
గుడివాడ క్యాసినో వెనుక కొడాలి నాని; మంత్రిపదవి నుండి తప్పించండి: గవర్నర్ కు చంద్రబాబు లేఖ
సంక్రాంతి పండుగ సందర్భంగా కృష్ణా జిల్లా గుడివాడలో స్వయంగా మంత్రి కొడాలి నాని ఫంక్షన్ హాల్ లో క్యాసినో ఏర్పాటు చేశారు అంటూ, రాష్ట్రంలో క్యాసినో సంస్కృతిని తీసుకువచ్చారని తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న టిడిపి గుడివాడకు నిజ నిర్ధారణ కమిటీ బృందాన్ని పంపి, అక్కడ విచారణ జరిపించి గుడివాడ లో ఏం జరిగిందో తెలియజేసే నిజ నిర్ధారణ కమిటీ నివేదికను సిద్ధం చేసింది. ఈరోజు టీడీపీ నేతల బృందం రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిసి గుడివాడ క్యాసినో వ్యవహారంపై విచారణకు ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. ఇక ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ గుడివాడ క్యాసినో వ్యవహారంపై లేఖ రాశారు.

రోజురోజుకు దిగజారుతున్న పాలన పై లేఖ రాయాల్సి రావడం బాధాకరం
ఈ లేఖలో చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజురోజుకు దిగజారిపోతున్న పాలనపై లేఖ రాయాల్సి రావడం బాధాకరంగా ఉందని పేర్కొన్నారు. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపై వేధింపులు, దళితులు, మైనారిటీలు, వెనుకబడిన వర్గాలపై దాడులు, హింసాత్మక ఘటనలతోపాటుగా డ్రగ్స్ వ్యవహారంలో సైతం రాష్ట్రం జాతీయ స్థాయి వార్తల్లో నిలిచింది అని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ పరంపరలో తాజాగా జనవరి 14వ తేదీ నుండి 16వ తేదీ వరకు కృష్ణాజిల్లా గుడివాడలో సంక్రాంతి పండుగ సందర్భంగా పట్టపగలే క్యాసినో నిర్వహించారని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు .

అక్రమ క్యాసినో లో 500 కోట్ల రూపాయలు చేతులు మారినట్లుగా సమాచారం
జూదం, బెట్టింగ్ లతో ప్రజలను ప్రోత్సహించి తెలుగువారి సంస్కృతీ సాంప్రదాయాలు, విలువలను మంట కలిపారని మండిపడ్డారు. మహిళల చేత అశ్లీల నృత్యాలు చేయించినట్లు కూడా తెలిసిందని చంద్రబాబు నాయుడు ఆ లేఖలో పేర్కొన్నారు. దాదాపు 13 మంది మహిళలను వెలుపలి నుంచి తీసుకొచ్చి చట్టవ్యతిరేక క్యాసినో నిర్వహించి, వారి పని ముగించుకొని తిరిగి గోవాకు పంపినట్లుగా సమాచారం ఉందని, గుడివాడ లో నిర్వహించిన అక్రమ క్యాసినో లో 500 కోట్ల రూపాయలు చేతులు మారినట్లు గా సమాచారం ఉందని పేర్కొన్నారు. అక్రమంగా విదేశీ మద్యం స్మగ్లింగ్ చేసి క్యాసినోలో ఏరులై పారించారని చంద్రబాబు నాయుడు లేఖలో స్పష్టం చేశారు.

జాతీయ భద్రతకు తీవ్రమైన ముప్పు.. కొడాలి నాని కనుసన్నల్లోనే ఇదంతా
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థతో పాటుగా జాతీయ భద్రతకు తీవ్రమైన ముప్పును ఇది కలిగిస్తుందని చంద్రబాబునాయుడు అభిప్రాయం వ్యక్తం చేశారు. అధికార వైసీపీ నేతలు ప్రత్యేకించి గుడివాడకు చెందిన మంత్రి పర్యవేక్షణలోనే ఇదంతా జరిగిందని చంద్రబాబు గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లారు. కొడాలి నాని కనుసన్నల్లోనే ఇదంతా జరిగిందని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. దీనిపై నిజానిజాలు తెలుసుకోవడానికి టీడీపీ నిజనిర్ధారణ కమిటీ వేస్తే కమిటీని అడుగడుగున అడ్డుకోవడానికి ప్రభుత్వ పెద్దలు ప్రయత్నాలు చేశారని, ఇదేంటని ప్రశ్నించినందుకు టీడీపీ నేతలపై కేసులు పెట్టారని, తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారని చంద్రబాబు నాయుడు వివరంగా గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లారు.

