విధ్వంసాలతో ఏపీ 'బీహార్ ఆఫ్ సౌత్ ఇండియా'గా .. గీతం కూల్చివేతలపై చంద్రబాబు ఫైర్
బాలకృష్ణ అల్లుడు టిడిపి నాయకుడు భరత్ కు సంబంధించిన గీతం యూనివర్సిటీ కూల్చివేతలపై టీడీపీ భగ్గుమంటోంది. గీతం కూల్చివేతలపై టిడిపి అధినేత చంద్రబాబునాయుడు మండిపడుతున్నారు. ట్విట్టర్ వేదికగా ఆయన గీతం యూనివర్సిటీ కూల్చివేతపై స్పందించారు . ఎంతో మంది విద్యార్థుల చదువులకు, యువత ఉపాధికి, రోగుల వైద్యానికి దోహదపడుతున్న విశాఖ నుండి అత్యున్నత గీతం విద్యా సంస్థల కూల్చివేతను ఖండిస్తున్నాం అంటూ పేర్కొన్నారు.

వ్యక్తుల పై, పార్టీపై అక్కసుతో రాజకీయ కక్ష సాధింపు చర్యలు
కోర్టులో ఉన్న వివాదంపై ఎటువంటి ఆదేశాలు రాకముందే యూనివర్సిటీ కట్టడాలు కూల్చివేయడం వైసిపి కక్షసాధింపు చర్యగా చంద్రబాబు అభివర్ణించారు. ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థపై ఇలా విధ్వంసాలకు పాల్పడడం రాష్ట్ర ప్రగతికి చేటు చేస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. వ్యక్తుల పై, పార్టీపై అక్కసుతో రాజకీయ కక్ష సాధింపు చర్యలను గర్హిస్తున్నాం అంటూ సోషల్ మీడియా వేదికగా ఆయన ఇది కక్ష సాధింపు చర్యల్లో భాగంగా జరిగిన కూల్చివేతలు అని అభిప్రాయపడ్డారు.

ఏపీలో విధ్వంసాలను చూసి బీహార్ ఆఫ్ సౌత్ ఇండియా అంటున్నారన్న చంద్రబాబు
మొన్న మాజీ మేయర్ సబ్బం హరి ఇంటిపై విధ్వంసం, నేడు గీతం యూనివర్సిటీలో విధ్వంసం కక్ష సాధింపు రాజకీయాలకు ప్రత్యక్ష సాక్ష్యం అంటూ చంద్రబాబు పేర్కొన్నారు. గవర్నమెంట్ టెర్రరిజం అంటూ ఇప్పటికే విద్యా వైద్య పారిశ్రామిక సంస్థలు ఆంధ్రప్రదేశ్ కు రావాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడిందని, ఇక్కడ విధ్వంసాలను చూసి బీహార్ ఆఫ్ సౌత్ ఇండియా అనుకుంటూ అనేక కంపెనీలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్నాయి అంటూ చంద్రబాబు పేర్కొన్నారు.

కట్టడం చేతగాని వాళ్లకు కూల్చే హక్కు లేదు
గీతం యూనివర్సిటీకరోనా కాలంలో సామాజిక బాధ్యతగా కోట్ల రూపాయల నష్టాన్ని భరించి 2590 మంది కోవిడ్ పేషెంట్ లకు చికిత్స అందించిందని చంద్రబాబు తెలిపారు. అలాంటి ఆదర్శవంతమైన సరస్వతీ నిలయాన్ని అర్ధరాత్రి రెండు వందల మందితో వెళ్లి పోవడం దారుణం అంటూ చంద్రబాబు గీతం యూనివర్సిటీ లో కూల్చివేతపై అసహనం వ్యక్తం చేశారు. కట్టడం చేతగాని వాళ్లకు కూల్చే హక్కు లేదు అంటూ ప్రభుత్వ తీరును గర్హించారు.

ఇది మరో తుగ్లక్ చర్య అన్న చంద్రబాబు
ఇప్పటికే చదువు ,ఉపాధి ,ఆరోగ్య చికిత్స కోసం ఏపీ ప్రజలు పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయి అని పేర్కొన్నారు . అటువంటి సమయంలో వైద్య సేవ, సామాజిక సేవలలో చేయూతనిస్తూ రాష్ట్రానికి ముఖ్యంగా ఉత్తరాంధ్రకు గర్వకారణమైన గీతం సంస్థలపై రాజకీయ కక్ష సాధింపు మరో తుగ్లక్ చర్య అని చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వ తీరు దారుణం అని అభిప్రాయపడ్డారు. కావాలనే కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారన్నారు.