భయపడే మనిషిని కాను: చంద్రబాబు ఓటుకు నోటు కేసుపైనే...
విశాఖపట్నం: 'నేను కేసులకు భయపడే మనిషిని కాను. కేసులకు భయపడి ప్రత్యేకహోదా విషయంలో నేను లాలూచీపడలేదు... పడే ప్రసక్తే లేద ' అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు.
అంతేకాదు, 'ఎవరూ వేలెత్తిచూపకుండా క్రమశిక్షణతో ఉన్నా. 34 ఏళ్లుగా అదే క్రమశిక్షణ నిలబెట్టుకుంటున్నాను. అదీ నా విశ్వసనీయత. గతంలో 25 కేసులు పెట్టారు. దిక్కున్నచోట చెప్పుకోమని చెప్పాను. నాపై కేసులు పెట్టే ధైర్యం ఎవరికీ లేదు' అని కూడా అన్నారు.

ఓటుకు నోటు కేసు మళ్లీ తేర మీదికి వచ్చిన నేపథ్యంలో చంద్రబాబు ఆ వ్యాఖ్యలు చేశారనే మాట వినిపిస్తోంది. వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఓటుకు నోటు కేసుపై సుప్రీంకోర్టు దాకా వెళ్లడమే ఆయన ఆ వ్యాఖ్యలు చేయడానికి కారణమని భావిస్తున్నారు.
ఆ మాటలన్నీ ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీని, కాంగ్రెసును ఉద్దేశించి అన్నవేనని అనిపిస్తున్నట్లు చెబుతున్నారు. విశాఖపట్నం జిల్లా పరవాడలో పేదల కోసం రూ.50కోట్లతో 22 ఎకరాల్లో జేఎనఎనయూఆర్‌ఎం పథకం కింది నిర్మించిన గృహ సముదాయాలను శుక్రవారం ఆయన ప్రారంభించారు.
ఆ తర్వాత జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. రాష్ట్ర ప్రజలకు తీవ్ర ద్రోహం చేసిన కాంగ్రెస్ నాయకులు చెల్లని కాసులతో సమానమని, అటువంటి వారి విమర్శలకు అర్థం లేదు సరికదా విశ్వసనీయత అంతకంటే లేదని ఆయన అన్నారు. విభజన సమయంలో రాష్ట్రానికి కాంగ్రెస్ నాయకులు తీవ్ర అన్యాయం చేశారని, దీంతో ప్రజలు కసితో కాంగ్రె్‌సను భూస్థాపితం చేశారన్నారు.
విశాఖకే జోన్
ముందుగా హామీ ఇచ్చిన మేరకు రైల్వేజోన్ విశాఖదే... ఇందులో రాజీలేదు... రాజకీయం లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. విశాఖ నగరంలో 40 వేల కొత్త గృహాలను నిర్మించనున్నట్టు గృహ నిర్మాణ శాఖ మంత్రి మృణాళిని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి గంటా శ్రీనివాసరావు, అనకాపల్లి ఎంపీ శ్రీనివాసరావు, పెందుర్తి ఎమ్మెల్యే సత్యనారాయణమూర్తి తదితరులు సభలో పాల్గొన్నారు.