వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌కౌంటర్ల కలకలం: నివేదికలు కోరిన కేంద్రం

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/ హైదరాబాద్ : తెలుగు రాష్ర్టాల్లో మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్లపై కేంద్ర ప్రభుత్వం ఆరా తీసింది. ఎన్‌కౌంటర్లపై నివేదిక ఇవ్వాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టాలకు ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలోని జనగాం వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌పై ఎక్కువగా కేంద్రం దృష్టి పెట్టింది. అలాగే శేషాచలం అడవులో జరిగిన ఎన్‌కౌంటర్‌పై కూడా కేంద్రం ఆరా తీసింది. రెండు రాష్ర్టాల డీజీపీలతో కేంద్ర రాష్ట్ర కార్యదర్శి గోయల్‌ మంగళవారం ఉదయం ఫోన్‌లో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు.

కేంద్రహోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు రెండు ఎన్‌కౌంటర్లపై నివేదికను కేంద్ర అధికారులు అందజేశారు. దీనిపై హోంశాఖ కార్యదర్శి నేతృత్వంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సిమి కార్యకలాపాలపై ఐబీ ఇచ్చిన సమాచారంపై కూడా సమీక్ష జరిపారు. ఉగ్రవాదులపై జరిగిన ఎన్‌కౌంటర్లపై ప్రతీకార దాడులు జరిగే అవకాశం ఉందని కేంద్రం భావిస్తోంది. దీంతో అన్ని రాష్ర్టాలకు సంబంధించిన అధికారులను కేంద్రం అప్రమత్తం చేసింది.

Centre asks reports on the encounters in telugu states

కొనసాగుతున్న గాలింపు చర్యలు

ఇదిలావుంటే, ఆంధ్రప్రదేశ్‌ పభుత్వం అటవీ శాఖ కింద ఒక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసిందని ఏపీ డీజీపీ రాముడు తెలిపారు. శేషాచలం అడవిలో జరిగిన ఎన్‌కౌంటర్‌పై ఆయన మీడియాతో మాట్లాడారు. టాస్క్‌ఫోర్స్‌ అంతా అడవిలో ఉందని. వారు బయటకు వస్తే అన్ని వివరాలు తెలుస్తాయని అన్నారు.

మీడియా అడవిలోకి వెళ్లిందని, వారికి ఎంత సమాచారం తెలుసో తమ వద్ద కూడా అదే సమాచారం ఉందని ఆయన చెప్పారు. చనిపోయినవారు ఎవరు అన్నది ఇంకా గుర్తించలేదని రాముడు తెలిపారు. 20 మంది వరకు చనిపోయినట్లుతన వద్ద సమాచారం ఉందని, వాళ్లు ఎవరు అనేది గుర్తించాల్సి ఉందని డీఐజీ తెలిపారు. కూంబింగ్‌ ఇంకా కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

న్యాయవిచారణకు సిద్ధం

కాగా, తమిళనాడులో ఆందోళనలు చెలరేగుతున్న నేపథ్యంలో ఎర్రచందనం స్మగ్లర్ల ఎన్‌కౌంటర్‌పై న్యాయవిచారణకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సిద్ధమైంది. దీనిపై కలెక్టర్‌ సిద్దార్థ జైన్‌ మేజిస్ర్టేట్‌ విచారణ కోసం డీఆర్‌ఓను ఆదేశించారు. ఎన్‌కౌంటర్‌పై ఎలాంటి విమర్శలు వచ్చినా వాటిపై న్యాయవిచారణకు ఏపీ సిద్ధమైంది.

ఈ సందర్భంగా డీఆర్‌ఓ మీడియాతో మాట్లాడారు. మృత దేహాలను పరిశీలించి, ఎన్‌కౌంటర్‌ ఏ పరిస్థితిలో జరిగింది, ఎలా జరిగింది అనే విషయాలపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని అన్నారు. ఎమ్మార్వో, ఆర్‌డీవో కూడా పిలిచామని, అందరం కలిసి సంఘటనా ప్రదేశానికి వెళ్లి మృతదేహాలను పరిశీలించి సమగ్ర విచారణ చేసి, నివేదిక తయారు చేసి కలెక్టర్‌కు, మానవహక్కుల కమిటీకి, హోంశాఖకు అందజేస్తామని డీఆర్‌ఓ తెలిపారు.

తెలంగాణలో హై అలర్ట్

తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్‌ జిల్లాలో జరిగిన టెర్రరిస్టుల ఎన్‌కౌంటర్‌తో నగరంలో హైఅలర్ట్‌ ప్రకటించారు. ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగి పలు ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు చేపట్టారు. పలు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. వరంగల్‌ జిల్లా జనగామలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో వికారుద్దీన్‌ సహా ఐదుగురు సిమి కార్యకర్తలు హతమైన విషయం తెలిసిందే.

వరంగల్-నల్లగొండ జాతీయ రహదారిపై జరిగిన ఎన్‌కౌంటర్ నేపథ్యంలో పోలీసులు హైదరాబాద్ నగరంలోని పలుచోట్ల విస్తృత తనిఖీలు చేపట్టారు. పాతబస్తీ, జూబ్లీ చెక్‌పోస్టు, యూసఫ్‌గూడ, అమీర్‌పేట, పంజాగుట్ట సెంటర్లలో పోలీసులు వాహనాలను ఆపి తనిఖీలు చేపట్టారు.

English summary
PM Narendra Modi lead Union government asked reports on Telangana and Andhra Pradesh encounters.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X