సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ...జనం చెవిలో పూలు పెడుతున్నారా?

అమరావతి:ఇటీవల ఒక లక్ష్మీ నారాయణ చేసిన వ్యాఖ్యల కారణంగా మరో లక్ష్మీనారాయణ అనూహ్యంగా మరోసారి మీడియాలో పతాక శీర్షికలకుఎక్కారు. ఆ ఇద్దరు లక్ష్మీనారాయణలు ఎవరో అందరికీ తెలిసిందే. వారిలో ఒకరు ఎపి బిజెపి అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ కాగా మరొకరు సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ. ఇక కన్నా లక్ష్మీనారాయణ గురించి...ఆయన రాజకీయ ప్రస్థానం గురించి అందరికీ తెలిసే ఉండటంతో...ఆ రెండో లక్ష్మీనారాయణ గురించే మరోసారి గట్టి చర్చ జరిగింది.
ఎపిలో ప్రముఖల కేసులు విచారించడం ద్వారా బాగా పాపులర్ అయిన ఈ ఐపిఎస్ అధికారి అర్థాంతరంగా పదవీ విరమణ చేసి రావడం దగ్గర మొదలుకొని అసలు ఈయన లక్ష్యం ఏమై ఉంటుందనే వరకు ఈ చర్చలు లోతుగా జరిగాయంటే తాజా రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో కొన్ని మీడియా సంస్థలు ఆ విషయాన్ని నేరుగా ఆయన్నే ప్రశ్నించగా...అందుకు జవాబుగా ఆయన చెప్పిన సమాధానాలు మాత్రం జనాల చెవుల్లో పూలు పెట్టే చందంగా ఉన్నాయని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

గజిబిజి...గందరగోళం...
అర్థాంతరంగా పదవీ విరమణ చేసి వచ్చిన సిబిఐ మాజీ జెడి వివి లక్ష్మీనారాయణ రాక వెనక అంతరార్థం ఏంటో అంతుపట్టక ఎపిలోని వివిధ రాజకీయ పార్టీల నేతలు గిలగిల కొట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. అసలు ఈయన లక్ష్యం ఏమిటి?...ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు ఈయన ఎంచుకున్న వ్యూహమేమిటనేది అర్థం కాక ఆయా పార్టీల నేతలు జట్టుపీక్కుంటున్నారు. ఈయన తనపై గతంలో ఆరోపణలు వచ్చినట్లుగా టిడిపికి అనుబంధమా?...లేక సామాజిక వర్గం కోణం దృష్ట్యా జనసేనకు అనుకూలమా?...లేక బిజెపి వ్యూహంలో పావుగా వచ్చిన ఆ పార్టీకి కాబోయే తురుపుముక్కా...ఈ సందేహాలన్నీ అందర్నీ పీడిస్తూనే ఉన్నాయి. అయితే చల్ల కొచ్చి ముంత ఎవరైనా ఎంతసేపు దాచగలరు?...వాళ్లే బైటపెడతారులే అనే చందంగా...ఎలాగూ బైటపడుతుందనే నమ్మకంతో అందరూ ఆ విషయానికి మరీ అధిక ప్రాధాన్యత ఇవ్వలేదు.

ఆ రహస్యం...బట్టబయలైనట్లుగా
అయితే తిరుపతి పర్యటనలో ఎపి బిజెపి నూతన అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ చేసిన వ్యాఖ్యలతో ఈ మాజీ ఐపిఎస్ అధికారికి ఒక్కసారిగా ప్రాధాన్యం పెరిగింది.
బిజెపి అధికారంలోకి వచ్చాక ప్రధాని మోడీ...బిజెపి అధ్యక్షుడు అమిత్ షా...ఏ లక్ష్మీనారాయణను ముఖ్యమంత్రిని చేయాలని నిర్ణయిస్తే ఆ లక్ష్మీనారాయణ ముఖ్యమంత్రి అవుతారని, అది కన్నా అయినా సిబిఐ మాజీ జెడి అయినా అని కన్నా లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలు తాజా రాజకీయాల్లో సంచలనం సృష్టించాయి. సిబిఐ మాజీ జెడి గురించి తాము తెలుసుకోవాలనుకుంటున్న రహస్యం బట్టబయలైపోయిందని...కావాలనే ఒక వ్యూహం ప్రకారం అలా ఆ సీక్రెట్ బైటపెట్టారేమోననే చర్చలు సర్వత్రా జోరుగా సాగాయి. అయినా ఆ విషయం ఆయన నోటి నుంచే చెప్పించాలని అన్ని మీడియా సంస్థలు ప్రయత్నం చేయడంతో ఒక్కసారిగా ఆయన స్పందన అనేది అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది.

అయితే ఎప్పటిలాగే...అదే డొంకతిరుగుడు
తాను బీజేపీలో చేరుతున్నట్లుగా తాజాగా జరుగుతున్న ప్రచారంపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గురువారం స్పందించారు. తాను ఏ పార్టీలో చేరడం లేదన్నారు. జిల్లాల పర్యటన పూర్తయిన తర్వాత రాజకీయపరంగా ఓ నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. రైతులు సబ్సిడీలు, పథకాలను ఆశించడం లేదని, పంటలకు గిట్టుబాటు ధర ఇస్తే చాలన్నారు. రాష్ట్రంలో ప్రతి సమస్య పరిష్కారం కావాలని ఆకాంక్షించారు. ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతోనే ప్రజల్లోకి వచ్చానని చెప్పారు. అయితే జనం ఈసారి ఆయన మాటలను విశ్వసించలేదు. మరింత ఆరా తీయడం మొదలుపెట్టారు. ఆ క్రమంలోనే ఈ సిబిఐ మాజీ జెడి ఇటీవలే ఆరెస్సెస్‌కు సంబంధించిన ఓ కార్యక్రమానికి హాజరైనట్లు తెలుసుకొని ఇక లక్ష్మీనారాయణ బీజేపీలో చేరడం ఖాయమని నిర్థారణకు వచ్చారు.

మళ్లీ అదే ప్రశ్న...కానీ జవాబు మాత్రం...
దీంతో ఒక టివి ఛానెల్ యాంకర్ లైవ్ లోనే ఆర్ఎస్ఎస్ కార్యక్రమానికి హాజరవడం గురించి...తద్వారా బిజెపి అండర్ కవర్ ఆపరేషన్ గురించి అడిగేశారు. అయితే అందుకు లక్ష్మీనారాయణ ఇచ్చిన జవాబు ఇది..."ఒక స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన ఆ సమావేశానికి నాలుగు వందల మంది యువకులు హాజరవుతున్నారని తెలిసి ఆ కార్యక్రమానికి వెళ్లానని...అది బిజెపిని నడిపిస్తున్న ఆర్ఎస్ఎస్ సమావేశం అని కానీ...అక్కడ ఛత్రపతి శివాజీ ఫొటో ఉందని కానీ తనకు తెలియదని లక్ష్మీనారాయణ చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది. లక్ష్మీనారాయణ మరీ జనాల చెవుల్లో పవ్వులు పెడుతున్నారని ఆ సమాధానం బట్టి అర్థం చేసుకోవచ్చని రాజకీయ పరిశీలకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆయన ఇంకా ఏ పార్టీలో చేరకుండానే ఎప్పట్నుంచో ఉన్న రాజకీయనేతలను మించి రాజకీయ చతురత ప్రదర్శిస్తున్నారని విశ్లేషిస్తున్నారు.

జనాల చెవుల్లో పూలు...అదెలాగంటే?
అడుగుపెట్టడంతోనే ఆ ఆర్ఎస్ఎస్ కార్యక్రమం బ్యానరుపై ఉన్న "భగవాధ్వజ ఛాయలలో విరిసిన...హిందూ రాష్ట్ర ద్విగ్విజయమిది అనే వ్యాఖ్యం ఈ సమావేశం ఎవరికి సంబంధించినదో స్పష్టంగా తేటతెల్లం చేస్తోంది. సుదీర్ఘ కాలం పోలీస్ శాఖలో ఉన్నతాధికారిగా పని చేసిన ఆయన తనను ఆహ్వానించిన స్వచ్ఛంద సంస్థ పూర్వపరాల చరిత్రను ఏమాత్రం తెలుసుకోకుండా వెళ్లడం, అవేమీ తనకు తెలియదని చెప్పడం అచ్చంగా జనం చెవిలో పువ్వులు పెట్టడమేనని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. సాధారణంగా స్వచ్ఛంద సంస్థల పిలుపుల విషయంలో వాటి చరిత్ర తెలుసుకోకుండా ఎవ్వరూ వెళ్లరు. విదేశీ నిధులు, వాటి ఖర్చు వ్యవహారాలు, అవి ఉగ్రవాదానికి సహాయపడుతున్నాయనేంత వరకు వెళ్లిన సంగతి తెలిసిందే. అందులోనూ కేంద్ర ప్రభుత్వం పలు సంస్థలను నిషేధించిన సంగతి తెలిసిన ఈ సిబిఐ మాజీ అధికారి తాను హాజరైన స్వచ్ఛంద సంస్థ గురించి తెలుసుకోకుండా వెళ్తారని ఎంతటి అమాయకులైనా నమ్మరని వారంటున్నారు. అందుకే లక్ష్మీనారాయణ వ్యవహారం నిజంగా చల్ల కొచ్చి ముంత దాస్తున్న చందంగానే ఉందని...సరే ఎంతకాలం దాస్తారో మనమూ చూద్దామని జనాలు డిసైడ్ అయ్యారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.