దావోస్ లో దర్జాగా పంచ్ ప్రభాకర్-సీబీఐ మీనమేషాలు-హైకోర్టు అరెస్టు ఆదేశాలున్నా !
ఏపీ హైకోర్టు తీర్పులు, అవి ఇచ్చిన జడ్డీలకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు, వీడియోలు పెట్టిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ సానుభూతి పరుడు పంచ్ ప్రభాకర్ ఇప్పడు ఎంచక్కా దావోస్ లో దర్జాగా తిరుగుతున్నాడు. పంచ్ ప్రభాకర్ ను అరెస్టు చేయాలని గతంలో పలుమార్లు హైకోర్టు సీబీఐకి ఆదేశాలు ఇచ్చినా ఇప్పటివరకూ అరెస్టు చేయలేదు. దీంతో ప్రభాకర్ వైసీపీ నేతలతో కలిసి బహిరంగంగానే తిరుగుతున్నాడు.

దావోస్ లో పంచ్ ప్రభాకర్
ఏపీలో జడ్డీలకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు, వీడియోలు పెట్టిన కేసులో నిందితుడుగా ఉన్న పంచ్ ప్రభాకర్ ఇప్పుడు దావోస్ లో దర్శనిమిస్తున్నాడు. అతనిపై సీబీఐ అరెస్టు వారెంటు ఉన్నప్పటికీ దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో దర్శనమిచ్చాడు. వైసీపీ నేతలతో కలిసి ఫొటోలు తీసుకుంటూ హాయిగా గడుపుతున్నాడు. ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్ని సీబీఐ లైట్ తీసుకోవడంతో ఆయన ఇంత హాయిగా బయట తిరుగుతున్నట్లు అర్దమవుతోంది.

సీబీఐ మీనమేషాలు
గతంలో జడ్డీలపై సోషల్ మీడియా పోస్టుల కేసులో నిందితుడిగా ఉన్న పంచ్ ప్రభాకర్ ను అరెస్టు చేయాలని పలుమార్లు హైకోర్టు సీబీఐకి ఆదేశాలు ఇచ్చింది. దీనిపై స్పందించిన సీబీఐ.. అమెరికాలో ఉన్న ప్రభాకర్ ను అరెస్టు చేసేందుకు సాంకేతిక, పాలనాపరమైన అనుమతులు తీసుకోవాల్సి ఉందని, ఇందులో ఆలస్యమవుతోందని కోర్టుకు తెలిపింది. దీనిపై స్పందించిన కోర్టు లుకౌట్ నోటీసులు జారీ చేసి వెంటనే ప్రభాకర్ ను అరెస్టు చేయాల్సిందిగా పలుమార్లు ఆదేశించింది. అయినా సీబీఐ మాత్రం ఇప్పటికీ అవే కారణాలతో మీనమేషాలు లెక్కిస్తోంది.

బహిరంగంగానే వైసీపీ అండ ?
హైకోర్టు జడ్డీలపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన కేసులో నిందితుడిగా ఉన్న పంచ్ ప్రభాకర్ కోసం సీబీఐ అరెస్టు వారెంట్ తో గాలిస్తుంటే అలాంటి వ్యక్తిని వైసీపీ నేతలు మాత్రం ఫొటోలు తీసుకుంటూ బహిరంగంగానే దర్శనమిస్తున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐకి పంచ్ ప్రభాకర్ ను అప్పగించే అవకాశం ఉన్నా లెక్కచేయకుండా దావోస్ వంటి అంతర్జాతీయ వేదికలపై బహిరంగ దర్శనాలతో వైసీపీ ఎలాంటి సంకేతాలు ఇస్తుందన్న చర్చ జరుగుతోంది. అయినా వైసీపీ నేతలు మాత్రం లెక్క చేసేలా కనిపించడం లేదు.