సాక్షులను బెదిరిస్తున్నారు - జగన్ రాష్ట్రాని ద్రోహం చేసారు : చంద్రబాబు..!!
ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు లేఖ రాశారు. కటారి అనురాధ దంపతుల హత్యకేసు విచారణలో.. పోలీసులు జాప్యం చేస్తున్నారని లేఖలో ఫిర్యాదు చేసారు. పోలీసులే పచ్చిగడ్డి తెచ్చి.. పూర్ణ ఇంట్లో గంజాయి ఉందంటూ అరెస్టు చేశారంటూ లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు. హత్యకేసులో కీలక సాక్షి అయిన సతీష్ వివరాల కోసం ప్రసన్న అనే వ్యక్తిని వేధించారని వివరించారు. ప్రసన్న సోదరుడు పూర్ణ ఇంటిపై దాడిచేశారంటూ డీజీపీకి ఫిర్యాదు చేసారు. సాక్షులను బెదిరిస్తున్న స్థానిక పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు.
మాజీ మేయర్ హేమలతపై దారుణంగా వ్యవహరించారంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. హేమలతపై జీపు ఎక్కించడం వల్ల తీవ్రగాయాలతో ఆస్పత్రి పాలవ్వాల్సి వచ్చిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అందుకు బాధ్యులైన పోలీసు అధికారుల పన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేసారు. అదే విధంగా.. చంద్రబాబు గతంలో ఉండవల్లిలో తన నివాసం వద్ద నిర్మించిన ప్రజా వేదిక కూల్చివేత పైన స్పందించారు. నేటితో ప్రజా వేదిక కూల్చివేతకు మూడేళ్లు పూర్తయింది. దీని పైన చంద్రబాబు ట్వీట్ చేసారు. డిస్ట్రక్షన్ తప్ప కన్స్ట్రక్షన్ చేతగాని జగన్ చేసినవన్నీ కూల్చివేతలేనంటూ ఫైర్ అయ్యారు.

గత ప్రభుత్వం కట్టిన నిర్మాణాల్లోనే పాలన చేస్తూ.. తన వల్ల ఏమీ కాదని.. తనకు ఏమీ రాదని తేల్చి చెప్పేశారని ఎద్దేవా చేసారు. కూల్చటం సులువు అని.. నిర్మించటం ఎంత కష్టమైనదో జగన్ తెలుసుకోవాలని చంద్రబాబు సూచించారు. తన మూడేళ్ల పాలన ఎలా ఉంటుందో జగన్ ముందే ప్రజలకు చూపారని వ్యాఖ్యానించారు. ఏపీ భవిష్యత్ ను.. ప్రజాస్వామ్య వ్యవస్తలను..యువత భవితను జగన్ కూల్చేసారని చంద్రబాబు మండిపడ్డారు. సైకో పాలన ఎలా ఉండబోతోందా ముందుగానే జగన్ రెడ్డి ప్రజలకు చూపించటానికే ప్రజావేదిక కూల్చారంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు.