అప్పుడు మాయమాటలు.. ఇప్పుడు మౌనం: జగన్ సర్కారుపై విరుచుకుపడ్డ చంద్రబాబు
అమరావతి: ఏపీ వైసీపీ ప్రభుత్వంపై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు. వైసీపీ అవకాశవాద రాజకీయాలు చేస్తోందని, రోజురోజుకీ రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోందని అన్నారు. శనివారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు.

పరిపాలన అనుభవం లేని వ్యక్తి వల్ల అంతా నష్టమేనన్న చంద్రబాబు
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో అవినీతి జరిగిందన్నారని.. కానీ కేంద్రం ఒక్క పైసా కూడా అవినీతి జరగలేదని తేల్చిచెప్పిందన్నారు. రివర్స్ టెండరింగ్‌తో ప్రాజెక్టులను నాశనం చేశారని.. రివర్స్ టెండరింగ్‌లో ఏం సాధించారు? అని చంద్రబాబు ప్రశ్నించారు. మాయమాటలు.. సన్నాయి నొక్కులు, డైవర్షన్లు వద్దని చంద్రబాబు చురకలంటించారు. పరిపాలన అనుభవం లేని వ్యక్తి వల్ల అంతా నష్టమే జరుగుతోందని ఆయన అన్నారు.

వైసీపీ ఎంపీలు రాజీనామా చేయాలంటూ చంద్రబాబు సవాల్
అవగాహన లేక తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని.. పార్లమెంట్లో ఏపీ ప్రత్యేక హోదా గురించి ఎందుకు ప్రస్తావించలేదన్నారు. వైసీపీ ఎంపీలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు చంద్రబాబు. ప్రత్యేక హోదాపై ఇంకెన్నాళ్ల్లు ప్రజల్ని మభ్యపెడతారని చద్రబాబు మండిపడ్డారు. దీనిపై వైసీపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక తీసుకొస్తామని.. అలా చేయని పక్షంలో రాజీనామా చేస్తామని సీఎం జగన్ గతంలో చెప్పారని చంద్రబాబు గుర్తు చేశారు. నాడు ప్రజలు, యువతకు హామీ ఇచ్చారని.. ఇప్పుడు ఎందుకు సాధించలేకపోయారని చంద్రబాబు నిలదీశారు. ఇది మోసం, దగా కాదా అని ప్రశ్నించారు. ఈ అంశంపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా.. వైసీపీ ఎంపీలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు చంద్రబాబు. తమ ఎంపీలు కూడా రాజీనామా చేస్తారని, అందరం కలిసి ప్రత్యేక హోదా కోసం పోరాడదామన్నారు. ఈ సవాలుకు సిద్ధమా? అని చంద్రబాబు ప్రశ్నించారు.

అప్పుడు జగన్ అనేక మాటలు.. ఇప్పుడు మౌనం: చంద్రబాబు
ఏపీని సొంత ప్రయోజనాల కోసం కేంద్రంకు తాకట్టుపెట్టారంటూ తీవ్రంగా ధ్వజమెత్తారు చంద్రబాబు. రైల్వే జోన్‌పై ఆనాడు అనేక మాటలు మాట్లడిన జగన్.. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం విశాఖ రైల్వేజోన్ పరిశీలనలో లేదంటే ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. అంతేగాక, విశాఖపై ప్రేమ చూపించే వైసీపీ.. రైల్వే జోన్‌పై ఏం సమాధానం చెబుతారన్నారు. సమాధానం చెప్పలేని సీఎం ఏవిధంగా రాష్ట్రాన్ని పాలిస్తారని అన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న జగన్ ఇప్పుడు మౌనమెందుకు వహిస్తున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వం విశాఖ ఉక్కుపై లాలూచీ రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. త్వరలోనే వైసీపీ సర్కారుపై ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుందన్నారు.

జగన్ సర్కారుపై తీవ్ర విమర్శలు చేసిన పీతల సుజాత
మరోవైపు, మరో టీడీపీ నేత, మాజీ మంత్రి పీతల సుజాత కూడా వైసీపీ సర్కారుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పేద ప్రజలను వైసీపీ ప్రభుత్వం నిలువునా దోపిడీ చేస్తోందని మండిపడ్డారు. శనివారం పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ ప్రభుత్వం రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ పాలన సాగిస్తుందని పీతల సుజాత ధ్వజమెత్తారు. ఇసుక, భూకబ్జాలు, లిక్కర్, గనులదోపిడీతో వైసీపీ నేతలు జేబులు నింపుకుంటున్నారని ఆరోపించారు. ఇప్పుడు పేద ప్రజలను కూడా దోచుకోవడానికి సిద్ధమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటి నుంచి గత ప్రభుత్వాలు చేసిన పనులను తాము చేసినట్టు రంగులు వేసుకుని ప్రభుత్వం గొప్పలు చెప్పిందని పీతల సుజాత అన్నారు. 1983 నుంచి ప్రభుత్వాలు పేదలకు కట్టించిన పక్కా ఇళ్ల మీద పట్టాల పేరుతో వన్ టైం సెటిల్మెంట్ అంటూ వేల కోట్లు గుంజడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. ప్రజలు ఎవరూ కూడా ప్రభుత్వానికి డబ్బులు కట్టనవసరం లేదని స్పష్టం చేశారు. ప్రజలందరూ కూడా ప్రజావ్యతిరేక ప్రభుత్వం పోరాడాలని పీతల సుజాత పిలుపునిచ్చారు.