బ్రిటీష్ రాజ్ ను గుర్తుకు తెచ్చే గుండా రాజ్ లా వైసీపీ పాలన
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని, వలస పాలన లాంటి బ్రిటీష్ రాజ్ ను గుర్తుకు తెచ్చే గుండా రాజ్ లా వైసీపీ పాలన సాగుతోందని చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రభుత్వంపై అసమ్మతి తెలిపిన వారిపై హింసాత్మక దాడులకు పాల్పడుతూ తప్పుడు కేసులు బనాయిస్తూ అధికార పార్టీ ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని చంద్రబాబు మండిపడ్డారు. గతంలో డ్రగ్స్ పై ప్రశ్నించినప్పుడు తెలుగుదేశం పార్టీ సెంట్రల్ పార్టీ కార్యాలయంపై దాడి చేశారని, ఇప్పుడు అక్రమ క్యాసినో అంశాన్ని లేవనెత్తగాని గుడివాడ నుండి టిడిపి కార్యాలయం పై అధికార వైసీపీ గూండాలు దాడి చేశారని, ఇది యాదృచ్ఛికం కాదని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

క్యాసినోలో పోలీసుల హస్తం
అధికార పార్టీ అక్రమాలకు పదేపదే పాల్పడుతూ భారత ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను బలహీనపరచే ప్రమాదం ఉందని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.గుడివాడ క్యాసినో పై పోలీసు అధికారులకు విన్నవించినా ఫలితం లేకుండా పోతుందని, డీజీపీ కనీసం టిడిపి నాయకులకు కలవడానికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా, రోడ్డుపైనే టిడిపి నేతలు నివేదికను సమర్పించాలని ఒత్తిడి చేశారని చంద్రబాబు నాయుడు లేఖలో స్పష్టం చేశారు. గుడివాడ అక్రమ క్యాసినోపై సమగ్ర విచారణ చేపట్టేందుకు పోలీసులు సిద్ధంగా లేరని తెలుస్తుందని చంద్రబాబు వెల్లడించారు. అక్రమ క్యాసినో లు నడపడంలో టిడిపి కార్యాలయం పై, నాయకులపై దాడి చేయడం లో వైసీపీ నాయకులతో ఒక వర్గం పోలీసులు కలిసి పని చేస్తున్నారని చంద్రబాబు నాయుడు ఆరోపణలు గుప్పించారు.

మంత్రిని మంత్రి పదవి నుండి తప్పించండి
అక్రమ క్యాసినో నిర్వహణ వెనుక స్థానిక మంత్రి హస్తం ఉందని, ఆ మంత్రిని వెంటనే మంత్రివర్గం నుండి తొలగించాలని చంద్రబాబు నాయుడు లేఖలో పేర్కొన్నారు. క్యాసినో నిర్వహించిన దోషులను వదిలిపెట్టకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. చట్టాలను రూపొందించాల్సిన శాసనసభ్యులే ఆ చట్టాలను ఉల్లంఘించడం బాధాకరమని చంద్రబాబు పేర్కొన్నారు. అక్రమ క్యాసినో పై విచారణ సజావుగా జరగాలంటే సదరు మంత్రిని పదవి నుంచి తప్పించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

క్యాసినో ఎపిసోడ్ పై తగిన సంస్థ ద్వారా విచారణ చేయించాలని విజ్ఞప్తి
తమరు రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా గుడివాడలో అక్రమ క్యాసినో ఎపిసోడ్ పై తగిన సంస్థ ద్వారా విచారణ చేయించాలని విజ్ఞప్తి చేస్తున్నానని చంద్రబాబు పేర్కొన్నారు. క్యాసినో వ్యవహారంలో పోలీసులు, పాలకుల పాత్ర పై, టీడీపీ నేతలు, కార్యకర్తలపై అధికార వైసీపీ నేతలు చేసిన దాడులపై విచారణ జరిపించాలని కోరుతున్నానన్నారు. పోలీసుల తీరు ప్రవర్తన రాజ్యాంగానికి, ప్రజాస్వామ్య విలువలకు తీవ్రమైన హాని కలిగిస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు. సత్వర చర్యలు మాత్రమే తెలుగు వారి సంస్కృతిని రక్షించటం లో సహాయపడతాయని గవర్నర్ కు రాసిన లేఖలో చంద్రబాబు స్పష్టం చేశారు.