
ఇక కమ్మ బెల్ట్ పై చంద్రబాబు ఫోకస్-కొడాలి కోట గుడివాడతో ఆరంభం-ఒక్కతాటిపైకి తెచ్చే యత్నం
ఏపీలో గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో అన్నీ సొంత సామాజికవర్గానికే చంద్రబాబు కట్టబెట్టారన్న వాదనను వైసీపీ తెరపైకి తెచ్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ లేవనెత్తిన ఈ వాదనను ప్రజల్లోకి పూర్తిస్దాయిలోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయింది. దీంతో సొంత సామాజికవర్గం చేతుల్లో ఉన్న పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ నేతలు మాత్రం దూరమయ్యారు. చివరికి ప్రజలు కూడా ఇదే విషయాన్ని నమ్మడంతో టీడీపీ అధికారానికి దూరమైంది. దీంతో ఇప్పుడు చంద్రబాబు సొంత సామాజికవర్గంపై ఫోకస్ పెట్టారు.

కమ్మ బెల్త్ పై చంద్రబాబు ఫోకస్
కులాల ప్రభావం ఎక్కువగా కనిపించే ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు రాజకీయ పార్టీలు సైతం కులాల వారీగా చీలిపోతున్నాయి. ఎవరేమనుకున్నా టీడీపీని కమ్మ పార్టీగా, వైసీపీని రెడ్ల పార్టీగానే అందరూ భావించే పరిస్ధితి వచ్చేసింది. అయితే అధికారంలో ఉన్నప్పుడు మాత్రం అందరివారిగా కనిపించేందుకు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. అయినా ఎక్కడో చోట కనిపించని లోపాలతో సొంత సామాజికవర్గాలకు సైతం పార్టీలు దూరమైపోతున్నాయి. ఇలా గతంలో కమ్మ సామాజిక వర్గాన్ని కూడా పూర్తిగా ఆకర్షించలేకపోయిన టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి వారిపై ఫోకస్ పెడుతున్నారు.

మహానాడే ఆయుధం
టీడీపీ ఈ ఏడాది ప్రకాశం జిల్లాలో రాష్ట్రస్ధాయి మహానాడు తర్వాత జిల్లాల్లోనూ మినీ మహానాడుల్ని క్రమం తప్పకుండా నిర్వహిస్తోంది. అంతే కాదు ప్రకాశఁ జిల్లాలో మహానాడుతో క్యాడర్ లో వచ్చిన ఉత్సాహం నీరుగారిపోకుండా ఉండేందుకు జిల్లాల్లో జరుగుతున్న మినీ మహానాడులకు సైతం చంద్రబాబు క్రమం తప్పకుండా హాజరవుతున్నారు. తాజాగా చోడవరంలో నిర్వహించిన మినీ మహానాడుకు చంద్రబాబు రావడంతో అక్కడ టీడీపీ క్యాడర్ భారీగా తరలివచ్చి దాన్ని విజయవంతం చేసింది. ఇప్పుడు అదే ఊపుతో చంద్రబాబు మరోసారి కమ్మ సామాజికవర్గమే టార్గెట్ గా కృష్ణాజిల్లాలో మహానాడుకు సిద్దమయ్యారు. తద్వారా గతంలో తమకు దూరమైన కమ్మ సామాజికవర్గాన్ని తిరిగి తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

కొడాలి కోట గుడివాడలోనే
రాష్ట్రంలోనే కమ్మ సామాజిక వర్గం ప్రభావం బలంగా ఉండే కృష్ణాజిల్లాలో ఈసారి మహానాడు నిర్పహణను చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతే కాదు ఇదే జిల్లా గుడివాడ నుంచి తమకు సవాళ్లు విసురుతూ కమ్మ సామాజిరవర్గంలో భారీగా చీలికలు తెస్తున్న వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని జోరును అడ్డుకోవాలంటే ఆయన నియోజకవర్గంలోనే మినీ మహానాడు నిర్వహించేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు. దీనికి కృష్ణాజిల్లాలో తమ పార్టీలో ఉన్న నేతలు, కార్యకర్తలతో పాటు గతంలో తమకు దూరమైన కమ్మ సామాజికవర్గ నేతల్ని కూడా ఆహ్వానిస్తున్నారు. గుడివాడలో మహానాడు విజయవంతమైతే తిరిగి తమ సామాజివర్గంలో పట్టు దొరుకుతుందనే ధీమాలో చంద్రబాబు కనిపిస్తున్నారు.

చంద్రబాబు టార్గెట్ అదే ?
గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు తన సొంత సామాజికవర్గం కమ్మ వాళ్లకే ప్రాధాన్యమిస్తూ మిగతా సామాజివర్గాల్ని పట్టించుకోవడం లేదన్న ప్రచారం బలంగా జరగడంతో బీసీలతో సహా మిగతా కులాలు అన్నీ టీడీపీకి దూరమయ్యాయి. కానీ వాస్తవంగా కమ్మ సామాజికవర్గానికి కూడా ఇక్కడ అనుకున్నంతగా మేలు జరగకపోవడంతో వారు కూడా దూరమయ్యారు. దింతో చంద్రబాబు పరిస్దితి రెంటికీ చెడ్డ రేవడిగా మారిపోయింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం టీడీపీ, వైసీపీలుగా చీలిపోతున్న తన సొంత సామాజికవర్గ నేతల్ని ఏకతాటిపైకి తెచ్చేందుకు చంద్రబాబు గుడివాడ మహానాడును ఉపయోగించుకోవాలని నిర్ణయించారు. దీంతో గుడివాడ మహానాడును విజయవంతం చేయాలని నేతలకు ఆదేశాలు ఇస్తున్నారు.