ycp chandrababu tdp municipal elections panchayat elections nimmagadda ramesh kumar వైసిపి చంద్రబాబు టిడిపి పంచాయతీ ఎన్నికలు politics
చంద్రబాబు మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టో .. ఒక 420 వ్యవహారం : సజ్జల ఫైర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా టిడిపి అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు విడుదల చేసిన మేనిఫెస్టో పై వైసిపి నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు విడుదల చేసిన మేనిఫెస్టో హాస్యాస్పదంగా ఉందన్నారు. అదో 420 వ్యవహారంలా ఉందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు చేయలేని పనులను, మునిసిపల్ ఎన్నికలలో గెలిపిస్తే చేస్తామని చెప్పడం హాస్యాస్పదంగా అనిపించింది అని, ఆశ్చర్యాన్ని కలిగించిందని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.
కుప్పంలో వైసీపీకి డిపాజిట్ రానివ్వను .. గేరు మార్చి తడాఖా చూపిస్తానన్న చంద్రబాబు

ఆచరణ సాధ్యం కాని హామీలతో టీడీపీ మేనిఫెస్టో
పంచాయతీ ఎన్నికల సమయంలో కూడా చంద్రబాబు ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చారని, తన పరిధిలో లేని తాను చేయలేని హామీలను మేనిఫెస్టోలో పేర్కొన్నారని, చంద్రబాబు మేనిఫెస్టో చూసినవారంతా నవ్వి పోయారన్నారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కూడా చంద్రబాబు మరో మేనిఫెస్టో విడుదల చేయడం ఇదో రకమైన మోసకారి పని అని సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల మేనిఫెస్టోపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్న సజ్జల రామకృష్ణారెడ్డి, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టో పై కూడా ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు.

2014 టిడిపి ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచిన అంశాలనే ఇప్పుడు మళ్లీ కొత్తగా
2014 టిడిపి ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచిన అంశాలనే ఇప్పుడు మళ్లీ పెట్టి కొత్తగా మేనిఫెస్టో తయారు చేసినట్లుగా చూపిస్తున్నారు.
అప్పటి ఎన్నికల్లో కూడా ఇంటింటికి కుళాయి, ఒక వ్యక్తికి 20 లీటర్ల నీరు అంటూ హామీలిచ్చి చంద్రబాబు ఒక్క హామీ కూడా అమలు చేయలేదని సజ్జల రామకృష్ణా రెడ్డి ఎద్దేవా చేశారు. ఇప్పుడు మేనిఫెస్టోలో పెట్టిన హామీలు ఒక్కటి కూడా అమలు చెయ్యలేదని, చేసే అవకాశం కూడా లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు ప్రజలను కూడా అమాయకులు అనుకుంటున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.

చంద్రబాబు మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నాడు
చంద్రబాబు మతి స్థిమితం కోల్పోయిన వ్యక్తుల మాదిరిగా అసందర్భ ప్రేలాపనలు చేస్తున్నారని, చంద్రబాబు ఏం మాట్లాడుతున్నాడో కూడా టిడిపి నాయకులకు అర్థం కావడం లేదని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.
పంచాయతీ ఎన్నికల్లోనే ప్రజలు టీడీపీకి బుద్ధి చెప్పారని పేర్కొన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. టిడిపి పునాదులతో సహా కుప్పకూలిపోయింది అని, కుప్పం కోటలో కూడా టిడిపి పరిస్థితి దిగజారి పోయిందని సజ్జల పేర్కొన్నారు.

తండ్రికి వయసైపోయింది , కొడుకు లోకేష్ అయినా నేర్చుకుంటాడు అంటే అదీ లేదు
తండ్రికి వయసు అయిపోయిందని, కొడుకు లోకేష్ అయినా నేర్చుకుంటాడు అనుకుంటే అది లేదన్నారు. నోటికొచ్చినట్టు తిట్టుకుంటూ పోతే వారి ఖర్మ అని వదిలేయడం తప్ప మరేం చేయలేమన్నారు. టిడిపి నిజమైన ప్రతిపక్షంగా ఉండాలని కోరుకుంటున్నామని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి కుటుంబానికి పెద్దగా, వారి బాగోగుల ఆలోచించి సంక్షేమ పథకాలు అమలు చేశారని, దీంతో ప్రజలు ఆయనకు పట్టం కట్టారని పేర్కొన్న సజ్జల రామకృష్ణారెడ్డి మరో మూడేళ్లు ఎలాంటి ఎన్నికలు లేవని టీడీపీ దుకాణం మూసుకోవాల్సిందే అని పేర్కొన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో సైతం టీడీపీ ఓటమి పాలు కావడం ఖాయమని తేల్చి చెప్పారు.