
Chandra Babu: చంద్రబాబు యూ టర్న్- కేడర్ లో డైలమా: గురి తప్పుతోంది..!!
Chandra Babu Election Slogan: టీడీపీ అధినేత చంద్రబాబు ఒకే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు. ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో జగన్ ను ఓడించాలి.. అధికారంలోకి రావాలి. ఇందుకోసం సీఎం జగన్ టార్గెట్ గా ప్రజల మధ్యకు వెళ్తున్నారు. జగన్ వైఫల్యాలను ఎండగడుతున్నారు. ఇదే సమయంలో ప్రజలను ఆకట్టుకోవటానికి కొత్త నినాదాలు తెర మీదకు తెస్తున్నారు. అక్కడే స్పష్టత లోపిస్తోంది. రోజుకో కొత్త నినాదంతో ముందుకు వస్తున్నారు. ఇదే ఇప్పుడు పార్టీ కేడర్ లో గందరగోళానికి కారణమవుతోంది. లక్ష్యం గురి తప్పుతోందనే చర్చ మొదలైంది. అసలు ఎందుకీ డైలమా...చంద్రబాబు వ్యూహం సరైనదేనా.

నినాదాలు మార్చేస్తున్న చంద్రబాబు..
టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజలను టీడీపీకి ఓటు వేయమని కోరటంలో ఎంచుకుంటున్న నినాదాల్లో స్పష్టత లోపిస్తోంది. కర్నూలు జిల్లా పర్యటనలో ఈ ఎన్నికల్లో గెలిస్తే సరే..లేకుంటే ఇవే తనకు చివరి ఎన్నికలని చంద్రబాబు సెంటిమెంట్ అస్త్రం ప్రయోగించారు. దీని పైన వైసీపీ నుంచి కౌంటర్లు మొదలయ్యాయి. రాజకీయంగా చర్చ సాగింది. దీంతో, దెందులూరులో ఇవి తనకు చివరి ఎన్నికలు కాదని, రాష్ట్రానికే చివరి ఎన్నికలని చెప్పుకొచ్చారు. ప్రతీ ఒక్కరూ పోరాడాలని..రాష్ట్ర భవిష్యత్ కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. ఇప్పుడు నిడుదవోలు సభలో మరో నినాదం తీసుకొచ్చారు. ఇవే తనకు చివరి ఎన్నికల ని ఈ సైకోలు అంటున్నారని..వాళ్లందరినీ భూ స్థాపితం చేసే వరకూ తాను ఉంటానని స్పష్టం చేసారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టే వరకూ ఉంటానని చెప్పుకొచ్చారు. తొలి రోజు చేసిన నినాదం నుంచి చంద్రబాబు యూ టర్న్ తీసుకున్నారనే విమర్శలు మొదలయ్యాయి.

నడిపించాల్సిన నేత..స్పష్టత లేకుండా
ప్రభుత్వం పైన పోరాటంలో స్పష్టత ఉన్నా.. ఎన్నికల్లో ప్రజాకర్షణ నినాదాలు..నిర్ణయాల్లో మాత్రం వ్యూహం లోపిస్తోంది. సంక్షేమ పథకాల అమలు విషయంలోనూ అదే కనిపిస్తోంది. తాను అధికారంలోకి వస్తే సంక్షేమం అమలు చేయననంటూ జరుగుతున్న ప్రచారానికి చంద్రబాబు సమాధానం ఇచ్చారు. మెరుగైన సంక్షేమం అందిస్తానని చెప్పుకొచ్చారు. అయితే, ఇప్పుడు చంద్రబాబు నాయకత్వం పైనే టీడీపీ మొత్తంగా ఆధారపడింది. టీడీపీకి ఓటు వేయాలంటే అది చంద్రబాబును చూసి మాత్రమే పడుతుంది. తన అవసరం రాష్ట్రానికి వివరించాల్సిన చంద్రబాబు..ఇలా తనకు సంబంధించిన అంశాల్లోనే ప్రజలకు వివరిస్తున్న విధానాల్లో స్పష్టత కరువైంది. రాష్ట్రానికి ఇప్పుడు తన అవసరం వివరించాల్సిన వేళ.. చివరి ఎన్నికలంటూ చేసిన వ్యాఖ్యలతో ఒక్క సారిగా ప్రత్యర్ధి పార్టీలకు అవకాశం చిక్కింది. దీంతో, తనకు కాదు.. రాష్ట్రానికే చివరి ఎన్నికలని చెప్పటం కూడా వ్యతిరేక చర్చకు దారి తీసింది. దీంతో..ఇప్పుడు తాను రాష్ట్రాన్ని గాడిలో పెట్టే వరకూ ఉంటానంటూ చెప్పుకొచ్చారు.

ఢిల్లీ పర్యటన తరువాత క్లారిటీ..
వచ్చే ఎన్నికలకు సిద్దమవుతున్న వేళ..చంద్రబాబు పొత్తుల విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. అటు బీజేపీ నో అంటున్నా.. ఇటు పవన్ నుంచి స్పష్టత రాకున్నా వేచి చూసే ధోరణితో చంద్రబాబు ఉన్నారు. జగన్ ను ఓడించాలనే లక్ష్యంతో ఏ చిన్న అవకాశం వదులకొనేందుకు సిద్దంగా లేరు. చివరి నిమిషం వరకు అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నారు. ఇక, ఈ నెల 5న ఢిల్లీ లో ప్రధాని అధ్యక్షతన జరిగే జీ20 బాధ్యతల నిర్వహణ పైన జరిగే సమావేశంలో చంద్రబాబు పాల్గొంటున్నారు. ఇదే సమయంలో ప్రధానితో ప్రత్యేక భేటీ కోసం ప్రయత్నిస్తున్నారు. భేటీ ఖరారైతే అన్ని అంశాలను ప్రధానితో చర్చించే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు సమాచారం. అటు లోకేశ్ పాదయాత్ర కు సిద్దం అవుతున్నారు. ఇటు చంద్రబాబు పూర్తిగా ఎన్నికల నిర్వహణ పైనే ఫోకస్ పెట్టనున్నారు. దీంతో, ఇప్పుడు చంద్రబాబు ఢిల్లీ పర్యటన తరువాత పొత్తుల వ్యవహారం పైన ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు.