సీఎం జగన్ పై చంద్రబాబు ధ్వజం .. నేరస్థులు సీఎం అయితే కోర్టులనే బెదిరిస్తారని ఆగ్రహం
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరుగుతున్నారు. నేరస్తులు ముఖ్యమంత్రి అయ్యి న్యాయ వ్యవస్థ పైన దాడి చేసే పరిస్థితికి వచ్చారని జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి చంద్రబాబు విమర్శలు గుప్పించారు. నేరస్తులు కోర్టులనే బెదిరించే పరిస్థితి వచ్చిందని చంద్రబాబు ఆక్రోశం వెళ్లగక్కారు. నేడు దేశం రిపబ్లిక్ డే వేడుకలను చేసుకుంటున్న వేళ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారత రాజ్యాంగం పరిహాసానికి, ధిక్కారానికి గురైందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
వినాశకాలే విపరీత బుద్ధి, జగన్ రెడ్డిది సైకో మనస్తత్వం.. ఎన్నికల్లో ఆపని చెయ్యండన్న చంద్రబాబు

ఉద్యోగస్తులపై సుప్రీంకోర్టు చేసిన తీవ్ర వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి బాధ్యుడు
బుద్ధి , జ్ఞానం ఉన్న ముఖ్యమంత్రి అయితే హైకోర్టు తీర్పు చూసిన తర్వాత అయినా పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకోర్టుకు వెళ్లి ఉండేవారు కాదని, న్యాయమూర్తులు మారినా న్యాయం మారదని సుప్రీంకోర్టు తీర్పుతో మరోసారి రుజువైందని చంద్రబాబు పేర్కొన్నారు. ఉద్యోగస్తులపై సుప్రీంకోర్టు చేసిన తీవ్ర వ్యాఖ్యలకు కూడా ముఖ్యమంత్రి కారకుడని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఉద్యోగులు తమ పని తాము చేసుకుంటూ వాళ్ళ హక్కుల కోసం పోరాడకుండా రాజకీయాలతో పని ఏంటని ప్రశ్నించారు చంద్రబాబు.
ఫోటోలు: గణతంత్ర దినోత్సవం రోజున ఉద్రిక్తంగా మారిన కిసాన్ ర్యాలీ

గవర్నర్ తీరుపై చంద్రబాబు అసహనం
ఇక ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పై కూడా చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రాజ్యాంగ వ్యతిరేక పాలన కొనసాగుతుంటే, రాజ్యాంగాన్ని పరిరక్షణ బాధ్యత తీసుకోవలసిన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మౌనంగా ఉంటూ గవర్నర్ గా విఫలమవుతున్నారని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం కొనసాగటం లేదని, రాజారెడ్డి రాజ్యాంగం మాత్రమే కొనసాగుతుందని చంద్రబాబు మండిపడ్డారు.

అవమానాలు భరించలేక కోడెల సూసైడ్ , నిరంకుశంగా జగన్ పాలన
ప్రభుత్వ అవమానాలు భరించలేక మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. పులివెందులలో ఇప్పటికీ మాట్లాడే స్వేచ్ఛ లేదని పేర్కొన్న చంద్రబాబు జగన్ నిరంకుశ విధానాలపై మండిపడ్డారు. ఒక ఎమ్మెల్సీ ని రన్ వే మీదికి వెళ్లే అరెస్ట్ చేయడాన్ని ఏమనాలి అని ప్రశ్నించారు చంద్రబాబు. ప్రజల తిరుగుబాటు చూసే కళా వెంకట్రావు అరెస్టు విషయంలో పోలీసులు వెనక్కి తగ్గారని చంద్రబాబు పేర్కొన్నారు.

జగన్ రాజ్యాంగ ధిక్కరణపై చంద్రబాబు ధ్వజం
రాజ్యాంగం పరిధిలో ఏవైనా దోషాలు జరిగితే అది రాజ్యాంగ లోపం కాదు ఖచ్చితంగా మానవ తప్పిదమే నని ఆనాడే అంబేద్కర్ చెప్పారని పేర్కొన్న చంద్రబాబు ఏపీ సీఎం వైయస్ జగన్ ను తాజా పరిణామాలపై నిలదీశారు.
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నేపధ్యంలో చోటు చేసుకున్న పరిణామాలు , రాజ్యాంగ ధిక్కరణలపై చంద్రబాబు సీఎం జగన్ ను టార్గెట్ చేసి విమర్శనాస్త్రాలు సంధించారు .