ఆ పదవుల ప్రకటనపై చంద్రబాబు జాప్యం .. ఆంతర్యం ఏమిటో ? టీడీపీలో ఆసక్తికర చర్చ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, టీడీపీ రాష్ట్ర కొత్త నాయకత్వ విషయంలో అధినేత చంద్రబాబు మౌనం తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఒకింత నైరాశ్యం కలిగిస్తుంది .ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపి కొత్త ఉత్సాహంతో పనిచేయడానికి, మరింత బలోపేతం కావడానికి, అధికార పార్టీని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి నాయకత్వ మార్పు జరుగుతుందని టిడిపి శ్రేణులు భావించారు. కానీ టిడిపి ఆదివారం పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులను మాత్రమే ప్రకటించి, అధ్యక్షుడి పేరును ప్రకటించకపోవడంతో టిడిపి శ్రేణుల్లో నిరాశ అలుముకుంది.
ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు... నాయకత్వ మార్పు టీడీపీకి లాభిస్తుందా ?

నూతన అధ్యక్షుడి పేరు ప్రకటించని టీడీపీ
టిడిపి ఏపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు పేరును ఖరారు చేసినట్లుగా వార్తలు బయటకు వచ్చిన విషయం తెలిసిందే. బీసీ నాయకుడికి, అందులోనూ ఉత్తరాంధ్ర నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకుడు అయిన అచ్చెన్నాయుడికి టీడీపీ ఏపీ అధ్యక్షులుగా పట్టం కడతారని ప్రచారం జోరుగా సాగింది . నూతన అధ్యక్షుడి పేరు ఈనెల 27వ తేదీన చంద్రబాబునాయుడు అధికారికంగా ప్రకటిస్తారని కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. టిడిపి శ్రేణులు కూడా నూతన అధ్యక్షుడు ఎవరు అని, చంద్రబాబు ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ చంద్రబాబు నాయుడు ఎలాంటి ప్రకటన చేయలేదు.

అచ్చెన్నా ? బీదా రవిచంద్ర నా బాబు ప్రకటన కోసం నిరీక్షణ
ఏపీ టిడిపి అధ్యక్ష రేసులో ఉన్న అచ్చెన్నాయుడు పేరు అధ్యక్షుడిగా ఖరారు అయిందని వార్తలు వచ్చిన తర్వాత అధ్యక్ష రేసులో బీద రవిచంద్ర పేరు కూడా ఉన్నట్లుగా కొత్త విషయం తెరమీదకు రావడంతో చంద్రబాబు ఎవరికి అవకాశం ఇవ్వబోతున్నారు అన్నది టీడీపీ శ్రేణుల్లో చర్చనీయాంశమైంది. ఏపీలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి రోజు రోజుకీ దిగజారుతున్న సమయంలో చంద్రబాబు నాయుడు ఏపీ నూతన అధ్యక్షుడిగా బృహత్తరమైన బాధ్యత ఎవరి మీద పెట్టబోతున్నారు అన్నది చర్చనీయాంశమైంది.

ఏపీ నూతన అధ్యక్షుడి విషయంలో చంద్రబాబు అంతర్మధనం
ప్రస్తుతం ఏపీలో టీడీపీ ఉన్న పరిస్థితిలో ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీని ముందుకు నడిపించటం కత్తిమీద సామే . సమర్ధంగా నడపగల నాయకుల కోసం గత కొంత కాలంగా అన్వేషిస్తున్న అధినేత చంద్రబాబు సామాజిక సమీకరణాలు , రాజకీయ సమీకరణాలను మాత్రమే కాకుండా ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీతో తలపడే శక్తి ఉన్న వారికి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు . ఇప్పటికే చాలా మంది సీనియర్ నాయకులు , మాజీ మంత్రులు ఏపీ ప్రభుత్వ తీరుతో వివిధ కేసుల్లో ఇబ్బంది పడుతున్నారు . అటు పార్టీలో అంతర్గత విబేధాలు రాకుండా, ఇటు అధికార పార్టీని ఎదుర్కొనేలా బలమైన నేతపై నిర్ణయం తీసుకోవటం అధినేతకు సవాల్ గా మారింది.

దసరాకైనా ప్రకటన ఉంటుందా ? టీడీపీ వర్గాల్లో చర్చ
నిన్న చంద్రబాబు ప్రకటన చేస్తాడని అందరూ భావిస్తే చంద్రబాబు ఎలాంటి ప్రకటన చేయకుండా టిడిపి శ్రేణులను నిరాశపరిచారు. అసలు చంద్రబాబు ఆంతర్యం బోధపడక టిడిపి నాయకులు ఆలోచనలో పడ్డారు . టీడీపీ నూతన అధ్యక్షుడు, అలాగే టిడిపి తెలుగు యువత అధ్యక్షుడిగా ఎవరికి చంద్రబాబు పట్టం కడతారనేది తెలియాల్సి ఉంది. ఈ దసరాకైనా చంద్రబాబు ఏపీ నూతన అధ్యక్షుడిని, టిడిపి తెలుగు యువత అధ్యక్షుడిని ప్రకటిస్తారా లేదా అనేది పార్టీ శ్రేణుల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది.