సీఎం జగన్ ఇలాకాలో చంద్రబాబు - అక్కడ టార్గెట్ ఫిక్స్ : నియోజకవర్గాల వారీగా..!!
తెలుగుదేశం అధినేత చంద్రబాబు సీఎం జగన్ ఇలాకాలో అడుగు పెడుతున్నారు. సీఎం సొంత జిల్లా కడప నుంచి సీమ జిల్లాల పర్యటనలు ప్రారంభిస్తున్నారు. ముందస్తు ఎన్నికలకే సీఎం జగన్ మొగ్గు చూపుతారని అంచనా వేస్తున్న టీడీపీ అధినేత.. ఇప్పుడు పార్టీ శ్రేణులను ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్దంగా ఉండాలంటూ సమాయత్తం చేస్తున్నారు. ప్రభుత్వంలో ఉన్న వైసీపీ గడప గడపకు కార్యక్రమం తో తాము అందిస్తున్న పథకాలతో ప్రజల్లోకి వెళ్తోంది. దీంతో.. ఫీల్డ్ ను వైసీపీకి వదిలేయకుండా.. పోటీగా చంద్రబాబు బాదుడే బాదుడు పేరుతో కార్యక్రమం నిర్ణయించారు.

సీఎం జగన్ ముందస్తుకు వెళ్తారంటూ
తాజాగా పార్టీ నేతలతో జరిగిన టెలీ కాన్ఫిరెన్స్ లోనూ బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేయకుండా ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలను చైతన్యపరచాలని.. ప్రభుత్వ ప్రచార ఆర్భాటాన్ని గట్టిగా తిప్పి కొట్టాలని సూచించారు. ప్రజలకు దగ్గరగా ఉండే నాయకులే ఎదుగుతారని, అహం పెంచుకుని దూరంగా ఉంటే నష్టపోతారని స్పష్టం చేశారు. నేటి నుంచి మూడు రోజులపాటు రాయలసీమ జిల్లాల్లో వరుస పర్యటనలు చేయనున్నారు. తెదేపా చేపట్టిన 'బాదుడే బాదుడు' నిరసన కార్యక్రమాల్లో భాగంగా.. ఈ నెల మొదటి వరంలో ఉత్తరాంధ్ర 3జిల్లాల్లో పర్యటించిన చంద్రబాబు.. గత వారం సొంత నియోజకవర్గం కుప్పంలో జరిగిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

సీమ జిల్లాలపై ఫోకస్
ఈ రోజు కడప జిల్లాలోని కమలాపురం, 19న నంద్యాల జిల్లాలోని డోన్, 20న సత్యసాయి జిల్లాలోని పెనుకొండ నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యట సాగనుంది. మూడు రోజుల పర్యటనలో భాగంగా.. ఆయా జిల్లాలల్లో ఉదయం కార్యకర్తలు, ముఖ్య నేతల సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు. మహానాడు లోపు రాష్ట్రంలోని మూడు ప్రాంతాలను చుట్టేలా అధినేత ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. కడపలో జిల్లాలోని పది నియోజకవర్గాల నేతలతో సమన్వయ సమావేశం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారు. మధ్యాహ్నం 3.20కి కడప నుంచి బయలుదేరి సాయంత్రం 4 గంటలకు కమలాపురం చేరుకుంటారు. ఇక్కడ 'బాదుడే బాదుడు' కార్యక్రమంలో పాల్గొంటారు.

కడప కేంద్రంగా కొత్త వ్యూహాలు
గతం కంటే భిన్నంగా ఈ సారి కడప జిల్లాలో చంద్రబాబు కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. ముందుగానే అభ్యర్దులను ఖరారు చేస్తున్నారు. ఇప్పటికే జమ్మలమడుగు.. పులివెందుల..బద్వేలు వంటి నియోజకవర్గాలకు ఇన్ ఛార్జ్ లుగా ఉన్నవారికే బాధ్యతలు కల్పించార. 2019 ఎన్నికల్లో కడప జిల్లాలోని మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ విజయం సాధించింది. అయితే, చిత్తూరు జిల్లాల పైన వైసీపీ స్పెషల్ ఫోకస్ పెట్టటంతో పాటుగా కుప్పంలో చంద్రబాబును ఢిఫెన్స్ లో పడేయాలనే ఆలోచనలు చేస్తోంది.

అభ్యర్ధులను ముందుగానే ఖరారు
దీంతో.. టీడీపీ అధినేత అటు కుప్పంలో వరుస పర్యటనలు చేస్తూనే... జగన్ సొంత జిల్లాపైన గురి పెట్టారు. అదే సమయంలో 2019 ఎన్నికల్లో ఓటమి..ఆ తరువాత స్థానిక - మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఏకపక్ష విజయాలతో శ్రేణుల్లో ఉన్న నైరాశ్యాన్ని తొలిగించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక, మహానాడు వేదిక ద్వారా వచ్చే సార్వత్రిక ఎన్నికలకు టీడీపీ అధినేత చంద్రబాబు శంఖారావం పూరించనున్నారు. ఇక, కడప జిల్లాలో చంద్రబాబు ఏ చెప్పబోతున్నారు..పార్టీ పరంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది,