు నేపథ్యంలో ఇటీవల ఈ కేసు ఏసీబీ కోర్టు ముందుకు విచారణకొచ్చింది. దీని పైన తాజాగా శుక్రవారం విచారణ చేపట్టిన కోర్టు చంద్రబాబు పై హైకోర్టు లో ఉన్న స్టే వివరాలను కోర్టుకు సమర్పించాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 7వ తేదీకి ఏసీబీ కోర్టు వాయిదా వేసింది.