వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబు మరో శ్వేతపత్రం: అమెరికాలో పరువు తీశారు

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం సాయంత్రం పారిశ్రామిక రంగం పైన శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెసు పార్టీ పైన నిప్పులు చెరిగారు. కేంద్ర యూపీఏ, రాష్ట్ర కాంగ్రెసు పాలన వల్ల అనేక పరిశ్రమలు మూత పడ్డాయన్నారు.

కాంగ్రెస్ పాలన వల్ల ఉన్న పరిశ్రమల్లో ముప్పై శాతానికి పైగా మూతపడ్డాయని ఆరోపించారు. 2004 నుండి 2009 వరకు రాష్ట్రంలో అవినీతి, అక్రమాలు కనిపిస్తే, 2009 నుండి 2014 వరకు అవినీతి, అనిశ్చితి కనిపించిందన్నారు. కాంగ్రెస్ విధానాల వల్ల రాష్ట్రం దివాళా తీసిందన్నారు.

అసమర్థ, అవినీతి, కుంభకోణాల కాంగ్రెసు పార్టీ వల్ల రాష్ట్రం భ్రష్టు పట్టిందన్నారు. కాంగ్రెసు పాలన వల్ల విద్యుత్ కూడా సరిగా లేకుండా పోయిందన్నారు. రాష్ట్రాన్ని పూర్తిగా అంధకారంలో పడవేశారన్నారు. గత పదేళ్ల పరిణామాల వల్ల రాష్ట్రానికి పెట్టుబడులు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2009 నుండి 2014 మధ్య రాష్ట్రంలో ఉద్యమాలు నడిచాయన్నారు.

కాంగ్రెసు పాలనలో ఐటీ, పర్యాటక రంగం పూర్తిగా దెబ్బతిన్నదన్నారు. పరిశ్రమలు మూతబడటం వల్ల రెండు లక్షలకు మంది పైగా ఉద్యోగాలు కోల్పోయారన్నారు. లేపాక్షి నాలెడ్జ్ పెద్ద గందరగోళమని, అది ఇప్పటి వరకు ప్రారంభం కాలేదన్నారు. ఇష్టానుసారంగా పేదల, రైతుల, ప్రభుత్వ భూములతో ఆడుకున్నారని ఆరోపించారు.

కాంగ్రెసు పాలన వల్ల రాష్ట్రానికి పెట్టుబడులు తగ్గాయన్నారు. కొందరి స్వార్థం వల్ల మనకు రావాల్సిన పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు వెళ్లాయన్నారు. వోక్స్ వాగన్ విశాఖకు రావాల్సి ఉన్నప్పటికీ రాలేదన్నారు. టాటా నానో రంగారెడ్డి జిల్లాకు రావాల్సింది రాలేదన్నారు. రెండు లక్షల ఎకరాలను రైతుల నుండి బలవంతంగా లాక్కున్నారన్నారు.

Chandrababu releases white paper on industries

ఇష్టారాజ్యంగా ప్రవర్తించి ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీశారన్నారు. కాంగ్రెసు పాలకులకు అవినీతి పైన ఉన్న శ్రద్ధ రాష్ట్రం పైన లేదన్నారు. అందుకే భ్రష్టు పట్టించారన్నారు. బ్రాహ్మణికి పదివేలకు పైగా ఎకరాలు, వాన్‌పిక్‌కు పంతొమ్మిది వేల ఎకరాలు అక్రమంగా కట్టబెట్టారన్నారు. ప్రజాప్రయోజనాలు పక్కన పెట్టి ఎక్కడ భూములు ఉన్నా దోచుకున్నారన్నారు.

ఓబుళాపురంలో అక్రమ మైనింగ్ జరిగిందన్నారు. ఓబుళాపురంలో ఫ్యాక్టరీ పెడతామని చెప్పి.. విదేశాలకు ఓర్‌ను తరలించి జైలుకు వెళ్లారన్నారు. కృష్ణా, గోదావరి, పెన్నా నదుల్లో ల్యాండ్ మాఫియా తయారయి.. కొన్ని వందల కోట్లను దోచుకుందన్నారు. ఇసుక ధరలు విపరీతంగా పెరిగేలా చేశారన్నారు. అలాగే భూగర్భ జలాలు ఇంకిపోయేలా చేశారని మండిపడ్డారు.

ప్రతి వ్యవహారంలో నీకది.. నాకిది అన్నట్లుగా వ్యవహరించారన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి జరిగిందని, అమెరికాలో కేసులు నమోదయ్యే పరిస్థితి వచ్చిందన్నారు.

మన వారు అమెరికాలో కూడా పరువును తీశారన్నారు. ఓ కాంగ్రెస్ ఎంపీకి నోటీసులు వచ్చాయని చెప్పారు. ఎక్కడ కూడా కొత్తగా విమానాశ్రయాలు రాలేదని చెప్పారు. విద్యుత్ కోతల వల్ల పరిశ్రమలు దెబ్బతిన్నాయన్నారు. తమ హయాంలో ప్రపంచవ్యాప్తంగా తిరిగి మంచి పేరు తెస్తే.. కాంగ్రెస్ హయాంలో కుంభకోణాలతో ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీశారన్నారు.

English summary
Andhra Pradesh CM Chandrababu Naidu has released white papers on Industries.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X