31న జగన్ కోర్టుకు హాజరవ్వాల్సిందే..లేదంటే: ఏదో కారణం చెబుతారు: సీబీఐ కోర్టు ఆదేశం..!
అక్రమాస్తుల కేసులో జగన్ ఈ నెల 31న కోర్టుకు హాజరవ్వాల్సిందేనని సీబీఐ కోర్టు స్పష్టం చేసింది. హాజరు కాకపోతే తగిన ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. ముఖ్యమంత్రిగా ముఖ్యమైన సమావేశంలో పాల్గొనాల్సి ఉండటంతో..జగన్ వ్యక్తిగత హాజరుకు మినహాయింపు ఇవ్వాలని ఆయన తరపు న్యాయవాది పిటీషన్ దాఖలు చేసారు. దీనిని పరిశీలించిన న్యాయమూర్తి ప్రతీవారం ఏదో ఒక కారణం చెబుతారని..ఈ నెల 31న హాజరు కావాల్సిందేనని తేల్చి చెప్పారు. ఇక.. రిటైర్డ్ ఐఏఎస్ మన్మోహన్‌సింగ్‌పై అవినీతి నిరోధక చట్టం కింద ప్రాసిక్యూట్ చేసేందుకు కేంద్రం అనుమతించిందని సీబీఐ స్పెషల్ పీపీ సురేందర్ నివేదించారు. రాష్ట్రప్రభుత్వ అనుమతితో సంబంధం లేదని స్పష్టం చేశారు.
31న జగన్ కోర్టుకు హాజరవ్వాలి...
సీబీఐ నమోదు చేసిన అక్రమాస్తుల కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్న జగన్ కోర్టుకు రావాలని సీబీఐ కోర్టు ఆదేశించింది. శుక్రవారం కేసు విచారణ సందర్బంగా జగన్ ముఖ్యమంత్రిగా కీలక సమావేశంలో పాల్గొనా ల్సి ఉందని..ఆయన గైర్హాజరకు అనుమతి ఇవ్వాలంటూ ఆయన తరఫు న్యాయవాది అశోక్‌రెడ్డి సీఆర్పీసీ సెక్షన్ 317 కింద పిటిషన్ దాఖలు చేశారు. దీనిని పరిశీలించిన న్యాయమూర్తి.. ఏదో ఒక కారణం చెబుతూ ప్రతి వారం మినహాయింపు కోరుతున్నారని అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. తప్పనిసరిగా రావాలని ఆదేశిస్తే తప్ప జగన్ హాజరు కావడం లేదన్నారు. తదుపరి విచారణకు వ్యక్తిగతంగా హాజరవుతారని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. ఆ రోజు రాకుంటే తగు ఆదేశాలిస్తానని న్యాయమూర్తి స్పష్టం చేశారు. కాగా.. మనీలాండరింగ్ ఆరోపణలతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాఖలు చేసిన చార్జిషీటులో సైతం జగన్ వ్యక్తిగతంగా న్యాయస్థానంలో హాజరు కావలసిందేనని ఈడీ కేసులను విచారిస్తున్న సీబీఐ ప్రత్యేక కోర్టు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

మన్మోహన్ ప్రాసిక్యూషన్‌కు కేంద్రం అనుమతి
జగన్ కంపెనీల్లో వాన్‌పిక్ పెట్టుబడుల కేసులో నిందితుడిగా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ మన్మోహన్‌సింగ్‌పై అవినీతి నిరోధక చట్టం (పీసీ యాక్టు) కింద ప్రాసిక్యూట్ చేసేందుకు కేంద్రం అనుమతించిందని సీబీఐ స్పెషల్ పీపీ సురేందర్ నివేదించారు. రాష్ట్రప్రభుత్వ అనుమతితో సంబంధం లేదని స్పష్టం చేశారు. ఆయనతో న్యాయమూర్తి ఏకీభవించారు. మన్మోహన్పై పీసీ యాక్టు కింద అభియోగాలను విచారణకు స్వీకరించారు. ఇదిలా ఉండగా సజ్జల దివాకర్‌రెడ్డికి చెందిన ఈశ్వర్ సిమెంట్స్.. దాల్మియా సిమెంట్స్‌లో విలీనమైన నేపథ్యంలో నిందితుల జాబితా నుంచి ఈశ్వర్ సిమెంట్స్‌ను తొలగించాలంటూ దాఖలైన పిటిషన్‌ను న్యాయమూర్తి కొట్టివేశారు. సీబీఐ కోర్టు తాజా ఆదేశాలతో ఈ నెల 10న కోర్టు ముందుకు వచ్చిన జగన్..తిరిగి ఈ నెల 31న మరోసారి హాజరు కావాల్సి ఉంది.