చంద్రబాబు ... రాష్ట్రానికి తెచ్చింది ఏంటయ్యా.. నీరు, మట్టి తప్ప : విజయసాయి సెటైర్
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శల వర్షం కురిపించారు. నిన్న రాజధాని అమరావతి కి ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసిన సందర్భంగా నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుని ఆవేదన వ్యక్తం చేసిన చంద్రబాబునాయుడ్ని టార్గెట్ చేసిన విజయసాయిరెడ్డి నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెచ్చింది ఏంటయ్యా అంటూ ఎద్దేవా చేశారు.

చంద్రబాబును అందుకే ఓడగొట్టారని సెటైర్
చంద్రబాబు అనుభవమంతా అభివృద్ధిలో కాకుండా గ్రాఫిక్స్ లో చూపెట్టారని, రాష్ట్ర ప్రజలను మభ్య పెట్టారని విజయ సాయి రెడ్డి పేర్కొన్నారు . రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు తొక్కిపెట్టి సొంత ప్రయోజనాలను ముందు పెట్టి చంద్రబాబు పని చేశారని మండిపడ్డారు. ఇక చంద్రబాబు రాష్ట్రానికి తెచ్చింది ఏంటయ్యా అంటే నీరు ,మట్టి అంటూ ఎద్దేవా చేశారు. అంతేకాదు అందువల్లే నిన్ను కూర్చోబెట్టారు ఓడగొట్టి అంటూ విజయ సాయి రెడ్డి చంద్రబాబుకు సెటైర్లు వేశారు.

చంద్రబాబుది తన కోసం ఆరాటం ... జగన్ ది జనం కోసం పోరాటం
ఇదే సమయంలో ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఏం చెబుతోంది అంటూ ప్రశ్న వేసి, అందుకు సమాధానం కూడా చెప్పారు విజయసాయిరెడ్డి. సోషల్ మీడియా వేదికగా చంద్రబాబుకు సెటైర్లు వేసిన విజయసాయి రెడ్డి ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర చంద్రబాబుది తనకోసం తనవారి కోసం ఆరాటం అని, కానీ జగన్ మోహన్ రెడ్డిది వందల కులాలు, మూడు ప్రాంతాల అభివృద్ధి కోసం నిరంతరం పోరాటం అని సమాధానం కూడా ఆయనే చెప్పారు. చంద్రబాబు స్వార్ధ పూరిత రాజకీయాలు చేస్తున్నాడు అంటూ ఈ పోస్టు ద్వారా విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.

చంద్రబాబు ఆ లాజిక్ ఎప్పుడో గాలికొదిలేశారు .. గ్రాఫిక్స్ హోరు తప్ప చేసిందేంటి?
అంతేకాదు చంద్రబాబు నాయుడు వైసీపీ ప్రభుత్వం పై చేస్తున్న విమర్శలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విమర్శలు నమ్మశక్యంగా, వాస్తవాలకు దగ్గరగా ఉండాలనే లాజిక్కును చంద్రబాబు గారు ఎప్పుడో గాలికొదిలేశారు అంటూ విజయ సాయి రెడ్డి పేర్కొన్నారు. సీఎంగా జగన్ గారు చేసింది శూన్యం అంట. ఈయన పథకాలనే పేరుమార్చి అమలు చేస్తున్నారంట అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించిన విజయసాయి గ్రాఫిక్స్ హోరు తప్ప,తమరు పెట్టిన 4 వెల్ఫేర్ స్కీముల పేర్లు చెప్పండి బాబు అంటూ విజయ సాయిరెడ్డి ప్రశ్నించారు.