ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ ఉగ్రవాదం, జగన్ పాలనలో యువత భవిత అంధకారమయం : చంద్రబాబు ధ్వజం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ ఉగ్రవాదం కొనసాగుతోందని టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా యువతకు పిలుపు ఇచ్చిన చంద్రబాబు రాష్ట్రాన్ని చక్కదిద్దే బాధ్యతను యువత తీసుకోవాలన్నారు. విధ్వంసాలు, కక్షసాధింపులు లేని సమాజాన్ని ఆవిష్కరించాలని చంద్రబాబు యువతను కోరారు.

జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన చంద్రబాబు
స్వామి వివేకానంద జయంతి సందర్భంగా యువతకు జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఐదేళ్ల టిడిపి పాలనలో రాష్ట్రాన్ని పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చామని, ఉపాధికల్పనకు కేంద్రంగా అభివృద్ధి చేశామని గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఐటి రంగ అభివృద్ధి ద్వారా దేశవిదేశాల్లో తెలుగుయువత ప్రతిభకు స్థానం లభించేలా చేశామని చెప్పారు. నవ్యాంధ్రలో ఐదేళ్ళలో రూ16లక్షల కోట్ల పెట్టుబడులతో 30లక్షల ఉద్యోగాల కల్పనకు కృషి చేశామన్నారు .

టీడీపీ హయాంలో యువతకు ఉపాధి కల్పించామని పేర్కొన్న బాబు
ఆ కష్ట ఫలితంగా దాదాపు రూ.10లక్షల కోట్ల పెట్టుబడులు రాబట్టామన్న చంద్రబాబు 10లక్షల ఉద్యోగాలు కల్పించామని స్పష్టం చేశారు . కానీ ప్రస్తుతం వైసిపి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అంధకారం వైపు నడిపిస్తుంది అంటూ ధ్వజ మెత్తారు. యువత భవిష్యత్తును ప్రశ్నార్ధకం చేస్తోందంటూ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
67 ఏళ్ల రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆలయాలపై దాడులు, విధ్వంస ఘటనలు కొనసాగుతున్నాయని చంద్రబాబు విమర్శించారు.

రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో దించారని, అదః పాతాళానికి నెట్టారని ఫైర్
నాడు టిడిపి హయాంలో తీసుకువచ్చిన పెట్టుబడులను, పరిశ్రమలను తరిమేసి అభివృద్ధి శూన్యంగా మార్చారని చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో దించారని, అదః పాతాళానికి నెట్టారని ఫైర్ అయ్యారు చంద్రబాబు నాయుడు. యువజన సంక్షేమ పథకాలను రద్దు చేసి, యువతకు ఉపాధి అవకాశాలు లేకుండా చేశారని, రాజకీయ ఉగ్రవాదంతో అన్ని వర్గాల ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు.

వైసిపి హయాంలో అన్ని వ్యవస్థల మీద దాడులు
రాష్ట్రంలో ఎన్నడూ చూడని దమనకాండ, దేశంలోనే ఎక్కడా చూడనంత దమనకాండ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు. వైసిపి హయాంలో అన్ని వ్యవస్థల మీద దాడులు కొనసాగుతున్నాయని న్యాయ వ్యవస్థ , రాజ్యాంగ సంస్థలు, మీడియాకు కూడా రక్షణ లేకుండా పోయిందని చంద్రబాబు మండిపడ్డారు. బీసీ, ఎస్సీ , ఎస్టీ , మైనార్టీలకు తీవ్ర నష్టం జరుగుతుందని చంద్రబాబు పేర్కొన్నారు. వేలాది మంది యువత పై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారని చంద్రబాబు పేర్కొన్నారు.

ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పంతో యువత ముందుకు రావాలి
కక్షసాధింపు పాలన, హింసాత్మక చర్యలు గతంలో ఎన్నడూ కొనసాగలేదని చంద్రబాబు స్పష్టం చేశారు.
వివేకానందుడి మార్గదర్శకంలో హింసా విధ్వంసాలు, కక్ష సాధింపు చర్యలు లేని సమాజాన్ని ఆవిష్కరించాల్సింది యువతరమే. ‘‘ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం'' ఉన్న యువతగా మీరంతా రూపొందాలి. అన్ని రంగాల్లో మన దేశాన్ని, రాష్ట్రాన్ని ముందంజ వేయించాలి అని చంద్రబాబు కోరారు . ఈ దుస్థితిలో రాష్ట్రాన్ని చక్కదిద్దే బాధ్యతను యువతరమే తీసుకోవాలి. మీ కాళ్లపై మీరు నిలబడటమే కాకుండా, సమాజాన్ని చైతన్యపరిచే బాధ్యత భుజాన వేసుకోవాలి. పాలకుల దుశ్చర్యలపై అన్నివర్గాల ప్రజలను చైతన్యపరచాలని కోరారు చంద్రబాబు .