వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబు క్షమాపణల వ్యూహం- పదేపదే ప్రస్తావన లక్ష్యమిదే- వర్కవుట్‌ అవుతుందా ?

|
Google Oneindia TeluguNews

1999 ఎన్నికల సమయంలో ఏపీలో చంద్రబాబు పేరు చెబితే అభివృద్ధికి మారుపేరనే చర్చ జరిగేది. చంద్రబాబు వస్తేనే అభివృద్ధి జరుగుతుందంటూ రాష్ట్రంలో పలు ప్రాజెక్టులు, ఫ్లైఓవర్లు, రోడ్లు చూపించి టీడీపీ నేతలు హంగామా చేసేవారు. ప్రజలు కూడా ఈ ప్రచారాన్ని నమ్మడంతో ఆ ఎన్నికల్లో చంద్రబాబు సొంతంగా తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

ఆ తర్వాత కూడా సంస్కరణల పేరుతో చంద్రబాబు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. చివరికి అది పతాకస్దాయికి వెళ్లి బూమరాంగ్‌ అయ్యాక సంక్షేమం దిశగా చంద్రబాబు అడుగులు పడ్డాయి. కానీ తాజాగా మారిన పరిస్ధితుల్లో బీజేపీకి దగ్గరయ్యేందుకు హిందూత్వ అజెండాను నమ్ముకుంటున్నారన్న విమర్శల నేపథ్యంలో ప్రజలకు పదేపదే క్షమాపణలు చెప్పడం చర్చనీయాంశమవుతోంది.

అభివృద్ధికి మారుపేరుగా చంద్రబాబు

అభివృద్ధికి మారుపేరుగా చంద్రబాబు

ఒకప్పుడు హైదరాబాద్‌ రాజధానిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను పాలించే రోజుల్లో సీఎంగా చంద్రబాబు హవా ఓ రేంజ్‌లో కొనసాగింది. ఎక్కడెక్కడో దేశ విదేశీ సంస్ధలను, వాటి అధిపతులను, అమెరికా అధ్యక్షులను, బిల్‌గేట్స్‌ వంటి వారిని హైదరాబాద్‌కు రప్పించడంలో చంద్రబాబు సఫలమయ్యారు. హైదరాబాద్‌ ఐటీ రంగం అభివృద్ధికి చంద్రబాబు ఆద్యుడు అని ప్రస్తుత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పెద్దలూ అంగీకరిస్తుంటారు.

అలాంటి చంద్రబాబుకు 2004 తర్వాత పరిస్ధితి అర్ధమైంది. పేద ప్రజలున్న రాష్ట్రంలో ఓ పరిమితికి మించిన సంస్కరణలు ఎలాంటి దుష్పరిణామాలకు దారి తీస్తాయో చంద్రబాబుకు సులువుగానే అర్ధమైంది. దీంతో అజెండా మారిపోయింది.

బీజేపీతో అప్పుడు, ఇప్పుడు చంద్రబాబు

బీజేపీతో అప్పుడు, ఇప్పుడు చంద్రబాబు

వాజ్‌పేయ్‌ హయాంలో బీజేపీతో జట్టు కట్టిన చంద్రబాబు అభివృద్ధి అజెండాతోనే ఎన్నికల విజయాలు అందుకున్నారు. వాజ్‌పేయ్‌ తర్వాత చంద్రబాబు ప్రభా మసకబారింది. అదే సమయంలో వైఎస్‌ సంక్షేమ అజెండా ప్రభావం చంద్రబాబుపై భారీగానే పడింది. దీంతో 2014 నాటికి చంద్రబాబు కూడా అభివృద్ధితో పాటు సంక్షేమానికీ పెద్ద పీట వేయడం మొదలుపెట్టారు. 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రకటించిన వరాలు, ఎన్నికల హామీలు ఆయనే కాదు టీడీపీ కెరీర్‌లోనే ఎప్పుడూ ప్రకటించి ఉండరు.

