అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

2 పుష్కరాలు, సింధు గోల్డ్ మెడల్, థ్యాంక్స్: వచ్చినవారితో సంకల్పం చేయించిన చంద్రబాబు

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

అమరావతి: 2020లో జపాన్‌ రాజధాని టోక్యోలో జరిగే ఒలింపిక్స్‌లో పీవీ సింధు బంగారు పతకం సాధించాలని తాము కోరుకుంటున్నామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. కృష్ణా పుష్కరాల ముగింపు సందర్భంగా విజయవాడలోని పవిత్ర సంగమం ఘాట్ వద్ద ఆయన మాట్లాడుతూ సింధు దేశానికి గొప్ప పేరుతీసుకొచ్చిందని అభినందించారు.

సింధు స్వర్ణ పతకం సాధించాలని ఈ పుష్కరాల సందర్భంగా సంకల్పం చేశామని, సింధు సాధించి తీరుతుందనే నమ్మకం తనకుందని అన్నారు. కృష్ణా, గోదావరి నదులను అనుసంధానం చేయాలని గోదావరి పుష్కరాల్లో సంకల్పం చేశామని, ఆ సంకల్పం నెరవేరిందని అన్నారు.

Chandrababu

నదుల అనుసంధానం ఘనత ఏపీ ప్రభుత్వానిదేనని, పెన్నానదికి గోదావరి నీళ్లు తీసుకెళ్లాలని ఆయన అన్నారు. ఈ పుష్కరాల్లో మరో సంకల్పం చేస్తున్నానని, కృష్ణా-పెన్నా నదులను అనుసంధానం చేయాలని కోరుకుంటున్నానని, అది కూడా నెరవేరుతుందని ఆయన అన్నారు.

గోదావరి, కృష్ణా పుష్కరాలు రెండింటిని ఒకే సంవత్సరంలో నిర్వహించే అవకాశం రావడం తన అదృష్టమని అన్నారు. కృష్ణా పుష్కరాల సందర్భంగా తానిచ్చిన పిలుపు మేరకు విజయవాడ ప్రజలు ముందుకు వచ్చి, తమకు తోచిన విధంగా సేవలందించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.

వాళ్లందరికీ రాష్ట్ర ప్రభుత్వం తరపున ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. సేవకు మారుపేరుగా కృష్ణానదీ తీరం నిలిచిందని, పుష్కరాల్లో అధికార యంత్రాంగం బాగా పనిచేసిందని ఆయన అభినందించారు. కృష్ణా పుష్కరాల్లో పోటీ పడి మరి సేవ చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యావాదాలు తెలుపుకుంటున్నానని అన్నారు.

కృష్ణా పుష్కరాల సందర్భంగా 12 రోజులు 12 సంకల్పాలు చేశామని, అనుకున్నది సాధించి తీరుతామని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ కూచిపూడి నృత్యానికి జన్మస్థానమని, కూచిపూడికి పూర్వ వైభవం తీసుకొస్తామని ఉద్ఘాటించారు. పుష్కరాలలో 16 వేల మంది విద్యార్థులు వాలంటీర్లుగా పనిచేశారని అన్నారు.

పుష్కరాల్లో స్వచ్ఛందంగా చాలామంది ముందుకు వచ్చి అనేక సేవా కార్యక్రమాలు చేశారని ఆయన తెలిపారు. ఎంత మంది వచ్చినా ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశామని, అధికార యంత్రాంగం చాలా చక్కగా పనిచేసిందని మెచ్చుకున్నారు. ఏపీకి ప్రత్యేక హోదాపై రాజీపడే ప్రసక్తే లేదని సీఎం చంద్రబాబు అన్నారు.

ప్రత్యేక హోదా సాధించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని అన్నారు. విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని, ప్రత్యేక హోదా, ఇతర రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి చెందే వరకు కేంద్రం సాయం చేయాలని చంద్రబాబు కోరారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలన్నదే తన లక్ష్యమని, నదుల అనుసంధానంతో రాష్ట్రాన్ని సస్య శ్యామలం చేస్తానని అన్నారు.

