పోలవరం ప్రాజెక్టు స్టాప్ వర్క్ ఆర్డర్ - మరో రెండేళ్ల పాటు : కేంద్రం తాజా ఉత్తర్వులు..!!
ఏపీకి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పోలవరం ప్రాజెక్టు స్టాప్ వర్క్ ఆర్డర్ ను 2023 జులై 2 తేదీ వరకు నిలుపుదల చేస్తూ పర్యావరణ మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇది ఒక రకంగా ఏపీ ప్రభుత్వానికి ఊరటనిచ్చే అంశం. పోలవరం ప్రాజెక్టు స్టాప్ వర్క్ ఆర్డర్ ను.. 2023 జులై 2వ తేదీ వరకు నిలుపుదల చేస్తూ పర్యావరణ మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
అనుమతులు లేని కారణంతో కేంద్ర అటవీ పర్యావరణ శాఖ 2011లో ఇచ్చిన స్టాప్ వర్క్ ఆర్డర్ ఉత్తర్వులను 2015 లో అబయెన్స్ లో పెడుతూ నిర్ణయించారు. ఇలా.. నిలుపుదల చేస్తూ గతంలో ఆదేశాలివ్వగా.. తాజాగా మరో రెండేళ్ల పాటు నిలుపుదల చేస్తూ మరోసారి ఉత్తర్వులిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు, కేంద్ర జలశక్తి శాఖ నేతృత్వంలో నిర్మిస్తున్న జాతీయ ప్రాజెక్టుగా మరో రెండేళ్ల పాటు వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం పోలవరం ను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. కానీ, 2014 -15 అంచనాలనే చెల్లించేందుకు కేంద్రం అంగీకారం తెలిపింది.

అయితే, సవరించిన అంచనాల మేరకు తాజా సవరణలకు ఆమోదం తెలపాలని ఏపీ ప్రభుత్వం పదే పదే కోరుతూ వస్తోంది. కేంద్రం దీని పైన సానుకూలంగా ఉందని చెప్పటం మినహా..అధికారికంగా ఆమోద ముద్ర మాత్రం లభించలేదు. ఇదే సమయంలో పోలవరం నిర్మాణం పూర్తి చేస్తామనే డెడ్ లైన్లు ఎప్పటికప్పుడు సవరిస్తున్నారు. గత ప్రభుత్వంలోనే దీనిని పూర్తి చేస్తామని చెప్పినా... ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్నా.. ఇంకా ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందనే దాని పైన నిర్ధిష్టంగా చెప్పలేని పరిస్థితి కొనసాగుతోంది.
ఇక, ఇప్పుడు పర్యావరణ శాఖ నిర్ణయంతో ఆ సమస్య కూడా ప్రభుత్వానికి తొలగినట్లే కనిపిస్తోంది. ప్రాజెక్టుకు నిధుల సమస్య ఏర్పుడుతుండటంతో.. కేంద్రమే ఈ ప్రాజెక్టు పూర్తి చేయాల్సి ఉందని..తిరిగి ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు కేంద్రానికే అప్పగించాలనే డిమాండ్లు సైతం వినిపిస్తున్నాయి.