అయినా వర్కవుట్‌ కాలేదు. మరోవైపు ప్రత్యేక హోదా పోరుతో బీజేపీకి దూరమైన చంద్రబాబు తిరిగి కాషాయ పార్టీకి దగ్గర కాక తప్పని పరిస్దితి ఎదురైంది. అయితే ఈసారి బీజేపీకి చంద్రబాబు అవసరం లేదు. దీంతో ఏదో రకంగా బీజేపీని మెప్పించేందుకు ఆయనకు అలవాటు లేని హిందూత్వ అజెండాను అమల్లో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది కాస్తా బూమరాంగ్ అవుతోంది కూడా.

హిందూత్వ విమర్శలకు పాత అజెండాతో చెక్‌

హిందూత్వ విమర్శలకు పాత అజెండాతో చెక్‌

ఏపీలో వరుసగా చోటు చేసుకున్న విగ్రహాల విధ్వంసం విషయంలో బీజేపీని మించి వైసీపీని టార్గెట్‌ చేసిన చంద్రబాబు.. ఆ క్రమంలో చేసిన వ్యాఖ్యలు ఆయన హిందూత్వ అజెండాకు మారిపోయారా అన్న చర్చకు అవకాశమిచ్చాయి. దీంతో తాను హిందూత్వ వాదిని కాదని చెప్పుకునేందుకు తిరిగి ఆయన తన పాత అజెండాకు మారిపోయేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.

గతంలో తాను చేసిన అభివృద్ధిని గుర్తు చేసేలా చంద్రబాబు తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. వీటిని టీడీపీ అనుకూల మీడియా కూడా హైలెట్‌ చేయడంతో చంద్రబాబు వ్యూహం మారిందని అర్దమైపోతోంది. గతంలో అభివృద్ధి పేరుతో ఓట్లడిగిన చంద్రబాబు.. తిరిగి అభివృద్ధి చేయడమే తప్పయితే క్షమించండి అంటూ సంక్రాంతి రోజు జనాన్ని వేడుకున్నారు. తద్వారా తన పాత అజెండా అలాగే ఉందని చెప్పే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.

చంద్రబాబు క్షమాపణల తంత్రం ఫలిస్తుందా?

చంద్రబాబు క్షమాపణల తంత్రం ఫలిస్తుందా?

వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ చంద్రబాబు ప్రజల్లో ఓ విషయాన్ని బలంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలో సమస్యల ప్రస్తావన చేస్తూనే.. పాలిచ్చే గోవును వదులుకుని దున్నపోతును తెచ్చుకున్నారని ఓసారి, పూనకం వచ్చినట్లు ఓట్లు గుద్దేసి ఇప్పుడు బాధపడుతున్నారని మరోసారి పదే పదే చెప్తున్నారు. దీంతో పాటే తాను అభివృద్ధి చేయడం తప్పయితే క్షమించాలని జనాన్ని కోరుతున్నారు. గత ఏడాది కాలంలోనే పలుమార్లు క్షమాపణలు చెప్పిన చంద్రబాబు.. సంక్రాంతి వేళ మరోసారి అభివృద్ధి చేయడం తప్పయితే క్షమించాలని వేడుకున్నారు. దీంతో తన అభివృద్ధి అజెండాను క్షమాపణల రూపంలో జనంలోకి బలంగా తీసుకెళ్లాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

 వైసీపీ సంక్షేమానికి చంద్రబాబు అభివృద్ధి కౌంటర్‌

వైసీపీ సంక్షేమానికి చంద్రబాబు అభివృద్ధి కౌంటర్‌

ప్రస్తుతం తిరుపతి ఉపఎన్నికతో పాటు స్ధానిక ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న వేళ మరోసారి అభివృద్ధి వ్యూహంతోనే ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకోవడం వల్లే ఆయన క్షమాపణతో ముడిపెట్టి పదేపదే ప్రస్తావిస్తున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో వైసీపీ సర్కారు అభివృద్ధిని పక్కనబెట్టి సంక్షేమంతోనే ముందుకు వెళ్తున్న సమయంలో తన అభివృద్ధి మంత్రం ఫలిస్తుందని ఆయన బలంగా అంచనా వేసుకుంటున్నారు. మరి ప్రజలు దీన్ని ఏ మేరకు ఆదరిస్తారో త్వరలో జరిగే ఎన్నికల ఫలితాలు తేల్చనున్నాయి.

English summary
telugu desam party chief chandrababu naidu seems to be using apology sentiment to counter recent criticism by his opponents over hindutva agenda.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X