జగన్ పై చంద్రబాబు చండ్రనిప్పులు .. అప్పుడు ముద్దులు, ఇప్పుడు పిడిగుద్దులా,3 రాజధానులపై రెఫరెండానికి సిద్ధమా ?
రాజధానిగా అమరావతినే కొనసాగాలని రైతులు చేపట్టిన ఉద్యమానికి ఏడాది పూర్తయిన సందర్భంగా ఈరోజు రాయపూడిలో జనరణభేరి సభను నిర్వహించారు . ఈ సభలో పాల్గొన్న చంద్రబాబు నాయుడు సీఎం జగన్మోహన్ రెడ్డి పై చండ్ర నిప్పులు కురిపించారు. జగన్ ఇష్టం వచ్చినప్పుడు ముద్దులు, ఇప్పుడు పిడిగుద్దులా అంటూ ప్రశ్నించిన చంద్రబాబు సీఎం జగన్ ఒక ఫేక్ ముఖ్యమంత్రి అంటూ ఫైర్ అయ్యారు. అమరావతి ఉద్యమం చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొన్న చంద్రబాబు, ఇప్పటికైనా చేసిన తప్పును ఒప్పుకొని జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
చంద్రబాబు అమరావతి పర్యటన: కాన్వాయ్ అడ్డగింతతో హై టెన్షన్..దుర్గమ్మే రాజధానికి రక్ష అన్న టీడీపీ చీఫ్

తన దగ్గర జగన్ తెలివితేటలు పనిచేయవన్న చంద్రబాబు
రాజధాని మహిళలు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అని సీఎం అన్నారని పేర్కొన్న చంద్రబాబు సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. సీఎం జగన్ ప్రజల రక్తాన్ని తాగే వ్యాపారస్తుడు అంటూ మండిపడ్డారు. రాష్ట్రం కోసం త్యాగం చేసిన రైతులపై నోటికొచ్చినట్టు మాట్లాడతారా అంటూ భగ్గుమన్నారు.
తన దగ్గర జగన్ తెలివితేటలు పనిచేయవని మండిపడ్డారు చంద్రబాబు. ద్రౌపది వస్త్రాపహరణం చేసినందుకు సామ్రాజ్యం కూలిపోయింది అని గుర్తు చేసిన చంద్రబాబు, మహిళల శాతంతో వైసీపీ నామరూపాలు లేకుండా పోతుందని హెచ్చరించారు.

మూడు రాజధానులపై రెఫరెండానికి సిద్ధమా?
ఇదే సమయంలో సీఎం జగన్ కు సవాల్ విసిరారు చంద్రబాబు.మూడు రాజధానులపై రెఫరెండానికి సిద్ధమా అంటూ ప్రశ్నించారు. ప్రజలు మూడు రాజధానులకు మద్దతు తెలిపితే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలకు కళ్ళు ఉంటే రైతులు చేసిన ఉద్యమం దగ్గరకు వచ్చి ఎవరున్నారో చూడాలని చంద్రబాబు పేర్కొన్నారు. చేసిన తప్పును ఒప్పుకుని క్షమాపణ చెప్పాలన్నారు. రాజధానిగా అమరావతి నే కొనసాగించాలి అని డిమాండ్ చేశారు. పవిత్ర పుణ్యక్షేత్రాల నుంచి నీరు ,మట్టి తెచ్చి రాజధాని నిర్మాణం చేపట్టామని అలాంటి రాజధానిని , 10 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన రాజధానిని స్మశానం అంటారా అంటూ భగ్గుమన్నారు.

రాజధాని ఎడారి, స్మశానం అనటానికి నీకు బుద్ధుందా ?
రాజధాని ఎడారి, స్మశానం అనటానికి నీకు బుద్ధుందా ! అంటూ చంద్రబాబు ఫైర్ అయ్యారు. రాజధాని అమరావతి కోసం ప్రధాని పార్లమెంటు నుండి మట్టి తెచ్చారని, సాక్షాత్తూ కేంద్రం అండగా ఉంటుందని చెప్పారని స్పష్టం చేశారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని సీఎం జగన్ గాలి కబుర్లు చెప్పడం ఇప్పటికైనా మానుకోవాలి అంటూ హితవు పలికారు.రైతులు, దళితులు ప్రతిరోజు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారని రాజధాని అమరావతి ప్రాంతంలో ఉన్న రైతులు, దళితులు మీకు కనిపించడం లేదా అంటూ చంద్రబాబు ప్రశ్నించారు . రాజధాని అమరావతిలో అందరిదీ ఒకే కులమని, అది రైతు కులమని చంద్రబాబు స్పష్టం చేశారు. తాటాకు చప్పుళ్ళకు భయపడే లేదన్నారు జగన్ వన్ టైం సీఎం ఆ పార్టీ ఎమ్మెల్యేలు వన్ టైం అంటూ చంద్రబాబు విరుచుకుపడ్డాడు.

ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగితే 18 నెలల్లో ఏం చేశారు ?
బెజవాడ కనకదుర్గమ్మ ఆశీస్సులు రాజధాని ప్రాంత ప్రజలకు తప్పక ఉన్నాయని తప్పకుండా ఆమె మూడో కన్ను తెరిచి రాక్షసులను అంతం చేస్తుందని, అమరావతికి విముక్తి కలుగుతుందని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. అమరావతి కంటే రాజధానిగా పవిత్రమైన మరో స్థలం ఉంటుందా అని ప్రశ్నించారు. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపిస్తున్న వైసీపీ అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో ఏం చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. ఒకసారి అవకాశం అడిగితే ప్రజలు ఇచ్చారు కానీ ఇదే వైసిపికి ఇదే చివరి అవకాశం అవుతుందంటూ ఈ ప్రభుత్వానికి రాజధాని మహిళల శాతం తప్పక తగులుతుంది అంటూ చంద్రబాబు శాపనార్థాలు పెట్టారు.

సీఎం జగన్ ఇప్పుడు మరో పన్నెండు నెలల్లో ఏం చేస్తారో? జమిలి ఎన్నికలు వస్తే వైసీపీకి ఓటమే
20 నెలల్లో ఏమీ పని చేయని సీఎం జగన్ ఇప్పుడు మరో పన్నెండు నెలల్లో ఏం చేస్తారో చెప్పాలన్నారు . జమిలి ఎన్నికలు నిర్వహించాలని ప్రధాని ఆలోచిస్తున్నారని పేర్కొన్న చంద్రబాబు ప్రజలు తప్పక బుద్ధి చెబుతారన్నారు. చంద్రబాబు పై బురదజల్లడమే జగన్ పనిగా పెట్టుకున్నారని, కానీ ఆ బురదలో కూరుకుపోయేది జగనే అంటూ చంద్రబాబు హెచ్చరించారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేశారని చంద్రబాబు ఆరోపించారు. పేటీఎం బ్యాచ్ తో రాజధానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయిస్తున్నారన్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడుతున్నారని, మూడు రాజధానుల బిల్లులను తిరస్కరించినందుకు కౌన్సిల్ ని రద్దు చేస్తా మంటారా అంటూ చంద్రబాబు ప్రశ్నించారు.విశాఖలో వేల ఎకరాలు ఇన్ సైడర్ ట్రేడింగ్ జరుగుతుందంటూ చంద్రబాబు నిప్పులు చెరిగారు