ప్రపంచంలోని టాప్‌ 10 రాజధానుల్లో ఒకటిగా నిలవాలని, అమరావతిని నిలబెడతామని, కరువు రహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుతామని ఆయన పేర్కొన్నారు. ఇందుకు ప్రతి ఒక్కరి సహకారం కావాలని కోరుకుంటున్నానని అన్నారు. మట్టిలో మాణిక్యాలెందరో ఉన్నారని, సింధు మొన్నటి వరకు సాధారణ ఆడబిడ్డ అని, నేడు అంతర్జాతీయ స్థాయిలో కీర్తి సంపాదించిందని అన్నారు.

చివరగా కృష్ణా పుష్కరాల ముగింపు కార్యక్రమంలో సీఎం చంద్రబాబు తన ప్రసంగం అనంతరం రాష్ట్రాభివృద్ధి కోసం అక్కడ హాజరైన వారితో సంకల్పం చేయించారు. ఈ సందర్భంగా సంకల్పంలోని అంశాలను చంద్రబాబు చదువుతుండగా అక్కడ హాజరైన వారు అనుసరించారు.

అయితే, అక్కడున్న వారంతా చాలా చిన్నగా సంకల్పం చెప్పడాన్ని గమనించిన చంద్రబాబు 'సింధు ఎంత స్పీడ్ గా ఆడిందో, అంత స్పీడ్ గా మీరూ చెప్పాలి' అంటూ వారిని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. దీంతో కృష్ణా పుష్కరాలకు ఘనంగా ముగింపు పలికారు.

కోచ్‌ గోపీచంద్‌ యువతకు ఆదర్శం: వెంకయ్య

రియో ఒలింపిక్స్‌ రజత పతక విజేత పీవీ సింధు వచ్చే ఒలింపిక్స్‌లో స్వర్ణ సింధుగా రావాలని కోరుకుంటున్నానని, కోచ్‌ గోపీచంద్‌ యువతకు ఆదర్శమని ఆయన అన్నారు. విజయవాడలోని పవిత్ర సంగమం ఘాట్‌ వద్ద వెంకయ్య మాట్లాడారు. పీవీ సింధు విజయ స్ఫూర్తితో అందరూ క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని వెంకయ్య అన్నారు.

చంద్రబాబు దార్శనికుడు, ముందు చూపు ఉన్న వ్యక్తని, పుష్కర ఏర్పాట్లు అద్భుతం, ప్రశంసనీయమని ఆయన కొనియాడారు. కృష్ణా పుష్కరాలు అద్భుతంగా జరిగేందుకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

125 కోట్ల మంది ప్రార్థించారు: రైల్వే మంత్రి సురేశ్ ప్రభు

'సింధు చేతులు ఆటలాడాలి.. మన చేతులు ఆమె విజయం కోసం ప్రార్థించాలి' అని రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభు అన్నారు. కృష్ణా పుష్కరాల ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రియో ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించిన సింధు కుటుంబ సభ్యులను, కోచ్ పుల్లెల గోపీచంద్ కుటుంబ సభ్యులను ఆయన అభినందించారు.

'నేను తెలుగు బిడ్డను కాదు... దత్తత తీసుకున్న తెలుగు బిడ్డను' అని అన్నారు. సింధు గెలవాలని 125 కోట్ల మంది ప్రార్థించారని, సింధు తల్లిదండ్రులు రైల్వే ఉద్యోగులు కావడం సంతోషకరమని ఆయన అన్నారు. భవిష్యత్తులోనూ సింధు మరిన్ని విజయాలు సాధిస్తుందని, ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు క్రీడలను ప్రోత్సహించారని అన్నారు.

English summary
Chandrababu Felicitates PV Sindhu At Krishna Pushkaralu Closing Ceremony.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X