ఏపీలో వరదనష్టం అంచనాకు కేంద్ర బృందం పర్యటన .. సర్కార్ కోరిన సాయం ఎంతంటే !!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు వరదలతో తీవ్ర నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే. వర్షాల కారణంగా ఏపీలో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. ప్రజలు చాలా మంది నిరాశ్రయులయ్యారు. ఈ నేపథ్యంలో కేంద్రాన్ని ఏపీ ప్రభుత్వం వర్షాలు ,వరదల వల్ల దెబ్బతిన్న ఏపీ ప్రజలను ఆదుకోవాలని, వరద సహాయం అందించాలని విజ్ఞప్తి చేసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరద నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్రం ఆదేశంతో కేంద్ర బృందాలు చేరుకున్నాయి.

వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటిస్తున్న కేంద్ర బృందాలు
ఈరోజు రేపు రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాలలో ఈ బృందాలు పర్యటించి వరద నష్టాన్ని అంచనా వేయనున్నాయి. ఈరోజు కృష్ణా, గుంటూరు, అనంతపురం జిల్లాలో మూడు బృందాలు పర్యటించనున్నాయి. రేపు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో రెండు బృందాలు పర్యటిస్తాయి.
ఇక వరద నష్టం అంచనా వేయడానికి ఏపీకి చేరుకున్న కేంద్ర బృందాలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నితో , వివిధ శాఖల ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ఇటీవల సంభవించిన భారీ వర్షాలకు ఏ మేరకు నష్టం జరిగిందో అధికారులు కేంద్ర బృందం దృష్టికి తీసుకువెళ్లారు.

శాఖల వారీగా నష్టాన్ని కేంద్ర బృందాలకు వివరించిన అధికారులు
ఆయా శాఖల వారీగా జరిగిన నష్టంపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ను కేంద్ర బృందాలు పరిశీలించాయి. భారీ వర్షాలకు రాష్ట్రంలో 5,583 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయని 2,12 వేల హెక్టార్లలో ధాన్యం పంటలు, 24 వేల 515 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని కేంద్ర బృందానికి అధికారులు తెలిపారు. తాత్కాలిక పునరుద్ధరణ చర్యలకు 840 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని, శాశ్వత పునరుద్ధరణ చర్యలకు 4,439 కోట్ల రూపాయలు అవసరం అవుతాయి సీఎస్ నీలం సాహ్ని కేంద్ర బృందాలకు వివరించారు.

నష్ట నివారణకు సుమారు రూ. 6386.67 కోట్ల అవసరం .. ఇవ్వాలని విజ్ఞప్తి
వర్షాలు, వరదల ప్రభావం కారణంగా పంటల కొనుగోలుకు కేంద్రం సడలింపులు ఇవ్వాలంటూ కోరారు . తడిసిన రంగుమారిన ధాన్యం కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం ఫెయిర్ యావరేజ్ క్వాలిటీ నిబంధనలు సవరించాలని సిఫార్సు చేయాలని నీలం సాహ్ని విజ్ఞప్తిచేశారు. వివిధ శాఖల్లో నష్ట నివారణకు సుమారు రూ. 6386.67 కోట్ల మేర అవసరమవుతాయని కేంద్ర బృందానికి రాష్ట్ర ప్రభుత్వం వివరించింది. వివిధ శాఖల్లో వాటిల్లిన నష్టాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి కేంద్ర బృందానికి వివరించారు ఏపీ ఉన్నతాధికారులు.