former chief minister chandrababu social activist tdp polavaram project corruption letter చంద్రబాబు టీడీపీ పోలవరం ప్రాజెక్ట్ అవినీతి లేఖ స్పందన
చంద్రబాబు టార్గెట్ గా కేంద్రం అడుగులు .. పోలవరంపై పెంటపాటికి లేఖ
ఏపీలో మాజీ సీఎం చంద్రబాబుకు కేంద్రం షాక్ ఇవ్వటానికి సిద్ధం అవుతోంది . అసలే ఏపీలో అధికార పార్టీ చేతిలో వరుస ఎదురుదెబ్బలు తగులుతున్న ఏపీ మాజీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇప్పుడు కేంద్రం కూడా ఝలక్ ఇవ్వనుంది . పోలవరం ప్రాజెక్టులో భారీ అవినీతి చోటు చేసుకున్నట్లుగా రాష్ట్రంలో ఆరోపణలు వెల్లువెత్తటం తెలిసిందే. అయితే దీనిపై సామాజికవేత్త పెంటపాటి పుల్లారావు ఇటీవల కేంద్రానికి ఒక లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్టులో భారీ ఎత్తున అవినీతి జరిగిందని ఆయన ఆరోపణలు గుప్పించారు. అయితే ఈ లేఖ ను కేంద్ర జలవనరుల శాఖ నిఘా విభాగం పరిగణనలోకి తీసుకుంది .

పోలవరం అవినీతిపై కేంద్రానికి ఫిర్యాదు చేసిన సామాజికవేత్త పెంటపాటి పుల్లారావు .. కన్ఫార్మ్ చెయ్యాలని కేంద్రం లేఖ
తాజాగా ఈ లేఖపై స్పందించిన కేంద్ర జలవనరుల శాఖ నిఘా విభాగం పోలవరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ఫిర్యాదు చేసింది మీరేనా? అంటూ ప్రశ్నిస్తూ సామాజికవేత్త పెంటపాటి పుల్లారావుకు ఒక లేఖ రాసింది. మీరే ఆరోపణల లేఖ రాసినట్లుగా కన్ఫర్మ్ చేయాలంటూ కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖకు చెందిన నిఘా విభాగం ప్రశ్నించింది. అంతేకాదు మీరు చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపిస్తారా? దర్యాప్తు అధికారికి సహకరించటానికి మీరు సిద్ధమా? ఒకవేళ ఆరోపణలు నిరూపించలేని పక్షంలో చట్టప్రకారం మీపై ప్రాసిక్యూషన్ చేయాల్సి ఉంటుంది.. అందుకు మీరు సిద్ధమా? అంటూ లేఖలో ప్రశ్నించింది. ఇక లేఖ రాసింది మీరు కాదు అంటే ఫిర్యాదును విస్మరిస్తాం. ఏ విషయమో 15 రోజుల్లోగా జవాబు ఇవ్వండి' అని కేంద్ర జలవనరుల నిఘా విభాగంరాసిన లేఖకు పుల్లారావు స్పందించారు .

లేఖపై స్పందించిన పెంటపాటి... పోలవరం లో చోటు చేసుకున్న అవినీతి నిరూపిస్తానని వెల్లడి
కేంద్రం నుంచి వచ్చిన లేఖపై పెంటపాటి పుల్లారావు కేంద్రానికి లేఖ రాసింది తానేనని.. పోలవరం ప్రాజెక్టులో అవినీతిని నిరూపించటానికి తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. ఒకవేళ తాను కానీ అవినీతిని నిరూపించని పక్షంలో కేంద్రం తీసుకునే చట్టపరమైన చర్యలకు తాను సిద్ధమని ఆయన పేర్కొన్నారు . పోలవరం మీద కేంద్రం దృష్టి సారించటం.. అందుకు తగిన ఆధారాల్ని పరిశీలించటం చూస్తే.. రానున్న రోజుల్లో బాబును ఇబ్బంది పెట్టేందుకు పోలవరం అవినీతిపై కేంద్రం రంగంలోకి దిగే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తుంది.

చంద్రబాబుకు షాక్ ఇచ్చేందుకు రంగంలోకి దిగనున్న కేంద్రం
ఒక పక్క రాష్ట్రంలోని వైసీపీ సర్కార్ సైతం పోలవరం ప్రాజెక్ట్ లో భారీ అవినీతి జరిగిందని త్వరలో అవినీతి బయట పెడతామని ఇప్పటికే పలు మార్లు ప్రకటించింది. సీఎం జగన్ సైతం గత ప్రభుత్వ అవినీతి బయటపెట్టటం కోసం మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించి మరీ పర్యవేక్షిస్తున్నారు . ఇక ఈ నేపధ్యంలో కేంద్రం కూడా పోలవరం పై ఆరా తియ్యటం ఒక సామాజిక వేత్త రాసిన లేఖకు స్పందించటం చూస్తుంటే కేంద్రం ఈ వ్యవహారంలో విచారణ చేసే అవకాశం ఉంది . అది బాబుకు చెక్ పెట్టటానికి వైసీపీకి కూడా మంచి ప్లస్ అవుతుంది.