విజయ్ మాల్యాతో చంద్రబాబుకు లింక్ ..ఎస్కేప్ ప్లాన్ .. ఆలీబాబా 40 దొంగలు స్టోరీ చెప్పిన వైసీపీ ఎంపీ
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విరుచుకుపడుతున్నారు. తాజాగా తన సన్నిహిత మిత్రుడు ఒకరు లండన్లో దాక్కున్న ప్రముఖ పారిశ్రామికవేత్తను చంద్రబాబు నాయుడు కాంటాక్ట్ అయినట్లుగా తెలిసిందని, పరోక్షంగా విజయ్ మాల్యా తో చంద్రబాబుకి లింకు పెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు విజయ్ సాయి రెడ్డి.
చిట్టి నాయుడు దెబ్బ.. అచ్చెన్న అబ్బా.. చంద్రబాబు బట్టలు చించుకునేది అందుకే : విజయసాయి

అరెస్ట్ భయంతో ఎస్కేప్ ప్లాన్స్ లో చంద్రబాబు
ఏపీ ఈఎస్ఐ కుంభకోణంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్ అయ్యారని, ఇక వరుసగా టిడిపి నేతలు అరెస్ట్ అవుతున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు తనను ఎక్కడ అరెస్టు చేస్తారో అన్న భయంతో తప్పించుకోవడానికి మార్గాలు వెతుకుతున్నారని తీవ్ర విమర్శలు చేశారు.ట్విట్టర్ వేదికగా స్పందించిన విజయసాయి రెడ్డి చంద్రబాబును తూర్పారబట్టారు. టీడీపీ హయాంలో మంత్రులు దోచుకున్న ప్రజాధనంలో 60శాతం పెదబాబు, చిన్నబాబులకు ముడుపులుగా వెళ్లాయని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఆరోపణలు గుప్పించారు.

టీడీపీ హయాంలో దోచుకున్న మంత్రులు .. 60 శాతం పెదబాబు, చినబాబులకే
అచ్చెన్న,ఉమా, కాల్వ, యనమల, పరిటాల, నారాయణ ఇలా టిడిపి హయాంలోనే మంత్రులు ప్రజా ధనాన్ని దోచుకుని, దోచుకున్న దాంట్లో నుంచి 60 శాతం పెదబాబు చంద్రబాబుకు, చిన్న బాబు లోకేష్ కు ముడుపులు అందించారు అంటూ వ్యాఖ్యానించారు. అందుకే వారు అవినీతిని ప్రోత్సహించారు. ఇప్పుడు మాత్రం నోట్లో వేలుపెడితే కొరకలేని అమాయకుల్లా నాటకాలాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని విజయసాయి విమర్శించారు.

గత ఎన్నికల సమయంలో బాబు ఫండింగ్ అంతా ఇదేనా ?
ఇక చంద్రబాబు నాయుడు,ఆయన కుమారుడు లోకేష్ ఇద్దరూ కరోనా లాక్ డౌన్ సమయంలో హైదరాబాద్ సేఫ్ జోన్ గా ఫీల్ అయ్యి అక్కడే ఉన్నారని, ఇక ఇప్పుడు విచారణ సంస్థలు టిడిపి అవినీతిని విచారిస్తున్న సమయంలో ఎక్కడ దాక్కోవాలని వెతుకుతున్నారని ఆయన విమర్శించారు. ఒక చిన్న రాష్ట్రం సీఎంగా ఉండి కిందటి ఎన్నికల్లో కాంగ్రెస్, ఎనిమిది ప్రాంతీయ పార్టీలకు వేల కోట్ల ఫండింగ్ చేశారని, ఇక అంత డబ్బు ఈయనకు ఎక్కడి నుంచి వచ్చిందని అప్పట్లో జాతీయ మీడియా ఆశ్చర్యం వ్యక్తం చేసిందని పేర్కొన్నారు.

ఆలీబాబా 40 దొంగలు స్టోరీ అంతా మోడీ, అమిత్ షాలకు తెలుసు
ఇక బాబుగారి ఆలీబాబా 40 దొంగలు స్టోరీ అంతా మోడీ, అమిత్ షా గార్లకు తెలుసు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు విజయసాయిరెడ్డి. ఏదేమైనా తాజా పరిణామాల నేపథ్యంలో అవినీతిపై విచారణ సందర్భంగా చంద్రబాబు ఎక్కడికి పారిపోవాలా అని చూస్తున్నారని పరోక్షంగా విజయ్ మాల్యాతో లింకు పెట్టి చంద్రబాబుని టార్గెట్ చేశారు. చివరకు చంద్రబాబును ఆర్ధిక నేరగాడు అయిన విజయ్ మాల్యాతో పోల్చి వ్యంగ్యాస్త్రాలు సంధించారు వైసీపీ ఎంపీ విజయసాయి .