వైసీపీకి డిపాజిట్లు రావు - జగన్ పిల్లిలా...పిరికిపందలా : పుంగనూరులో గెలుస్తున్నాం- చంద్రబాబు..!!
ఇప్పుడున్న పరిస్థితులను చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో వైసీపీకి డిపాజిట్లు కూడా రావని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పారు. ఏపీలో పార్టీల పొత్తుల పైన చర్చ జరుగుతున్న సమయంలో ఆయన ఇదే అంశం పైన కీలక వ్యాఖ్యలు చేసారు. ఎన్నికల పొత్తుల గురించి కామెంట్ చేయనని చెప్పిన చంద్రబాబు.. అవసరాన్ని బట్టి పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసారు. రాష్ట్ర ప్రజలు జగన్ ప్రభుత్వంతో విసిగిపోయి ఉన్నారని చెప్పుకొచ్చారు. రాజకీయ పార్టీలు ఉమ్మడిగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. రాజకీయ పార్టీలు పొత్తులు పెట్టుకుంటూ ఉంటాయన్నారు. రాజకీయ పార్టీలు పొత్తులు పెట్టుకుంటూ ఉంటాయని వ్యాఖ్యానించారు.

వైసీపీ వాళ్లు ఎగిరెగిరి పడుతున్నారు
వైసీపీ వాళ్లు పొత్తుల గురించి ఎగిరెగిరి పడుతున్నారని ధ్వజమెత్తారు. జగన్ ఒక్కడే పొత్తులు లేకుండా గెలుస్తున్నాడట..అంటూ ఎద్దేవా చేసారు. జగన్ తండ్రి వైఎస్సార్ నాడు మహాకూటమి అంటూ పొత్తు పెట్టుకున్నారని..ఆయన కంటే గొప్పోడా జగన్ అని ప్రశ్నించారు. టీఆర్ఎస్..వామపక్షాలతో కలిసి నాడు వైఎస్సార్ పొత్తు పెట్టుకున్న అంశాన్ని చంద్రబాబు గుర్తు చేసారు. వైసీపీ మీద ప్రజల్లో పెద్దఎత్తున వ్యతిరేకత వస్తోందని ఫైర్ అయ్యారు. ఏ పార్టీ అయినా కేడర్ బలంగా.. నాయకత్వం సమర్ధవంగా ఉంటేనే ఎన్నికల్లో గెలుస్తుందని విశ్లేషించారు. టీడీపీకి బలమైన కేడర్..సమర్ధవంతమైన నాయకత్వం ఉందని వివరించారు. అయితే, ఎన్నికల్లో పొత్తుల గురించి సందర్భానుసారం నిర్ణయాలు ఉంటాయని పేర్కొన్నారు.

జగన్ పిల్లిలా..పిరికిపందలా మారారు
వైసీపీ అరాచకాలను భరించలేక ప్రజలు రోడ్లమీదకు వస్తున్నారని చెప్పిన చంద్రబాబు.. ఈ తరహా అరాచకాలు తమ పార్టీ వాళ్లకు కొత్త అని చెప్పారు. తన నాలుగు దశాబ్దాల రాజకీయాల్లో తాను ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులను ఊహించలేదన్నారు. తాను పులి అని చెప్పుకున్న జగన్..ఇప్పుడు పిల్లిలా.. పిరికిపందలా తయారయ్యారంటూ దుయ్యబట్టారు. రాష్ట్రం సర్వ నాశనమైందని..కోలుకోలేని స్థితిలోకి వెళ్లిపోయిందని ఆరోపించారు. గ్రామాల్లో ప్రజలు సహాయ నిరాకరణ చేస్తున్నారని చెప్పుకొచ్చారు. మళ్లీ జగన్ వస్తే ఇంకా కూరుకుపోతుందని జోస్యం చెప్పారు. మొన్నటి వరకు పుంగనూరులో ఎవరూ లేరని చెప్పిన చంద్రబాబు.. రాబోయే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి చల్లా బాబు గెలుస్తున్నారు.. కావాలంటే రాసి పెట్టుకోండి అంటూ చంద్రబాబు ధీమా వ్యక్తం చేసారు. ప్రతి నియోజకవర్గానికీ... ఆలస్యంగానైనా సమర్థులని నియమిస్తామని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

రాసిపెట్టుకోండి..పుంగనూరులో గెలుస్తున్నాం
కొంత కాలంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు నియోజకవర్గం పైన చంద్రబాబు ప్రత్యేకంగా ఫోకస్ చేసారు. పలు సందర్భాల్లో పెద్దిరెడ్డిని ఓడించి తీరుతామంటూ శపథం చేసారు. ఇక, ఇప్పుడు అక్కడ అభ్యర్ధిని సైతం ఖరారు చేసిన చంద్రబాబు..అక్కడ గెలుపు పైన ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఇదే సమయంలో మంత్రి పెద్దిరెడ్డి సోదరులు సైతం పుంగనూరు - తంబళ్లపళ్లెలో ఎవరైనా పోటీ చేసి తమను ఓడించాలని సవాల్ చేస్తున్నారు. పెద్దిరెడ్డి తన నియోజకవర్గంతో పాటుగా చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం బాధ్యతలు తీసుకున్నారు. అక్కడ రాజకీయంగా పావులు కదుపుతున్నారు. దీంతో.. ఈ సారి ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలో రాజకీయాలు మరింత ఆసక్తి కరంగా మారనున్నాయి. జిల్లాలో చంద్రబాబు వర్సస్ పెద్దిరెడ్డిగా రాజకీయాలు మారుతున్నాయి.