డ్రోన్ల వ్యవహారంపై చంద్రబాబు సీరియస్ .. వైసీపీ సర్కార్ కు సూటి ప్రశ్నలు
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు తన నివాసంపై డ్రోన్ కెమెరాను ఉపయోగించి వీడియోలు, ఫోటోలు తీయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై ఆయన ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ తో ఫోన్లో మాట్లాడారు.శుక్రవారం నాడు ఉదయం అమరావతిలో చంద్రబాబునాయుడు నివసిస్తున్న ఇంటిపై డ్రోన్ కెమెరాతో కొందరు వ్యక్తులు ఫోటోలు , వీడియోలు తీశారు. డ్రోన్ కెమెరాను ఉపయోగించడంపై సెక్యూరిటీ సిబ్బంది అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ వారు తమ పని తాము చేసుకున్నారు.
చంద్రబాబు ఇంటిపై డ్రోన్ కెమెరాలు.. టెన్షన్.. టెన్షన్: జగన్ నివాసం నుండి ఆదేశాలతోనే..!?(వీడియో)

భద్రతనే ప్రశ్నార్ధకం చేస్తారా అని మండిపడిన చంద్రబాబు
ఇక ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబునాయుడు డీజీపీ గౌతం సవాంగ్ తో ఫోన్లో మాట్లాడారు. హై సెక్యూరిటీ జోన్లో డ్రోన్ కెమెరాను ఎలా అనుమతిస్తారని చంద్రబాబునాయుడు డీజీపీని ప్రశ్నించారు. దీని వెనుక కుట్ర జరిగిందని ఆయన ఆరోపిస్తున్నారు. జగన్ ఇంటి పైన కూడా ఇలా డ్రోన్ లతో ఫోటోలు వీడియోలు ,తీస్తారా అంటూ మండిపడిన చంద్రబాబు జగన్ సర్కార్ తమ ప్రవర్తన తీరుతో తన భద్రతనే ప్రశ్నార్ధకం చేస్తారా అని ఆయన ప్రశ్నించారు. అసలు తన ఇంటిపైన డ్రోన్లు వాడేందుకు ఎవరు అనుమతిచ్చారని ఆయన ప్రశ్నించారు. డ్రోన్ల వెనుక కుట్ర ఏంటో తెలియాలని ఆయన డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు వైసీపీ ప్రభుత్వంపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు.
నా నివాసాన్ని టార్గెట్ చేస్తారా ? భద్రతతో చెలగాటాలా అని చంద్రబాబు ప్రశ్న
ఈ సందర్భంగా వైసిపి ప్రభుత్వానికి చంద్రబాబు కొన్ని సూటి ప్రశ్నలు సంధించారు.నా నివాసాన్ని టార్గెట్ చేస్తారా..? నా భద్రతతోనే ఆటలాడతారా.. ? అని ఆయన ప్రశ్నించారు. హై సెక్యూరిటీ జోన్లో ఉన్న మాజీ సీఎం ఇంటిపై డ్రోన్లు నడిపిందెవరు? భద్రతపై కోర్టుకెళ్లాల్సిన పరిస్థితి తెచ్చారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయస్థానం స్పష్టంగా ఆదేశాలిచ్చినా భద్రతతో చెలగాటాలా? అని తన భద్రత విషయంలో వైసిపి సర్కార్ మొదటి నుంచి పనిచేస్తున్న తీరుపై ఆయన మండిపడ్డారు.

నా నివాసంపైకి డ్రోన్లు పంపడానికి కిరణ్ ఎవరు అని ప్రశ్నించిన చంద్రబాబు
నా నివాసంపైకి డ్రోన్లు పంపడానికి కిరణ్ ఎవరు..? సీఎం ఇంటి నుంచి కిరణ్ చెబితే చేశామని పట్టుబడ్డ వాళ్లు చెప్పారు... ఇంతకీ జగన్ ఇంట్లో పనిచేసే కిరణ్ కి ఈ వ్యవహారానికి మధ్య సంబంధం ఏంటో తెలియాలని ఆయన డిమాండ్ చేశారు. మరి సీఎం జగన్ ఇంటిపై కూడా డ్రోన్లు నడుపుతారా..? అని ప్రశ్నించారు. వైసీపీ నేతలు మూర్ఖత్వంతో జన జీవితాలతో ఆటలాడుతారా? అంటూ ప్రశ్నించిన చంద్రబాబు వైసిపి నేతల తీరుపై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు.
మరోపక్క టీడీపీ నేతలు సైతం చంద్రబాబు భద్రతకు ప్రమాదం పొంచివుందని, వైసిపి సర్కారు తీరు అదే విధంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భౌతికంగా చంద్రబాబు కు హాని చేసేందుకే జగన్ సర్కార్ ఈ తరహా చర్యలు చేస్తుందని మండిపడుతున్నారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!