chandrababu chandrababu naidu chief minister ys jagan agreement center withdrawal struggle vishakhapatnam ప్రైవేటీకరణ చంద్రబాబు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఒప్పందం కేంద్రం ఉపసంహరణ పోరాటం విశాఖపట్నం Visakhapatnam Steel Plant
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై జగన్ మౌనానికి కారణం చెప్పిన చంద్రబాబు: 18న రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు పిలుపు
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ విశాఖ వేదికగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. విశాఖ ఉక్కు ఐక్యకార్యాచరణ సమితి ఆందోళనలు ఉధృతం చేయడానికి కార్యాచరణ రూపొందిస్తోంది. నిరాహార దీక్షలు, ర్యాలీలు చేపడుతూ కేంద్ర నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. విశాఖ కార్మికులు, ఉద్యోగ సంఘాల నాయకులు చేస్తున్న ఆందోళనలకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటిస్తున్నాయి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగనివ్వం అంటూ తేల్చి చెబుతున్నాయి.

18వ తేదీన రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు చంద్రబాబు నాయుడు పిలుపు
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు నిరసనగా ఈనెల 18వ తేదీన రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు . గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చంద్రబాబు టీడీపీ శ్రేణులను ఆదేశించారు. ఉక్కు పరిశ్రమను కాపాడడం కోసం ఎలాంటి పోరాటానికైనా టిడిపి సిద్ధమని ప్రకటించిన నేపథ్యంలో ఉక్కు పరిశ్రమను పరిరక్షించటం కోసం నిర్వహించే ఉద్యమంలో భాగస్వామ్యం తీసుకుంటున్న టీడీపీ సైతం భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తోంది.

విశాఖ ఉక్కును జగన్ తన కేసుల మాఫీ కోసం ప్రైవేటు పరం చేస్తున్నారన్న బాబు
తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉన్న విశాఖ ఉక్కును జగన్ తన కేసుల మాఫీ కోసం ప్రైవేటు పరం చేస్తూ రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తున్నారని చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. జగన్ పోస్కో సంస్థతో లోపాయికారి ఒప్పందం చేసుకోవడం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టడానికే అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తున్నారని విశాఖ ఉక్కు కర్మాగారంలో మిగులు భూమి అయిన 8 వేల ఎకరాలను కాజేయడం కోసం సీఎం జగన్ కేంద్రం ముందు మోకరిల్లారని చంద్రబాబు ఆరోపించారు.

జగన్ కుట్ర రాజకీయాలు తెలుగు ప్రజల ఉక్కు సంకల్పంముందు సాగవు
ఉద్యమ స్ఫూర్తితో విశాఖ ఉక్కు కర్మాగారానికి కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రజలపై ఉందని పేర్కొన్న చంద్రబాబు, జగన్ కుట్ర రాజకీయాలు తెలుగు ప్రజల ఉక్కు సంకల్పంముందు సాగవని చంద్రబాబు పేర్కొన్నారు. ఆమరణ నిరాహార దీక్ష చేసిన పల్లా శ్రీనివాస్ కు సంఘీభావం ప్రకటించడానికి ఈరోజు చంద్రబాబు విశాఖపట్నం వెళ్ళవలసి ఉండగా ఇప్పటికే పల్లా శ్రీనివాస్ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. మరి ఈ నేపథ్యంలో చంద్రబాబు విశాఖ పర్యటన కొనసాగుతుందా లేదా అనే సందిగ్ధం నెలకొంది.

సీఎం జగన్ ముందు టీడీపీ ప్రతిపాదనలు .. జగన్ పై ఆరోపణలు .. ఉక్కు కోసం ఒత్తిడి
ఏదేమైనప్పటికీ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ని ప్రైవేటీకరించకుండా అడ్డుకోవడం కోసం చంద్రబాబు ఉక్కు సంకల్పంతో పోరాటం చేయాలని కేంద్రం మెడలు వంచాలని, పార్టీ శ్రేణులకు సూచిస్తున్నారు.ఇక టీడీపీ ఇప్పటికే సీఎం జగన్ ముందు విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం అనేక ప్రతిపాదనలు పెట్టింది. రాష్ట్రం విశాఖ స్టీల్ ప్లాంట్ ను కొనుగోలు చేసి ప్రైవేట్ పరం కానివ్వకుండా కాపాడాలని , విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం అవసరం అయితే రాజీనామాలు సైతం చెయ్యాలని జగన్ కు ప్రతిపాదించింది . విశాఖ ఉద్యమాన్ని ఉధృతం చెయ్యాలని నిర్ణయం తీసుకుంది .