కుప్పంలో రెండోరోజు చంద్రబాబూ టూర్-పొత్తులపై క్లారిటీ-అవకాశవాది అన్న సొము వీర్రాజు
ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. వైసీపీకి వ్యతిరేకంగా విపక్షాలు జట్టు కడుతున్నట్లు భావించినా తాజాగా విపక్ష నేతల మధ్య మాటల తూటాలు చూస్తుంటే ఆ అవకాశం కూడా లేదని తేలిపోతోంది. ఈ నేపథ్యంలో కుప్పంలో పర్యటిస్తున్న టీడీపీ అధినేత పొత్తులపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. దీనిపై స్పందించిన బీజేపీ రాష్ట అధ్యక్షుడు సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుపై సెటైర్లు వేశారు. దీంతో సోము కామెంట్స్ పైనా చర్చ జరుగుతోంది.

పొత్తులపై చంద్రబాబు
ఏపీలో పొత్తులపై తాజాగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. రాష్ట్రంలో పరిస్ధితుల బట్టి పొత్తులు అవసరమంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే జనసేనాని పవన్ కళ్యాణ్, బీజేపీ నేత సోము వీర్రాజు కూడా స్పందిస్తున్నారు. దీంతో చంద్రబాబు ఇవాళ కుప్పం టూర్ లో మరోసారి క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో పరిస్ధితిని బట్టి పొత్తులు ఉంటాయన్నారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్దితుల్లో పొత్తుల అవసరం ఉందన్నారు. పొత్తులతోనే గెలిచాం, పొత్తులతోనే ఓడామంటూ వ్యాఖ్యానించారు. అంతిమంగా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యానే పొత్తులు ఉంటాయన్నారు.

పొత్తులు ఉన్నా లేకున్నా
రాష్ట్రంలో పొత్తులపై చంద్రబాబు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మిగతా విపక్ష పార్టీలతో పొత్తుల కోసం చంద్రబాబు ఆరాటపడుతున్నారంటూ వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. దీంతో చంద్రబాబు ఈ వ్యాఖ్యలపై ఇవాళ మరోసారి స్పందించారు. రాష్ట్రంలో పొత్తులు ఉన్నా లేకున్నా గెలిచామంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. పొత్తులు పెట్టుకుంటేనో, పెట్టుకోకపోతేనో గెలుస్తామని చెప్పలేమన్నారు. వైసీపీ మాత్రం ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చిందని ఆ ఒక్క ఛాన్స్ లాస్ట్ ఛాన్స్ గా మారబోతోందన్నారు.

చంద్రబాబుకు సోము ఘాటు కౌంటర్
రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్ధితుల్లో ఎవరితోనైనా పొత్తులు అవసరమంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందించారు. చంద్రబాబు అవకాశవాది అని అన్నారు. ఆయన ఎవరితోనైనా లవ్ చేస్తాడు, ఆ తర్వాత వదిలేస్తాడంటూ వ్యాఖ్యానించారు. అది ఆయన నైజమన్నారు. మామ నుంచి అందరినీ ప్రేమించాడని, 1996 లో కాంగ్రెస్ పార్టీలో చక్రం తిప్పాడని, ..అప్పటినుంచిఅన్ని పార్టీలతో లవ్ చేస్తాడన్నారు. ఆయన తర్వాత ఆయనేంటో చూపిస్తారని సోము వీర్రాజు ఘాటు వ్యాఖ్యలు చేశారు.